డీఎస్సీ కష్టాలు
ఏలూరు సిటీ :ఉపాధ్యాయ పోస్టుల నియామక ప్రక్రియలో జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ)-14 అనుసరిస్తున్న విధానాలతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిబంధనల పేరుతో దరఖాస్తుదారుల ఆశలకు విద్యాశాఖ కళ్లెం వేస్తోంది. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందా.. లేదా.. అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. మొన్నటివరకూ దూర విద్యా విధానంలో డిగ్రీ చదివిన వారు డీఎస్సీకి అనర్హులంటూ ఇబ్బంది పెట్టిన సర్కారు తాజాగా బీకాం అభ్యర్థులతో ఆటలాడుతోంది. విశ్వవిద్యాలయ నిబంధనల మేరకు ప్రవేశపెట్టిన కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులకు డీఎస్సీలో దరఖాస్తు చేసే అవకాశం లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్శిటీ చేసిన తప్పునకు తమను బాధ్యులను చేయడం ఎంతవరకు సబబు అంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ దరఖాస్తుకు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో చోటుచేసుకున్న తప్పులకు వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీఎస్సీకి జిల్లాలో ఇప్పటివరకు కేవలం 2,500 దరఖాస్తులు మాత్రమే వచ్చాయంటే సర్కారు పెడుతున్న ఇబ్బందులు ఎంత దారుణంగా ఉన్నాయో అవగతమవుతోంది.
బీకాం విద్యార్థుల గోడు
డీఎస్సీకి బీకాం విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు నానాతంటాలు పడుతున్నారు. వారిచ్చే దరఖాస్తులను స్వీకరించేందుకు విద్యాశాఖ నిరాకరిస్తోంది. ఇంతకాలం డీఎస్సీ కోసం వేచిచూస్తే ఇప్పుడు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లేదని చెప్పడం దారుణమంటూ బీకాం చదివిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము యూనివర్శిటీ ప్రవేశపెట్టిన కోర్సునే చదివామని, ఇప్పుడు దానికి అర్హత లేదంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. 2008 వరకు బీకాంలో ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ సబ్జెక్టు ఉండేదని, దాన్ని చదివిన పాపానికి ఇప్పుడు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయిందని చెబుతున్నారు. డీఎస్సీలో దరఖాస్తు చేసేందుకు నాలుగు సబ్జెక్టులు ఆప్షనల్‌గా ఉండాలని చెప్పారని, అందులో ఫైనాన్షియల్ అకౌంటెన్సీ, బిజినెస్ ఎకానమిక్స్, క్వాంటిటీ టెక్నిక్స్ సబ్జెక్టులు ఉండగా ఇప్పుడు ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ సబ్జెక్టు విషయంలో ఇబ్బందులు పెడుతున్నారని చెబుతున్నారు. కేవలం పేరులో మాత్రమే బిజినెస్, ఇండస్ట్రియల్ అనే తేడా కనిపిస్తుందని, సబ్జెక్టులో మాత్రం ఒకేవిధంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. దీనిపై విశ్వవిద్యాలయ అధికారులు చర్యలు చేపట్టాలని, చేసిన తప్పును సరిదిద్దుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో బీకాం, బీఎడ్ చేసిన అభ్యర్థులు సుమారు 3 వేల వరకు ఉన్నట్టు తెలుస్తోంది.
గడువు పెంచాలి
డీఎస్సీలో దరఖాస్తు చేసే అభ్యర్థులది ఒక్కొక్కరిది ఒక్కో సమస్యగా ఉంది. డిప్లొమో ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్)అభ్యర్థులు డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే గడువు పెంచాలని కోరుతున్నారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిసినా ప్రొవిజినల్ సర్టిఫికెట్లు తమకు రావడానికి నెల రోజులు పడుతుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని గడువు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 27నుంచి పరీక్షలు నిర్వహిస్తున్న దృష్ట్యా ప్రభుత్వం దీనిపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రభుత్వ విధానాల కారణంగానే తమకు పరీక్షలు ఆలస్యమయ్యాయని ఇప్పుడు సర్టిఫికెట్ల పేరుతో దరఖాస్తుకు అవకాశం ఇవ్వకుంటే మరో డీఎస్సీ వరకు వేచిచూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 2500 మంది డీఎడ్ అభ్యర్థులు దరఖాస్తు చేయకుండా ప్రభుత్వ ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడు దరఖాస్తుకు అవకాశం కల్పించి సర్టిఫికెట్లు సమర్పించేందుకు నెల రోజులు గడువు ఇవ్వాలంటూ అభ్యర్థిస్తున్నారు.
అధికారుల తీరుతో ఇబ్బందులు
డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణలో విద్యాశాఖ అధికారుల తీరుతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ నిబంధనల మాటెలా ఉన్నా, దరఖాస్తులు స్వీకరించే అధికారులు మాత్రం చుక్కలు చూపిస్తున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన పేరుతో అభ్యర్థులను దరఖాస్తు చేయకుండా ఇంటికి పంపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తును స్వీకరించినా డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లల్లో మాత్రం దరఖాస్తులను స్వీకరించేందుకు నిరాకరించడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై అధికారులను ప్రశ్నించగా తాము నిబంధనలు పాటిస్తున్నామని సమాధానమిస్తున్నారు.