పేరుకుపోతున్న నీటి పన్ను బకాయిలు
చీమకుర్తి, గిద్దలూరులలో అత్యల్ప వసూలు
15 ఏళ్ల నుంచి పైసా కట్టని ప్రభుత్వ సంస్థలు
మొండి బకాయిలపై కొనసాగుతున్న నిర్లక్ష్యం
ఒంగోలు, న్యూస్‌లైన్:
మున్సిపాలిటీల్లో పన్ను బకాయిలు పేరుకుపోతున్నాయి. నీటిపన్ను బకాయిలు సైతం చెల్లించడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో పది నెలలు గడిచినా ఇప్పటి వరకు వసూలు చేసింది 23.44 శాతం పన్నులు మాత్రమే. నూరు శాతం పన్నుల వసూలు లక్ష్యంగా ఆర్థిక సంవత్సరం చివరిలో ఒత్తిడి తెస్తున్న అధికారులు మొండిబకాయిలపై దృష్టి సారించడం లేదు.
మున్సిపాల్టీ వారీగా వసూళ్ల వివరాలు:
ఒంగోలు నగరపాలక సంస్థలో ఈ ఏడాది మార్చి నాటికి నివాస కుటుంబాల నుంచి వసూలుచేయాల్సిన నీటిపన్ను *197.02 లక్షలు. ఇక ప్రభుత్వ సంస్థల నుంచి వసూలు చేయాల్సిన మొత్తం *149.69 లక్షలు. ప్రభుత్వ సంస్థల బకాయిలను పరిశీలిస్తే దాదాపు 15 ఏళ్లుగా పైసా కూడా కట్టకపోవడం గమనార్హం. ఈ ఏడాది ప్రభుత్వ బకాయి *6.24 లక్షలు కాగా పాత బకాయి *143.45 లక్షలు ఉందంటే పన్ను కట్టి ఎన్ని ఏళ్లయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రజల నుంచి *197.02 లక్షలకుగాను ఇప్పటి వరకు *65.63 లక్షలు వసూలు చేశారు.
కందుకూరులో *35.63 లక్షలు వసూలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు వసూలైన మొత్తం *19.71 లక్షలు.
చీరాలలో *62.14 లక్షలకుగాను *20.33 లక్షలు వసూలు చేశారు.
మార్కాపురంలో *59.44 లక్షలకుగాను *16.93 లక్షలు వసూలు చేశారు.
అద్దంకి నగర పంచాయతీలో *28.01 లక్షలకుగాను *18.25 లక్షలు వసూలు చేశారు.
చీమకుర్తి నగర పంచాయతీ పరిస్థితి పూర్తి భిన్నం. ఈ నగర పంచాయతీలో *20.14 లక్షల నీటిపన్ను వసూలు కావాల్సి ఉండగా అందులో వసూలైంది *40 వేలు మాత్రమే.
కనిగిరి నగర పంచాయతీలో *19.55 లక్షలకుగాను వసూలైన మొత్తం *4.28 లక్షలు.
గిద్దలూరు నగర పంచాయతీలో *72.66 లక్షలకుగాను వసూలైన మొత్తం *5.51 లక్షలు.
చీమకుర్తి, కనిగిరి నగర పంచాయతీల్లో నీటి పన్ను వసూలు మరీ దారుణంగా ఉంది.
ప్రస్తుత, పాత బకాయిల వివరాలు:
2013-14 ఆర్థిక సంవత్సరంలో అన్ని మున్సిపాల్టీల్లో కలిపి *278.01 లక్షలు వసూలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు వసూలైన మొత్తం * 87.5 లక్షలు.
2013-14 సంవత్సరంలో *366.27 లక్షల పాత బకాయిలు వసూలు చేయాలి. కానీ ఇప్పటి వరకు వసూలు చేసిన మొత్తం *63.54 లక్షలు మాత్రమే. అంటే ఇంకో రెండు నెలల్లో వసూలు చేయాల్సిన పాత బకాయిలు *302.73 లక్షలు.
ప్రస్తుతం పన్ను చెల్లించకుండా పెనాల్టీకి గురైన వారు 37,122 మంది. వారిలో 877 మంది మాత్రం పెనాల్టీలు చెల్లించారు. ఇంకా 36,245 మంది జరిమానాలు చెల్లించాలని గుర్తించారు.
అధికారులు మాత్రం నీటిపన్ను, ఇంటి పన్ను రెండూ కట్టాల్సిందేనని ట్యాపులు పీకేస్తున్నారు. అయితే ఇదే విధానాన్ని 15 ఏళ్లకుపైగా పన్ను కట్టని ప్రభుత్వ సంస్థల విషయంలో పాటించడం లేదు.
బకాయిల గుదిబండ
Published Tue, Feb 4 2014 3:40 AM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM
Advertisement
Advertisement