చీమకుర్తి, న్యూస్‌లైన్:
వాగులు, వంకలను కూడా ఆక్రమణదారులు వదలడం లేదు. చీమకుర్తి పట్టణంగుండా ప్రవహించే వాగులన్నీ ఆక్రమణపాలయ్యాయి. గతంలో 70-80 అడుగుల వెడల్పు ఉన్న వాగులు నేడు సైడు కాలువలను తలపిస్తున్నాయి. చిన్నపాటి వర్షం పడినా.. నీరంతా కాలువలు దాటి వచ్చి ఊరిమీద పడుతోంది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న వాగుతో మొదలై.. నెహ్రూనగర్‌లోని నక్కలవాగు వరకు మొత్తం ఏడెనిమిది వాగులు చీమకుర్తి మెయిన్ రోడ్డు (కర్నూలు రోడ్డు)ను క్రాస్ చేస్తూ దిగువకు ప్రవహిస్తుంటాయి. అవన్నీ పట్టణంలోని నడిబొడ్డున మెయిన్ రోడ్డుకు సమీపంలో ఉండటంతో అక్రమార్కులు వాటిని ఆక్రమించుకుని పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. ఫలితంగా వెడల్పాటి వాగులన్నీ సైడ్ డ్రెయిన్లుగా మారి నీటి ప్రవాహానికి ఆటంకంగా మారాయి.
ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న వాగు పాతికేళ్ల క్రితం 80 అడుగుల వెడల్పుతో ఉండేది. వర్షాకాలంలో ఆ వాగును దాటుకుంటూ పక్కనే ఉన్న హైస్కూలుకు విద్యార్థులు వెళ్లాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఆ వాగు నేడు సన్నని సైడు కాలువలా మారింది. ఎస్‌కేఆర్ మానసిక వికాసకేంద్రానికి ఎగువనున్న పొలాల నుంచి వచ్చే వర్షం నీరంతా ఈ వాగు నుంచే ప్రవహిస్తుంది. అలాంటి వాగు నేడు దాని మీద నిర్మించిన కల్వర్టు అంత వెడల్పు కూడా లేకపోవడం చూస్తే ఎంత మేర ఆక్రమణలకు గురైందో చెప్పవచ్చు.
డాక్టర్ బీ.జవహర్ ఆస్పత్రికి తూర్పున ఉన్న వాగు ఒకప్పుడు కనీసం 25 అడుగులకు పైగా వెడల్పుతో ఉండేది. చుట్టుపక్కల నివాసాలతో ఆక్రమణలకుగురై నేడది ఐదారు అడుగుల వెడల్పునకే పరిమితమైంది. కుమ్మరిపాలెం, నవాబుపేటకు ఎగువనున్న ప్రాంతాల నుంచి వచ్చే వర్షం నీరంతా ఈ వాగు నుంచే వచ్చి కర్నూల్‌రోడ్డు మీదుగా దిగువకు పోవాల్సి ఉంది. దిగువన ఆక్రమణలకు గురైన ఆ వాగును చిరవకు సాక్షి రామలింగేశ్వరాలయం మీదుగా వెళ్లే సైడు కాలువ వైపునకు మళ్లించారు. దాంతో ఎప్పుడు వర్షం కురిసినా.. శివాలయంలో నడుములోతు నీరు చేరుతోంది. ఎగువనున్న నవాబుపేటలోని నివాస ప్రాంతాల్లోకి మోకాళ్ల లోతున నీళ్లు ప్రవహిస్తున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
దిన్నేపురం నుంచి శివాలయం పక్కనే ఉన్న వీరభద్రస్వామి ఆలయం పక్కగా వెళ్లే వాగు ఒకప్పుడు 20 అడుగుల వెడల్పు ఉండేది. నేడది నాలుగు అడుగులకు తగ్గిపోయింది.
ఇసుకవాగును పూర్తిగా ఆక్రమించి నివాసాలు నిర్మించేశారు. దీంతో ఇసుకవాగు ప్రాంతంలోని మెయిన్‌రోడ్డు కూడలి వద్ద వర్షాకాలంలో మూడు అడుగుల లోతున నీరు చేరుతోంది. పాటిమీదపాలెం రోడ్డు వైపున్న రచ్చమిట్ట సెంటర్ నివాసాలపై వరదప్రవాహం పడుతోంది.
అర్చన హోటల్‌కు ఎగువనున్న వాగు ఒకప్పుడు 80 అడుగుల వెడల్పుతో ఉండేది. నేడది పూర్తిగా ఆక్రమణలకు గురై నాలుగడుగులకు చేరింది.
నెహ్రూనగర్‌లోని నక్కలవాగు ఒకప్పుడు 75 అడుగుల వెడల్పుతో ఉండేది. ఈ వాగును ఆక్రమించి ఏకంగా రెండు మూడంతస్తుల భవనాలు నిర్మించేశారు.
వాగుల ఆక్రమణల వల్ల వరద నీటి ప్రవాహం ఊరిమీద పడుతోంది. ఛోటామోటా నాయకులు ఆక్రమణలకు పాల్పడుతుండటంతో వారి తప్పును ఎత్తిచూపే ధైర్యం అధికారులు, ప్రజాప్రతినిధులు చేయలేకపోతున్నారు. ఫలితంగా ఆక్రమణదారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది.
వాగులు స్వాహా
Published Mon, Dec 2 2013 2:04 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement