డీఎస్సీ ఫలితాలు విడుదల
సాక్షి, విశాఖపట్నం: డీఎస్సీ-2014(టెట్ కమ్ టీఆర్‌టీ)లో 37.57 శాతం మంది అర్హత సాధించారు. డీఎస్సీ-2014 ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలో మంగళవారం విడుదల చేశారు. 10,313 టీచర్ పోస్టుల భర్తీకోసం గత నెల తొమ్మిదో తేదీ నుంచి మూడ్రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా 2,560 పరీక్ష కేంద్రాల్లో డీఎస్సీని నిర్వహించడం తెలిసిందే. పరీక్షలకు 3,68,161 మంది హాజరవగా.. 1,38,344 మంది(37.57 శాతం) అర్హత సాధించారు. ఓసీ కేటగిరీ అభ్యర్థులకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 40 శాతం చొప్పున అర్హత మార్కులుగా నిర్ణయించారు.
మార్కుల వివరాలను హాల్‌టికెట్ ప్రకారం.. జ్ట్టిఞట://్చఞఛీటఛి.ఛిజజ.జౌఠి.జీలో చూడవచ్చు. ఓఎంఆర్ షీట్ ప్రింటెడ్ కాపీని అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా ఈ నెల 4 నుంచి జూలై 3వ తేదీ వరకూ రూ.20 చెల్లించి మీసేవ కేంద్రాల్లో పొందవచ్చు. అలాగే పుట్టినతేదీ, కులం, ఎక్స్‌సర్వీస్‌మెన్, టెట్ వెయిటేజీ, పీహెచ్ కేటగిరి వివరాల్లో మార్పుచేర్పులుంటే ఈనెల 3 నుంచి 5వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా వెబ్‌సైట్ ద్వారా సరిచేసుకునే అవకాశం కల్పించారు.
కొంతమందికి నిరీక్షణ: 2,192 మంది ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచారు. కోర్టు నుంచి వెలువడే ఆదేశాలననుసరించి 2,187 మంది ఫలితాలను తర్వాత వెల్లడిస్తారు. అలాగే సర్టిఫికెట్లలో తేడా ఉన్న వివరాలను పరిశీలించేందుకు ఐదుగురి ఫలితాలను తాత్కాలికంగా నిలిపేశారు. ఆయా అభ్యర్థులు హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో ఈనెల 6వ తేదీలోగా సంప్రదించాలి.
9వ తేదీకల్లా జాబితాలు సిద్ధం:
రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లు ఆధారంగా అభ్యర్థుల మెరిట్ జాబితాను 9వ తేదీకల్లా రూపొందిస్తారు. ఆన్‌లైన్‌లో ర్యాంక్‌కార్డును అభ్యర్థులు అదే రోజు పొందవచ్చు. ఆ ప్రకారం 15వ తేదీకల్లా టీచర్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు.
ఫలితాల్లోనూ గందరగోళం
డీఎస్సీ-2014 ఫైనల్ ‘కీ’లో 13 తప్పులను గుర్తించి సవరించిన పాఠశాల విద్యాశాఖ... మంగళవారం విడుదల చేసిన తుది ఫలితాల్లోనూ పాత ఒరవడినే కొనసాగించింది. అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య విషయంలోనూ తేడా కనిపించింది.