చిత్తూరులోని జిల్లా క్షయ నివారణ సంస్థ
కూతురు వయస్సున్న ఓ మహిళా వైద్యురాలిని ఫోన్‌లో వేధింపులకు గురిచేసినందుకు చెప్పుతో సమాధానం చెప్పారు ఆమె. అయినా సరే ఆ శాఖలో కొందరు సిబ్బంది తీరులో మాత్రం మార్పు రాలేదు. ఎప్పటిలాగే వెకిలి చేష్టలు చేస్తూ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై దృష్టి సారించాల్సిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మిన్నకుండడం విమర్శలకు తావిస్తోంది.
సాక్షి, చిత్తూరు అర్బన్: చిత్తూరు ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలోని జిల్లా క్షయ నివారణ శాఖ విభాగంలో ఓ మహిళా వైద్యురాలిని లైంగికంగా వేధించడం.. ప్రశ్నించడానికి వచ్చిన ఆమె తల్లిపై దాడికి ప్రయత్నించగా జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ రమేష్‌బాబును శనివారం జూనియర్ డాక్టర్ చెప్పుతో కొట్టిన విషయం తెలిసిందే. ఇదే విషయం ‘సాక్షి’ దినపత్రిలో ప్రచురితమయ్యింది. ఇంత జరిగినా ఇక్కడున్న కొందరు సిబ్బంది తీరు మారలేదు. మహిళా డాక్టర్‌కు జరిగిన అన్యాయంపై ప్రశ్నించి, ఆమెకు అండగా నిలవాల్సిన వారే ఒత్తిడి తీసుకొచ్చారు. సోమవారం యధావిధిగా మహిళా డాక్టర్ చిత్తూరులోని క్షయ నివారణ విభాగంలో విధులకు హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు ఆస్పత్రికి చేరుకుని బయోమెట్రిక్ హాజరు వేయడానికి వెళ్లగా పరికరం ఉన్న గదికి తాళాలు వేసేశారు. హాజరుపట్టికలో సంతకం చేయడానికి వెళ్లగా ఆ గదిని కూడా మూసేశారు.
తాళాలు తీయమని సిబ్బందిని కోరితే.. ‘మేడం ఎందుకు ఆయనతో గొడవ. జరిగిందేదో జరిగిపోయింది. మీరు ఓ పది రోజులు లీవు పెట్టి వెళ్లిపోండి. ఎవరైనా ఎన్‌క్వైరీకి వస్తే నేనేదో ఫ్రెస్టేషన్‌లో అలా చేశానని చెప్పండి. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ మహిళా డాక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. ఘటనపై ఎవరైనా విచారణకు వస్తే అసలు ఇక్కడ ఏమీ జరగలేదని చెప్పమని కూడా బలవంతం చేశారు. తీరా మహిళా డాక్టర్ ఇందుకు అంగీకరించకపోవడంతో సిబ్బంది తాళాలు తీసి బయోమెట్రిక్, హాజరుపట్టికను బయట ఉంచారు. పనిచేసే చోట మహిళా వైద్యురాలిపై వేధింపులకు పాల్పడ్డ వైద్యుడిలో కనీస పశ్చాత్తాపం లేకపోగా కిందిస్థాయి సిబ్బందికి చెప్పి తనను మళ్లీ ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆమె తన స్నేహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. మరోవైపు ఈ ఘటన జరిగిన మూడు రోజులవుతున్నా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దీనిపై ఎలాంటి విచారణకూ ఆదేశించకుండా మిన్నకుండటం విమర్శలకు దారితీస్తోంది.
జిల్లా ప్రభుత్వ వైద్యశాలల సేవల సమన్వయాధికారిణి డాక్టర్ సరళమ్మ మాత్రం ఏం జరిగిందనే విషయాన్ని మహిళా డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. వైద్య వృత్తికే కళంకం తెచ్చే ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని జిల్లా ప్రభుత్వ వైద్యుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు డాక్టర్ పాల్‌రవికుమార్ ఖండించారు. డాక్టర్ రమేష్‌బాబును సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు పెట్టాలని ప్రగతిశీల మహిళా సంఘం చిత్తూరు నగర కార్యదర్శి కె.రమాదేవి డిమాండ్ చేశారు. బాధిత మహిళా డాక్టర్ మాత్రం దీనిపై వెనక్కు తగ్గేది లేదని, తనకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకుండా ఉండాలంటే వక్రబుద్ధి ఉన్న వైద్యుడిపై చర్యలు తీసుకోవాల్సిందేనని తోటి సిబ్బంది వద్ద ఖరాఖండీగా చెబుతున్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగి వచ్చేశారు. తాను గతంలో రాజీనామా చేసిన పత్రాన్ని ఆ వైద్యుడు మార్చి రాసుకోవడం, ఫోన్‌లో తనతో మాట్లాడిన అసభ్య పదాలు, దాడి జరిగిన సమయంలో తీసిన పలు వీడియో క్లిప్పింగులను నేరుగా కలెక్టర్‌కు చూపించడానికి సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment