cheema kurthi
-
రెండు బైక్‌లు ఢీ; ఇద్దరు మృతి
ప్రకాశం: జిల్లాలోని చీమకుర్తి మండలం రామతీర్థం వద్ద గురువారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చీమకుర్తి మండలం, రామతీర్థం వద్ద ఎదురెదుగా వెళ్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
బకాయిల గుదిబండ
పేరుకుపోతున్న నీటి పన్ను బకాయిలు చీమకుర్తి, గిద్దలూరులలో అత్యల్ప వసూలు 15 ఏళ్ల నుంచి పైసా కట్టని ప్రభుత్వ సంస్థలు మొండి బకాయిలపై కొనసాగుతున్న నిర్లక్ష్యం ఒంగోలు, న్యూస్‌లైన్: మున్సిపాలిటీల్లో పన్ను బకాయిలు పేరుకుపోతున్నాయి. నీటిపన్ను బకాయిలు సైతం చెల్లించడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో పది నెలలు గడిచినా ఇప్పటి వరకు వసూలు చేసింది 23.44 శాతం పన్నులు మాత్రమే. నూరు శాతం పన్నుల వసూలు లక్ష్యంగా ఆర్థిక సంవత్సరం చివరిలో ఒత్తిడి తెస్తున్న అధికారులు మొండిబకాయిలపై దృష్టి సారించడం లేదు. మున్సిపాల్టీ వారీగా వసూళ్ల వివరాలు: ఒంగోలు నగరపాలక సంస్థలో ఈ ఏడాది మార్చి నాటికి నివాస కుటుంబాల నుంచి వసూలుచేయాల్సిన నీటిపన్ను *197.02 లక్షలు. ఇక ప్రభుత్వ సంస్థల నుంచి వసూలు చేయాల్సిన మొత్తం *149.69 లక్షలు. ప్రభుత్వ సంస్థల బకాయిలను పరిశీలిస్తే దాదాపు 15 ఏళ్లుగా పైసా కూడా కట్టకపోవడం గమనార్హం. ఈ ఏడాది ప్రభుత్వ బకాయి *6.24 లక్షలు కాగా పాత బకాయి *143.45 లక్షలు ఉందంటే పన్ను కట్టి ఎన్ని ఏళ్లయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రజల నుంచి *197.02 లక్షలకుగాను ఇప్పటి వరకు *65.63 లక్షలు వసూలు చేశారు. కందుకూరులో *35.63 లక్షలు వసూలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు వసూలైన మొత్తం *19.71 లక్షలు. చీరాలలో *62.14 లక్షలకుగాను *20.33 లక్షలు వసూలు చేశారు. మార్కాపురంలో *59.44 లక్షలకుగాను *16.93 లక్షలు వసూలు చేశారు. అద్దంకి నగర పంచాయతీలో *28.01 లక్షలకుగాను *18.25 లక్షలు వసూలు చేశారు. చీమకుర్తి నగర పంచాయతీ పరిస్థితి పూర్తి భిన్నం. ఈ నగర పంచాయతీలో *20.14 లక్షల నీటిపన్ను వసూలు కావాల్సి ఉండగా అందులో వసూలైంది *40 వేలు మాత్రమే. కనిగిరి నగర పంచాయతీలో *19.55 లక్షలకుగాను వసూలైన మొత్తం *4.28 లక్షలు. గిద్దలూరు నగర పంచాయతీలో *72.66 లక్షలకుగాను వసూలైన మొత్తం *5.51 లక్షలు. చీమకుర్తి, కనిగిరి నగర పంచాయతీల్లో నీటి పన్ను వసూలు మరీ దారుణంగా ఉంది. ప్రస్తుత, పాత బకాయిల వివరాలు: 2013-14 ఆర్థిక సంవత్సరంలో అన్ని మున్సిపాల్టీల్లో కలిపి *278.01 లక్షలు వసూలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు వసూలైన మొత్తం * 87.5 లక్షలు. 2013-14 సంవత్సరంలో *366.27 లక్షల పాత బకాయిలు వసూలు చేయాలి. కానీ ఇప్పటి వరకు వసూలు చేసిన మొత్తం *63.54 లక్షలు మాత్రమే. అంటే ఇంకో రెండు నెలల్లో వసూలు చేయాల్సిన పాత బకాయిలు *302.73 లక్షలు. ప్రస్తుతం పన్ను చెల్లించకుండా పెనాల్టీకి గురైన వారు 37,122 మంది. వారిలో 877 మంది మాత్రం పెనాల్టీలు చెల్లించారు. ఇంకా 36,245 మంది జరిమానాలు చెల్లించాలని గుర్తించారు. అధికారులు మాత్రం నీటిపన్ను, ఇంటి పన్ను రెండూ కట్టాల్సిందేనని ట్యాపులు పీకేస్తున్నారు. అయితే ఇదే విధానాన్ని 15 ఏళ్లకుపైగా పన్ను కట్టని ప్రభుత్వ సంస్థల విషయంలో పాటించడం లేదు. -
వాగులు స్వాహా
చీమకుర్తి, న్యూస్‌లైన్: వాగులు, వంకలను కూడా ఆక్రమణదారులు వదలడం లేదు. చీమకుర్తి పట్టణంగుండా ప్రవహించే వాగులన్నీ ఆక్రమణపాలయ్యాయి. గతంలో 70-80 అడుగుల వెడల్పు ఉన్న వాగులు నేడు సైడు కాలువలను తలపిస్తున్నాయి. చిన్నపాటి వర్షం పడినా.. నీరంతా కాలువలు దాటి వచ్చి ఊరిమీద పడుతోంది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న వాగుతో మొదలై.. నెహ్రూనగర్‌లోని నక్కలవాగు వరకు మొత్తం ఏడెనిమిది వాగులు చీమకుర్తి మెయిన్ రోడ్డు (కర్నూలు రోడ్డు)ను క్రాస్ చేస్తూ దిగువకు ప్రవహిస్తుంటాయి. అవన్నీ పట్టణంలోని నడిబొడ్డున మెయిన్ రోడ్డుకు సమీపంలో ఉండటంతో అక్రమార్కులు వాటిని ఆక్రమించుకుని పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. ఫలితంగా వెడల్పాటి వాగులన్నీ సైడ్ డ్రెయిన్లుగా మారి నీటి ప్రవాహానికి ఆటంకంగా మారాయి. ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న వాగు పాతికేళ్ల క్రితం 80 అడుగుల వెడల్పుతో ఉండేది. వర్షాకాలంలో ఆ వాగును దాటుకుంటూ పక్కనే ఉన్న హైస్కూలుకు విద్యార్థులు వెళ్లాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఆ వాగు నేడు సన్నని సైడు కాలువలా మారింది. ఎస్కేఆర్ మానసిక వికాసకేంద్రానికి ఎగువనున్న పొలాల నుంచి వచ్చే వర్షం నీరంతా ఈ వాగు నుంచే ప్రవహిస్తుంది. అలాంటి వాగు నేడు దాని మీద నిర్మించిన కల్వర్టు అంత వెడల్పు కూడా లేకపోవడం చూస్తే ఎంత మేర ఆక్రమణలకు గురైందో చెప్పవచ్చు. డాక్టర్ బీ.జవహర్ ఆస్పత్రికి తూర్పున ఉన్న వాగు ఒకప్పుడు కనీసం 25 అడుగులకు పైగా వెడల్పుతో ఉండేది. చుట్టుపక్కల నివాసాలతో ఆక్రమణలకుగురై నేడది ఐదారు అడుగుల వెడల్పునకే పరిమితమైంది. కుమ్మరిపాలెం, నవాబుపేటకు ఎగువనున్న ప్రాంతాల నుంచి వచ్చే వర్షం నీరంతా ఈ వాగు నుంచే వచ్చి కర్నూల్‌రోడ్డు మీదుగా దిగువకు పోవాల్సి ఉంది. దిగువన ఆక్రమణలకు గురైన ఆ వాగును చిరవకు సాక్షి రామలింగేశ్వరాలయం మీదుగా వెళ్లే సైడు కాలువ వైపునకు మళ్లించారు. దాంతో ఎప్పుడు వర్షం కురిసినా.. శివాలయంలో నడుములోతు నీరు చేరుతోంది. ఎగువనున్న నవాబుపేటలోని నివాస ప్రాంతాల్లోకి మోకాళ్ల లోతున నీళ్లు ప్రవహిస్తున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. దిన్నేపురం నుంచి శివాలయం పక్కనే ఉన్న వీరభద్రస్వామి ఆలయం పక్కగా వెళ్లే వాగు ఒకప్పుడు 20 అడుగుల వెడల్పు ఉండేది. నేడది నాలుగు అడుగులకు తగ్గిపోయింది. ఇసుకవాగును పూర్తిగా ఆక్రమించి నివాసాలు నిర్మించేశారు. దీంతో ఇసుకవాగు ప్రాంతంలోని మెయిన్‌రోడ్డు కూడలి వద్ద వర్షాకాలంలో మూడు అడుగుల లోతున నీరు చేరుతోంది. పాటిమీదపాలెం రోడ్డు వైపున్న రచ్చమిట్ట సెంటర్ నివాసాలపై వరదప్రవాహం పడుతోంది. అర్చన హోటల్‌కు ఎగువనున్న వాగు ఒకప్పుడు 80 అడుగుల వెడల్పుతో ఉండేది. నేడది పూర్తిగా ఆక్రమణలకు గురై నాలుగడుగులకు చేరింది. నెహ్రూనగర్‌లోని నక్కలవాగు ఒకప్పుడు 75 అడుగుల వెడల్పుతో ఉండేది. ఈ వాగును ఆక్రమించి ఏకంగా రెండు మూడంతస్తుల భవనాలు నిర్మించేశారు. వాగుల ఆక్రమణల వల్ల వరద నీటి ప్రవాహం ఊరిమీద పడుతోంది. ఛోటామోటా నాయకులు ఆక్రమణలకు పాల్పడుతుండటంతో వారి తప్పును ఎత్తిచూపే ధైర్యం అధికారులు, ప్రజాప్రతినిధులు చేయలేకపోతున్నారు. ఫలితంగా ఆక్రమణదారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది.