ఏలూరు సిటీ :జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ)-14 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో బాగంగా పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు జిల్లా విద్యాధికారి డి.మధుసూదనరావు చెప్పారు. స్థానిక డీఈఓ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు శుక్రవారం సాయంత్రం లోగా వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని కోరారు. జిల్లాలో ఖాళీల వివరాలు డీఈఓ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని, ఖాళీగా ఉన్న ప్రతి స్థానానికి అభ్యర్థులు విధిగా ఆప్షన్లు ఇవ్వాలని, వెబ్ ఆప్షన్లు పెట్టుకోకుంటే ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. జిల్లాలో నోటిఫైడ్ పోస్టులు 519 ఉంటే వాటిలో 434 పోస్టులు భర్తీ చేస్తున్నామని, మరో 85 పోస్టులకు ఆయా కేటగిరీల్లో అభ్యర్థులు లేక పోస్టులు బ్యాక్‌లాగ్‌లోకి వెళతాయన్నారు.
పోస్టుల భర్తీ ఇలా.. డీఎస్సీలో నోటిఫైడ్ పోస్టులు
డీఎస్సీ-14లో ప్రభుత్వం 519 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు ప్రకటించింది. వీటిలో సెకండరీ గ్రేడ్ తెలుగు పోస్టులు ఏజెన్సీలో 36, జనరల్ 305, మున్సిపాల్టీల్లో 85, మొత్తం 426 పోస్టులు ఉన్నాయి. ఎస్జీటీ ఉర్దూలో మున్సిపల్ యాజమాన్యంలో 7 పోస్టులు ఉన్నాయి. లాంగ్వేజ్ పండిట్ తెలుగు పోస్టుల్లో ప్లెయిన్ ఏరియాలో 20, మునిసిపాల్టీల్లో 7 పోస్టులు ప్రకటించారు. లాంగ్వేజ్ పండిట్ హిందీలో ఏజెన్సీలో 1 పోస్టు, ప్లెయిన్ ఏరియాలో 35, మునిసిపాల్టీల్లో 5 పోస్టులు ఉన్నాయి. లాంగ్వేజ్ పండిట్ సంస్కృతంలో ప్లెయిన్ ఏరియాలో 12, మునిసిపాల్టీల్లో 6 పోస్టులు ప్రకటించారు.
భర్తీ చేసే పోస్టుల వివరాలు
ప్రభుత్వం డీఎస్సీలో ఎంపిక చేసిన అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఎస్‌జీటీ తెలుగులో 426 పోస్టులకు గానూ 359 భర్తీ చేస్తున్నారు. ఎస్జీటీ ఉర్దూలో 7 పోస్టులకు ఒక్క పోస్టు మాత్రమే భర్తీ చేశారు. ఎల్‌పీ తెలుగులో 27 పోస్టులూ భర్తీ చేస్తున్నారు. ఎల్‌పీ హిందీలో 41పోస్టులకు గానూ 40 పోస్టులు, ఎల్‌పీ సంస్కృతంలో 17 పోస్టులకు 6 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అభ్యర్థుల్లేని పోస్టులు
ఉపాధ్యాయ పోస్టుల నియామకాల్లో మెరిట్ కమ్ రోస్టర్, రిజర్వేషన్ల ఆధారంగా ఆయా కేటగిరీల్లో అర్హులైన అభ్యర్థులు లేక 85 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఎస్జీటీ తెలుగులో 67 పోస్టులు, ఎస్జీటీ ఉర్దూలో మున్సిపాల్టీ యాజమాన్యంలో 6 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ హిందీలో ఒకటి, లాంగ్వేజ్ పండిట్ సంస్కృతంలో 11 పోస్టులు అభ్యర్థుల్లేక బ్యాక్‌లాగ్‌లోకి వెళ్లనున్నాయి.
డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు వెబ్ ఆప్షన్లు
Published Fri, Mar 18 2016 1:24 AM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM
Advertisement
Advertisement