పామిడి/గుత్తి, న్యూస్‌లైన్ : అయ్యో.. దేవుడా ఎంతపనిచేశావ్. ఇక మాకు దిక్కెవరు.. అంటూ కుటుంబ పెద్దదిక్కును కోల్పోయిన వెంకటనారాయణ కుటుంబ సభ్యులు దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. 44వ జాతీయ రహదారిపై భారత్ పెట్రోల్ బంక్- గుత్తి ఎస్కేడీ ఇంజనీరింగ్ కళాశాల మధ్య బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాయలచెరువుకు చెందిన నారాయణస్వామి (38) దుర్మరణం చెందాడు. ఇతని కుమారుడు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. పెద్దవడుగూరు ఎస్‌ఐ శివగంగాధర్‌రెడ్డి కథనం మేరకు... లారీ డ్రైవర్ వెంకటనారాయణ తన కుమారుడు నారాయణస్వామి(11)ని అనంతపురం సమీపంలోని సోములదొడ్డిలోని కార్పొరేట్ స్కూల్‌లో వదిలేందుకని బుధవారం బైక్‌పై బయల్దేరాడు. సరిగ్గా భారత్ పెట్రోల్ బంక్‌వద్దకు రాగానే వెనుకవైపు నుంచి వచ్చిన తమిళనాడు లారీ వేగంగా ఢీకొంది.
ఈ ప్రమాదంలో వెంకటనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తీవ్రంగా గాయపడిన నారాయణస్వామికి మాటపడిపోయింది. స్థానికులు హుటాహుటిన బాలుడిని గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి పంపించారు. వెంకటనారాయణ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న భార్య వెంకటలక్ష్మి, కుమార్తె శ్రావణి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. భర్త ప్రాణం పోయి.. కుమారుడు మాట కోల్పోయాక ఇక తాము ఎలా బతకాలిరా దేవుడా అంటూ గుండెలు బాదుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశం తమ పరిధిలో లేదంటూ వెంకటనారాయణ మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు గుత్తిలో వైద్యులు నిరాకరించడంతో పామిడికి తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించారు.
మాకు దిక్కెవరు దేవుడా..
Published Thu, Dec 12 2013 3:27 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM
Advertisement
Advertisement