ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
కంపెనీ వద్ద కార్మికుల ఆందోళన
రూ. 26 లక్షల ఎక్స్‌గ్రేషియాకు యాజమాన్యం అంగీకారం
నక్కపల్లి: మండలంలోని హెటిరో డ్రగ్స్ కంపెనీలో బుధవారం సాయంత్రం జరిగిన ప్రమాదం ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందగా, ఇ ద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పాత ఇనుప తుక్కు నిల్వ చేసే గోదాం వద్ద ఒక డ్రమ్మును కట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ప్రమాదంలో నక్కపల్లికి చెందిన టీకాయల అప్పారావు(35) అనే కార్మికు డు అక్కడక్కడే మృతి చెందాడు. ఇదే గ్రామానికి చెందిన ఏనుగుపల్లి సిం హాచలం, హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ గాయపడ్డారు. వీరిని విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో నేలపై కెమికల్స్ ఉండటంవల్ల నిప్పురవ్వలు పడి పేలుడు సంభవించినట్టు భావిస్తున్నారు. సంఘటన స్థలం నుంచి అప్పారావు మృతదేహాన్ని, క్షతగాత్రులను హుటాహుటిన వేరొక ప్రాంతానికి తరలించడంపై వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక నాయుకులతో కలసి కంపెనీ ముందు ఆందోళకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనిత, వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు వీసం రామకృష్ణ, మండల టీడీపీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ తదితరులు కంపెనీ వద్దకు వెళ్లి ప్రమాదం వివరాలను యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు.
బాధిత కుటుంబాలకు చెప్పకుండా మృతదేహాన్ని, క్షతగాత్రులను ఎందుకు తరలించారని యాజమాన్యాన్ని నిలదీశారు. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యలమంచిలి సీఐ వెంకటరావు, కొత్తకోట సీఐ మల్లేశ్వరరావు, ఎస్‌ఐ రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అప్పారావుకు భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. క్షతాగాత్రుడు సింహచలంది అదే పరిస్థితి. ఇద్దరూ నక్కపల్లి ఎస్సీకాలనీకి చెందిన వారు కావడంతో కాలనీ వాసులు కంపెనీ ముందు అధిక సంఖ్యలో గుమికూడారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేసే వరకు ఆందోళన కొన సాగిస్తామని కార్మిక సంఘ నాయకులు తెలిపారు. అప్పారావు మృత దేహాన్ని యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్త్నుట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.
మృతుడి కుటుంబానికి రూ.26 లక్షలు
కర్మాగారంలో జరిగిన సంఘటనలో మృతుడి కుటుంబానికి రూ.26లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది. అదే విధంగా క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో చికిత్స ఖర్చు భరించేందుకు నిర్ణయం తీసుకుంది.