అత్తెసరు | DSC -14 process starts | Sakshi
Sakshi News home page

అత్తెసరు

Published Thu, Nov 27 2014 1:49 AM | Last Updated on Fri, May 25 2018 5:44 PM

అత్తెసరు - Sakshi

అత్తెసరు

ఏలూరు సిటీ :డీఎస్సీ-14 ప్రక్రియ ప్రారంభం కావటంతో నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో ఆనందం వ్యక్తమవుతున్నా.. భర్తీ చేసే పోస్టుల సంఖ్య చూసి దిగాలు పడుతున్నారు. తొలుత 601 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు జిల్లా విద్యాశాఖ సర్కారుకు నివేదించింది. కానీ, ప్రభుత్వం మాత్రం డీఎస్సీ-14 నోటిఫికేషన్‌లో 69 పోస్టులకు కోతవేసి 532 పోస్టులను మాత్రమే భర్తీ చేయనుంది. వీటిలోనూ 137 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉండటం విశేషం. వీటిని మినహాయిస్తే, కొత్తగా 395 పోస్టులు మాత్రమే భర్తీ చేయనున్నారు. బ్యాక్‌లాగ్ కాకుండా 601 పోస్టులను భర్తీ చేస్తేనే పోటీ తీవ్రస్థాయిలో ఉంటుందని, పోస్టులను కుదించడంతోపాటు బ్యాక్‌లాగ్ పోస్టులను సైతం అందులో కలపడం వల్ల పోటీ మరింత తీవ్రమవుతుందని నిరుద్యోగ ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు.
 
 రోస్టర్ సంగతేంటి!
 రోస్టర్ ఆధారంగా ప్రతి విభాగంలోనూ ఆయా వర్గాలకు కనీసం ఒక్కొక్క పోస్టు అయినా దక్కే పరిస్థితి ఉంటుందా లేదా అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓపెన్ కేటగిరీలో అర్హత సాధించాలంటే కష్టసాధ్యంగా మారిన నేపథ్యంలో రోస్టర్ విధానాన్ని అమలు చేస్తారో లేదోననే అనుమానాలను అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. పోస్టుల్లోనూ కోతజిల్లాలో మొత్తంగా 532 పోస్టులు మాత్రమే డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. వాటిలో స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ పోస్టులు 123 కాగా, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 341, లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 68 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జాబితాలను జిల్లా విద్యాశాఖ రూపొందిస్తోంది. రెండు రోజుల్లో రోస్టర్‌ను పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. వీటిలో క్లియర్ వేకెన్సీ పోస్టులు 395 ఉండగా, 137 బ్యాక్‌లాగ్ పోస్టులున్నాయి. మొత్తంగా 374 పోస్టులు మైదాన ప్రాంతంలోను, 120పోస్టులు ఏజెన్సీ పరిధిలోను ఉన్నాయి. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలోని 38 పోస్టుల్లో 21 క్లియర్ వేకెన్సీ కాగా, 17 పోస్టులు బ్యాక్‌లాగ్‌లో ఉన్నాయి.
 
 నోటిఫైడ్ పోస్టులు ఇలా..
 డీఎస్సీ-14లో నోటిఫైడ్ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో గణితం పోస్టులు 17, బయోలాజికల్ సైన్సు 22, సోషల్ స్టడీస్ 50, ఏజెన్సీలో ఒక పోస్టు, ఇంగ్లిష్ 6, తెలుగు 19, హిందీ 4, సంస్కృతం 3, ఉర్దూ ఒక పోస్టు చొప్పున నోటిఫై చేశారు. భాషా పండిట్ తెలుగు 20, హిందీ 36, సంస్కృతం 12 పోస్టుల చొప్పున ఉన్నాయి. సెకండరీ గ్రేడ్ తెలుగు పోస్టులు మైదాన ప్రాంతంలో 341, ఏజెన్సీలో 36 పోస్టులు ఉన్నాయి.
 
 ని‘బంధనాలు’
 ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు సంబంధించి సర్కారు జారీ చేసిన నిబంధనలు అభ్యర్థుల ఆశలకు బంధాలు వేసేలా ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెట్ కమ్ టెర్ట్ పరీక్షకు దరఖాస్తు చేసేవారికి సవాలక్ష నిబంధనలు విధించటంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెన్త్, ఇంటర్ చదివితేనే పరీక్షకు అర్హులుగా పేర్కొనటం దారుణమని, కేంద్ర ప్రభుత్వ గుర్తింపుతో ఓపెన్ డిగ్రీ చేసి, బీఈడీ పూర్తిచేసిన వారికి డీఎస్సీకి అర్హత లేదంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడో టెట్ పరీక్ష రాసిన అభ్యర్థులకు ఇప్పుడు 20 శాతం వెయిటేజీ ఇవ్వటంపైనా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోస్టులను తక్కువ చేసి చూపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. బీఈడీ అభ్యర్థులకు సెకండరీ గ్రేడ్ పోస్టుల్లో అవకాశం లేకపోవటం, పీఈటీ అభ్యర్థులకు అన్యాయం చేస్తూ ఒక్క పోస్టూ భర్తీ చేయకపోవటంపై చాలామంది అభ్యర్థులు తీవ్ర నిరాశలో ఉన్నారు. టెట్ కమ్ టెర్ట్ పరీక్ష షెడ్యూల్ సాగదీయడంపైనా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement