rtc busstand
-
ఆర్టీసీ బస్టాండ్‌లో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కొత్త పెళ్లికూతురు
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: కుటుంబసభ్యులతో కలసి ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్న నవ వధువు కనిపించకుండా పోయింది. అనంతపురం మూడో పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపిన మేరకు.. ఆత్మకూరు మండలం మదిగుబ్బకు చెందిన మాదేశ్వరికి రామగిరికి చెందిన ఓ యువకుడితో మూడు నెలల క్రితం వివాహమైంది. ఆదివారం ఉదయం తల్లిదండ్రులతో కలసి అనంతపురం బస్టాండుకు మాదేశ్వరి చేరుకుంది. ఆ సమయంలో తాను అత్తింటికి వెళ్లనంటూ మాదేశ్వరి తెలపడంతో తల్లిదండ్రులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కాసేపటి తర్వాత బాత్రూంకు వెళుతున్నట్లు చెప్పిన మాదేశ్వరి ఎంతసేపటికీ తిరిగి రాలేదు. తల్లిదండ్రులు బస్టాండు, ఆ పరిసర ప్రాంతాలు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: విశాఖలో దారుణం.. మహిళను ముక్కలుగా నరికి, డ్రమ్ములో కుక్కి -
తిరుపతిలో మోడల్ బస్టాండ్
రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అభివృద్ధి వికేంద్రీకణలో భాగంగా అన్ని ప్రాంతాలకుఅవకాశాలు కల్పించేందుకు చర్యలుతీసు కుంటోంది. ఈ క్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికిఓ సువర్ణ అవకాశం దక్కనుంది.అత్యాధునిక వసతులతో కూడిన మోడల్ బస్టాండ్‌ను తిరుపతిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగించే ప్రయాణ ప్రాంగణాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలనుకల్పించేందుకు 13 అధునాతన భవనాలను నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. తిరుపతి అర్బన్: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్ నిత్యం ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటుంది. 1972లో తిరుపతి బస్టాండ్ కోసం అప్పటి ప్రభుత్వం సుమారు 13 ఎకరాలను కేటాయించింది. అందులో చిన్నపాటి బస్టాండ్‌ను నిర్మించారు. తర్వాత కాలంలో ప్రయాణికల రద్దీ పెరగడంతో శ్రీహరి బస్టాండ్, శ్రీనివాస బస్టాండ్, ఏడుకొండల బస్టాండ్, పల్లెవెలుగు బస్టాండ్లుగా విస్తరించారు. వీటిలో 10 భవనాలు, సుమారు 200పైగా దుకాణాలను నిర్మించారు. అయినా ప్రయాణికుల తాకిడి పెరిగిన సమయాల్లో వసతుల కల్పనకు ఇక్కట్లు తప్పడంలేదు. రూ.400కోట్లతో 13 అధునాతన భవనాలు విజయవాడ పురవాస్తుశాఖ అధికారుల బృందం తిరుపతిలో మోడల్ బస్టాండ్ నిర్మాణం కోసం రెండు రోజుల కసరత్తు తర్వాత నివేదిక తయారుచేసింది. సుమారు రూ.400కోట్లతో 13 అధునాతన భవంతులను నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రయాణికులకు అవసరమైన వసతులు, అంచనావ్యయం పొందుపరిచిన రిపోర్టును రేపోమాపో ప్రభుత్వానికి అందించనుంది. పరిపాలనా అనుమతులు రాగానే జూన్ నుంచే నిర్మాణ పనులను మొదలు పెట్టడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 13 అంతస్తులను నిర్మించేందుకు సుమారు 3 ఏళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా తిరుపతి నగరానికి నాలుగు వైపులా తాత్కాలిక బస్టాండ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రేణిగుంట మార్గం, అలిపిరి, మంగళం, తిరుచానూరును ఎంపిక చేశారు. ప్రస్తుతం తిరుపతిలోని అన్ని బస్టాండ్ల నుంచి నిత్యం సుమారు 1000 బస్సుల్లో 3 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నట్లు సమాచారం. జిల్లా మొత్తంమీద ఆర్టీసీకి రూ.2 కోట్ల ఆదాయం వస్తుంటే, అందులో దాదాపు 40 శాతం తిరుపతి నుంచే సమకూరుతోంది. ప్రస్తుత బస్టాండ్‌లో ప్రయాణికులకు పూర్తిస్థాయిలో వసతులు లేవు. తిరుపతి బస్టాండ్‌ను మోడల్‌గా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతానికి మహర్దశ పడుతుందని పలువురు నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీ వద్దకే ఆర్టీసీ బస్సు.. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పట్టణాలు, పల్లెలకే కాకుండా బస్సులను అన్ని ప్రాంతాలకు నడపాలని భావిస్తున్నారు. ‘మీ వద్దకే.. ఆర్టీసీ బస్సు’ కార్యక్రమానికి రాష్టంలో తొలిసారిగా తిరుపతి నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలకు బస్సు సర్వీసులను అందించనున్నారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కూడా బస్సులు నడవనున్నాయి. తీర్థయాత్రల కోసం ఎవరైనా సంప్రదిస్తే రాయితీ చార్జీలతో బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. సూచనప్రాయంగా ఆదేశాలందాయి రాష్ట్రంలో తొలి మోడల్ బస్టాండ్‌ను తిరుపతిలో నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆ మేరకు సూచనప్రాయంగా ఆదేశాలందాయి. రూ.400కోట్లతో 13 అంతస్తుల భవనాలను నిర్మించనున్నారు. అందులో ప్రయాణికులకు అత్యాధునిక వసతులు ఉంటాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తర్వాత నష్టాల నుంచి లాభాల బాట పట్టించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ క్రమంలో రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలోని అన్ని కర్మాగారాలకు బస్సు సర్వీసులను నడపనున్నాం. అలాగే ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు కూడా బస్సులు వెళతాయి. వ్యక్తిగత కార్య క్రమాలకు కూడా రాయితీ చార్జీతో బస్సు సేవలను అందిస్తాం. ఆర్టీసీ బస్సు వెళ్లని ప్రాంతం ఇక ఉండదు. చివరకు గ్రామీణప్రాంతాల్లోని చిన్నచిన్న ఆలయాలకు కూడా బస్సులను నడుపుతాం. – తిమ్మాడి చెంగల్‌రెడ్డి, ఆర్టీసీ రీజనల్ మేనేజర్, తిరుపతి -
మాటలతో ఏమార్చి.. నగలతో ఉడాయించారు
రాయచోటిటౌన్: అమ్మా ఇదిగో ఈ చిల్లర నీదేనా అంటూ ఓ మహిళను మాటల్లో పెట్టి ఆమె బ్యాగులోని బంగారు ఆభరణాలున్న పర్సును దోచుకెళ్లిన సంఘటన రాయచోటి ఆర్టీసీ బస్టాండ్‌లో చోటు చేసుకొంది. బాధితురాలు కొండూరు ఆషాబీ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి మాసాపేటకు చెందిన ఆషాబీ కడపలో తన కుమార్తెకు వివాహం చేసింది. ఆమెకు సంబంధించిన 25 తులాల బంగారు ఆభరణాలు మొత్తం తన వద్దనే ఉండేవి. త్వరలో తన కుమార్తె ఇంటిలో శుభకార్యం జరగనుండటంతో వాటిని కుమార్తెకు ఇచ్చేందుకు మంగళవారం రాయచోటి ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లి బస్సు ఎక్కింది. బస్సులో బాగా రద్దీగా ఉండటంతో ఒక వ్యక్తి తన సీట్లో పక్కకు జరిగి కూర్చునేందుకు స్థలమిచ్చాడు. తాన టీచర్‌నని చెప్పి నమ్మించాడు. ఇంతలో మరో మహిళ అక్కడికి వచ్చి నిల్చుంది. కండక్టర్ వచ్చి టిక్కెట్లు తీసుకొనే క్రమంలో ఆషాబీ కాళ్ల కింద చిల్లర పడేసి అమ్మా ఈ చిల్లర డబ్బులు నీవేనా.. అంటూ చెప్పాడు. ఆమె కిందకు వంగి చిల్లర ఏరుకొనే క్రమంలో ఆమె బ్యాగ్‌లోని పర్సు దొంగిలించాడు. బస్సు సాయి థియేటర్ వద్దకు వెళ్లగానే ఈ బస్సు గాలివీడుకు వెళుతుందా అని వారు కండక్టర్‌ను అడిగారు. వెళ్లదని కండక్టర్ చెప్పడంతో వారు ఇద్దరు అక్కడే బస్సు దిగేశారు. బస్సు రింగ్ రోడ్డు వద్దకు వెళ్లిన తర్వాత ఆషాబీ తన బ్యాగ్‌ను పరిశీలించి చూసుకోగా అందులో బంగారు ఆభరణాలు లేకపోవడంతో లబోదిబో మంటూ ఏడుస్తూ బస్సు దిగి ఇంటికెళ్లింది. బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బస్టాండ్‌లో ప్రయాణికుడి మృతి
హన్మకొండ చౌరస్తా: తన కొడుక్కి జబ్బు తగ్గాలని ఆస్పత్రిలో చికిత్స అందించిన తల్లి.. తన కొడుకుని తిరిగి ఇంటికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందిన హృదయ విదారక సంఘటన శుక్రవారం హన్మకొండ కొత్త బస్టాండ్‌లో చోటు చేసుకుంది. మృతుడి తల్లి అనసూర్య తెలిపిన ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు వెంకటాపూర్ మండలంలోని రంగరాజుపల్లి కాలనీకి చెందిన గుండ్ల జయరాజ్(30) పెయింటింగ్ కార్మికుడు. కొద్దికాలంగా కేన్సర్‌తో భాదపడుతున్నాడు. జయరాజ్‌ను వైద్యుల సూచనల మేరకు రెండు నెలలుగా హైదబాద్‌లోని ఎంఎన్‌జే కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స అందిస్తున్నారు. చికిత్స ముగియడంతో ఇంటికి తీసుకెళ్లవచ్చన్న వైద్య నిపుణుల సూచనల మేరకు జయరాజ్‌ను తల్లి అనసూర్య హైదరాబాద్ నుంచి సొంతూరుకు తీసుకెళ్తోంది. ఈక్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు హన్మకొండ బస్టాండ్‌కు వారు చేరుకున్నారు. అయితే వారు బస్ కోసం ఎదురు చూస్తుండగా మృతుడు జయరాజ్ కాసేపు ఎండలో ఉంటానని తల్లి అనసూర్యకు చెప్పి బస్టాండ్ ఆవరణలోని సులభ్ కాంప్లెక్స్ వద్ద వెళ్లి కూర్చున్నాడు. అక్కడే స్పృహ తప్పి పడిపోవడంతో గమనించిన తల్లి కేకలు వేస్తూ రోదిస్తుండంతో సాటి ప్రయాణికులు 108కు ఫోన్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్, సిబ్బంది జయరాజ్‌ను పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న హన్మకొండ ఎస్సై ప్రవీణ్‌కమార్ మృతుడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాతల సాయంతో ఇంటికి.. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు సైతం డబ్బులు లేకపోవడంతో ఎస్సై ప్రవీణ్‌కుమార్, సాటి ప్రయాణికులు కొంత మొత్తాన్ని సేకరించి రూ.8 వేలను జయరాజ్ తల్లికి అందించారు. అంతేకాకుండా అంబులెన్స్‌ను మాట్లాడి జయరాజ్ మృతదేహాన్ని సొంతూరికి తరలించారు. -
అనాథలుగా అనంతలోకాలకు..
వేర్వేరు చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గురు మృతి కర్నూలు: కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు వెనుక రామయ్య ఐఐటీ కాలేజీ సమీపంలో సుమారు 35 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. సుమారు 5.5 అడుగుల ఎత్తు, నలుపు రంగు ఉంటాడు. బ్లాక్ ప్యాంటు ధరించాడు. ఆర్టీసీ బస్టాండ్ ఔట్వే దగ్గర వ్యాపార దుకాణం ముందు సుమారు 55 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మృతిచెందాడు. నలుపు, బ్లూ రంగులు గల షర్టు, బ్లూ డ్రాయర్ ధరించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు నాల్గవ పట్టణ పోలీసులు ఆయా ప్రాంతాలకు వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో వడదెబ్బతో మృతిచెంది ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆచూకీ తెలిసినవారు 94406 27736, 08518–259462కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సీఐ నాగరాజరావు కోరారు. -
ఆర్టీసీ బస్టాండ్‌లో అగ్నిప్రమాదం
వైఎస్సార్ కడప: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. బస్టాండ్‌లోని ట్రాఫిక్ విభాగంలో ప్రమాదవశాత్తు మంటలు ఎగిసిపడటంతో ముఖ్యమైన దస్త్రాలు, బస్‌పాస్‌లు, సర్వీస్ రిజిస్టర్లు కాలి బూడిదయ్యాయి. స్థానికులు సమాచారంతో ఘటనాస్ధలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
కారు రివర్స్ చేస్తుంటే బైక్‌ను తగిలిందని..
క్షణికావేశం ఓ వైద్యుడి ప్రాణం బలిగొంది. మద్యం మత్తులో నలుగురు యువకుల వీరంగం.. ప్రజాభిమానం చూరగొన్న సేవకుడి ఉసురు తీసింది. కారు రివర్స్ చేస్తుండగా బైక్‌ను తగిలిందనే చిన్న కారణం.. సోమవారం అర్ధరాత్రి డాక్టర్ శైలేంద్రరెడ్డి మృతికి కారణమయింది. ఈ ఘటనతో ఆయన వైద్యుడుగా పని చేస్తున్న గాజులపల్లెతో పాటు నంద్యాల పట్టణంలో విషాదం అలుముకుంది. నంద్యాల: గాజులపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా పని చేస్తున్న శైలేంద్రరెడ్డి(38) స్థానిక బాలాజీ కాంప్లెక్స్‌లోని సీఎస్ఆర్ టవర్స్‌లో నివాసం ఉంటున్నారు. సోదరుడు మధుసూదన్‌రెడ్డి, గ్రామస్తులైన షేక్‌మాబు, మహబూబ్‌బాషాతో కలిసి శైలేంద్ర తన కారులో అక్క నిర్మలాదేవి కుమారుడు శరత్‌చంద్రారెడ్డిని హైదరాబాద్ బస్సు ఎక్కించేందుకు సోమవారం రాత్రి 12.30 గంటల సమయంలో ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లేందుకు రివర్స్ చేస్తుండగా కారును వెనుకనున్న బైక్‌ను ఢీకొంది. ఈ విషయమై స్థానిక ఉప్పరిపేటకు చెందిన సల్మాన్, వలి, ఇమ్రాన్, ముజీబ్‌లు ఆయనతో ఘర్షణ పడ్డారు. వాళ్లకు సర్దిచెప్పి శైలేంద్రరెడ్డి, అతని సోదరుడు ఇంటికి వెళ్తుండగా నలుగురు యువకులు బైక్‌పై వెంటాడి శ్రీనివాస జంక్షన్లో కారును అటకాయించారు. శైలేంద్రను కిందకు దించి ఇమ్రాన్, వలి పట్టుకోగా సల్మాన్ రాయితో కొట్టాడు. తలపై తీవ్ర గాయం కావడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలగా నిందితులు పారిపోయారు. మధుసూదన్‌రెడ్డి, అతని అనుచరులు ఆటోలో శైలేంద్రను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా కోలుకోలేక మృతి చెందాడు. పోలీసుల అదుపులో నిందితులు? శైలేంద్రరెడ్డి హత్యానంతరం నలుగురు నిందితులు ఆర్టీసీ బస్టాండ్ చేరుకొని అక్కడే టిఫిన్ చేసి వెళ్లినట్లు సీసీ కెమెరాల ఆధారంగా తెలుస్తోంది. హత్యకు వీళ్లే కారణమని సీసీ కెమెరా దశ్యాలను పరిశీలించిన అనంతరం మధుసూదన్‌రెడ్డి, అతని అనుచరులు ధ్రువీకరించారు. ఆ మేరకు ఉప్పరిపేటలోని నలుగురు నిందితుల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై వన్‌టౌన్ సీఐ ప్రతాప్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ నిందితులు మద్యం మత్తులోనే ఈ హత్య చేసినట్లు తెలుస్తోందని.. వీరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. పరామర్శ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల, శ్రీశైలం నియోజకవర్గాల ఇన్చార్జీలు రాజగోపాల్‌రెడ్డి, బుడ్డా శేషారెడ్డిలు శైలేంద్ర మతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ శైలేంద్ర వైద్యుడిగానే కాకుండా వ్యక్తిగతంగా ప్రజలకు ఎంతో సేవ చేశారన్నారు. వేలాదిగా తరలివచ్చిన గాజులపల్లె గ్రామస్తులను చూస్తే ఆయన ఎంతలా వారి అభిమానాన్ని చూరగొన్నారో తెలుస్తోందన్నారు. బుడ్డా శేషారెడ్డి మాట్లాడుతూ మద్యం మత్తులో చేసిన తప్పుకు కుటుంబాలు సర్వనాశనమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా శైలేంద్ర మతదేహాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు న్యాయవాది మాధవరెడ్డి, ప్రసాదరెడ్డి సందర్శించారు. -
బస్సులులేక పుష్కరభక్తుల ఇక్కట్లు
-
తూనికలు, కొలతల శాఖ దాడులు
- ఒంగోలు బాస్టాండ్‌లోని ఆరుషాపులపై కేసులు నమోదు - ఆర్టీసీ ఉన్నతాధికారులకు రిపోర్టు చేస్తామన్న ఒంగోలు ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఒంగోలు: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్న పలువురు వ్యాపారులపై తూనికలు, కొలతల శాఖ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ముందుగా వినియోగదారుల మాదిరిగా పలు షాపుల్లో శీతల పానీయాలు కొనుగోలుచేసేందుకు వెళ్లారు. అక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించి వెంటనే వారిపై కేసులు నమోదు చేశారు. షాపు నెంబర్లు 5,11,13,22,41 లతో పాటు ఆర్టీసీ బస్టాండు ఆవరణలోనే ఉన్న నియోస్ ఫుడ్ కోర్టుపై కూడా కేసులు నమోదుచేసినట్లు తూనికలు కొలతల శాఖ ఒంగోలు ఇన్ స్పెక్టర్ కేవీఎస్ రామకృష్ణ పేర్కొన్నారు. షాపు నెంబర్ 11లో అయితే శీతలపానీయాల అన్ని బాటిల్స్‌పై ఎంఆర్పీ ధరలు కనపడకుండా చేశారని తెలిపారు. వినియోగదారులు ప్రశ్నించకుండా ఉండేందుకు చేసిన మోసపూరితమైన చర్యగా భావిస్తున్నామన్నారు. వీరందరిపై ఆర్టీసీ ఉన్నతాధికారులకు కూడా రిపోర్టు పంపనున్నామన్నారు. ఒక్కో బాటిల్‌కు రూ. 5 నుంచి 15 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు రుజువైందన్నారు. సాంకేతిక నిపుణులు ఆలీబేగ్, అనీల్, సిబ్బంది సుబ్రహ్మణ్యం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
20 ఏళ్లకు బస్‘స్టాండ్’
ఎన్నో ఏళ్ల గ్రామస్తుల కష్టాలు తొలగాయి. ఏడాది కాదు.. రెండేళ్లు కాదు.. 20 ఏళ్ల అనంతరం బేలలోని బస్టాండ్(పాతబస్టాండ్)కు ఆర్టీసీ బస్సుల రాకపోకలు పునఃప్రారంభమయ్యూరుు. అసౌకర్యాలు.. అపరిశుభ్రతతో శిథిలావస్థకు చేరి బస్టాండ్ నిరుపయోగంగా మారడంపై ఈ నెల 10న ‘సాక్షి’లో ‘ఒంటికి.. రెంటికి చోటేది?’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన పంచాయతీ పాలకవర్గం, స్థానికులు బస్టాండ్‌లో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించి సొబగులు అద్దడంతో బుధవారం బస్సుల రాకపోకలు పునఃప్రారంభమయ్యూరుు. దీంతో మండలవాసులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. బేల, న్యూస్‌లైన్ : మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలో ఆర్టీసీ బస్టాండ్‌ను 1989లో ప్రారంభించగా నాలుగేళ్లపాటు బస్సుల రాకపోకలు సాఫీగా సాగారుు. ఆ తర్వాత వివిధ సమస్యలు సాకుగా చూపి బస్సులు బస్టాండ్ వరకు రాకుండా స్థానిక ఇందిరా చౌరస్తాలో ఆపుతూ ప్రయూణికులను ఎక్కించుకుంటున్నారు. ఈ చౌరస్తాలో కనీస సౌకర్యాలు లేక ప్రయూణికులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో బస్టాండ్ శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారిన వైనంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం, స్థానికులు స్పందించారు. వారం రోజులపాటు బస్టాండ్ ఆవరణలో పిచ్చిమొక్కలు తొలగించారు. యూత్ సభ్యులు మరమ్మ తు పనులు చేపట్టారు. ఆవరణ, బస్టాండ్ షెడ్లను శుభ్రం చేశారు. పునఃప్రారంభం కోసం ఆర్టీసీ అధికారులకు విన్నవించడంతో వారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. బుధవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఆర్టీసీ బస్సులను అలంకరించి బ్యాండ్ మేళాల మధ్య పంచాయతీ పాలకవర్గం, వివిధ యూత్ క్లబ్‌ల సభ్యులు బస్టాండ్‌కు తీసుకొచ్చా రు. బస్టాండ్ ప్రాంగణాన్ని ఎమ్మెల్యే జోగు రామన్న పునఃప్రారంభించారు. ఎమ్మెల్యే, ఆర్టీసీ ఇన్చార్జి డీఎం శివ కేశ వ్, సర్పంచ్ మస్కే తేజ్‌రావు జెండా ఊపి బస్సుల రాకపోకలు పునరుద్ధరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎని మిది రోజుల్లోగా బస్టాండ్ ఆవరణలో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. త్వరలో అంబేద్కర్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు సీసీ రోడ్డు, కల్వర్టు నిర్మాణాలు ప్రా రంభిస్తామని చెప్పారు. బస్టాండ్ పునర్నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా చూస్తానన్నారు. ఎస్సై దేశ్‌కార్ లక్ష్మణ్, డిపో అసిస్టెంట్ మేనేజర్ జాకబ్, డిపో ఎస్సై రాములు, ఉప సర్పంచ్ వట్టిపెల్లి ఇంద్రశేఖర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రావుత్ మనోహర్, మాజీ సర్పంచ్ ఓల్లఫ్వార్ దేవన్న, జన చైతన్య సంఘం అధ్యక్షుడు ముక్కవార్ కిరణ్, బీజేవైఎం అధ్యక్షుడు గుండవార్ ఆకాష్, తెలంగాణ జాగృతి కమిటీ అధ్యక్షుడు షకీల్‌ఖాన్, సర్పంచులు శంకర్, రూప్‌రావు, బాపురావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు క్యాతం రాఘవులు, నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. కాగా, సమస్యను స్థానికుల దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేసిన ‘సాక్షి’కి స్థానిక ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. -
వాగులు స్వాహా
చీమకుర్తి, న్యూస్‌లైన్: వాగులు, వంకలను కూడా ఆక్రమణదారులు వదలడం లేదు. చీమకుర్తి పట్టణంగుండా ప్రవహించే వాగులన్నీ ఆక్రమణపాలయ్యాయి. గతంలో 70-80 అడుగుల వెడల్పు ఉన్న వాగులు నేడు సైడు కాలువలను తలపిస్తున్నాయి. చిన్నపాటి వర్షం పడినా.. నీరంతా కాలువలు దాటి వచ్చి ఊరిమీద పడుతోంది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న వాగుతో మొదలై.. నెహ్రూనగర్‌లోని నక్కలవాగు వరకు మొత్తం ఏడెనిమిది వాగులు చీమకుర్తి మెయిన్ రోడ్డు (కర్నూలు రోడ్డు)ను క్రాస్ చేస్తూ దిగువకు ప్రవహిస్తుంటాయి. అవన్నీ పట్టణంలోని నడిబొడ్డున మెయిన్ రోడ్డుకు సమీపంలో ఉండటంతో అక్రమార్కులు వాటిని ఆక్రమించుకుని పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. ఫలితంగా వెడల్పాటి వాగులన్నీ సైడ్ డ్రెయిన్లుగా మారి నీటి ప్రవాహానికి ఆటంకంగా మారాయి. ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న వాగు పాతికేళ్ల క్రితం 80 అడుగుల వెడల్పుతో ఉండేది. వర్షాకాలంలో ఆ వాగును దాటుకుంటూ పక్కనే ఉన్న హైస్కూలుకు విద్యార్థులు వెళ్లాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఆ వాగు నేడు సన్నని సైడు కాలువలా మారింది. ఎస్కేఆర్ మానసిక వికాసకేంద్రానికి ఎగువనున్న పొలాల నుంచి వచ్చే వర్షం నీరంతా ఈ వాగు నుంచే ప్రవహిస్తుంది. అలాంటి వాగు నేడు దాని మీద నిర్మించిన కల్వర్టు అంత వెడల్పు కూడా లేకపోవడం చూస్తే ఎంత మేర ఆక్రమణలకు గురైందో చెప్పవచ్చు. డాక్టర్ బీ.జవహర్ ఆస్పత్రికి తూర్పున ఉన్న వాగు ఒకప్పుడు కనీసం 25 అడుగులకు పైగా వెడల్పుతో ఉండేది. చుట్టుపక్కల నివాసాలతో ఆక్రమణలకుగురై నేడది ఐదారు అడుగుల వెడల్పునకే పరిమితమైంది. కుమ్మరిపాలెం, నవాబుపేటకు ఎగువనున్న ప్రాంతాల నుంచి వచ్చే వర్షం నీరంతా ఈ వాగు నుంచే వచ్చి కర్నూల్‌రోడ్డు మీదుగా దిగువకు పోవాల్సి ఉంది. దిగువన ఆక్రమణలకు గురైన ఆ వాగును చిరవకు సాక్షి రామలింగేశ్వరాలయం మీదుగా వెళ్లే సైడు కాలువ వైపునకు మళ్లించారు. దాంతో ఎప్పుడు వర్షం కురిసినా.. శివాలయంలో నడుములోతు నీరు చేరుతోంది. ఎగువనున్న నవాబుపేటలోని నివాస ప్రాంతాల్లోకి మోకాళ్ల లోతున నీళ్లు ప్రవహిస్తున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. దిన్నేపురం నుంచి శివాలయం పక్కనే ఉన్న వీరభద్రస్వామి ఆలయం పక్కగా వెళ్లే వాగు ఒకప్పుడు 20 అడుగుల వెడల్పు ఉండేది. నేడది నాలుగు అడుగులకు తగ్గిపోయింది. ఇసుకవాగును పూర్తిగా ఆక్రమించి నివాసాలు నిర్మించేశారు. దీంతో ఇసుకవాగు ప్రాంతంలోని మెయిన్‌రోడ్డు కూడలి వద్ద వర్షాకాలంలో మూడు అడుగుల లోతున నీరు చేరుతోంది. పాటిమీదపాలెం రోడ్డు వైపున్న రచ్చమిట్ట సెంటర్ నివాసాలపై వరదప్రవాహం పడుతోంది. అర్చన హోటల్‌కు ఎగువనున్న వాగు ఒకప్పుడు 80 అడుగుల వెడల్పుతో ఉండేది. నేడది పూర్తిగా ఆక్రమణలకు గురై నాలుగడుగులకు చేరింది. నెహ్రూనగర్‌లోని నక్కలవాగు ఒకప్పుడు 75 అడుగుల వెడల్పుతో ఉండేది. ఈ వాగును ఆక్రమించి ఏకంగా రెండు మూడంతస్తుల భవనాలు నిర్మించేశారు. వాగుల ఆక్రమణల వల్ల వరద నీటి ప్రవాహం ఊరిమీద పడుతోంది. ఛోటామోటా నాయకులు ఆక్రమణలకు పాల్పడుతుండటంతో వారి తప్పును ఎత్తిచూపే ధైర్యం అధికారులు, ప్రజాప్రతినిధులు చేయలేకపోతున్నారు. ఫలితంగా ఆక్రమణదారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. -
భవిష్యత్ అవసరాల కోసమే ఉద్యమం
రాయచోటి, న్యూస్‌లైన్: భవిష్యత్తు తరాల అవసరాలను గుర్తెరిగే ప్రజలంతా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సమైక్యాంధ్ర రాయచోటి జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండు ఆవరణలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని పరిపాలించిన సీఎంల అందరి సమిష్టి కృషితోనే రాజధాని హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని, అయితే నేడు తెలంగాణ వాదులు హైదరాబాద్ తమదంటుండడం దారుణమన్నారు. విభజన జరిగితే పూర్తిగా నష్ట పోయేది రాయలసీమే అని చెప్పారు. రాష్ట్రవిభజన విషయంపై కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు చేసిన ఆంటోని కమిటీకి ఏమి తెలుసని ఎద్దేవా చేశారు. సుమారు రూ..105 కోట్లు వెచ్చించి ఏర్పాటుచేసిన శ్రీక్రిష్ణకమిటీ ఇచ్చిన నివేదిక మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచుతామంటూ ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. సమై క్యాంధ్ర జేఏసీ రాయచోటి కన్వీనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న విభజన ఉద్యమాన్ని సాకుగా తీసుకున్న కర్నాటక, మహారాష్ట్ర రాయలసీమ క్రిష్ణాబేసిన్లో లేదంటూ వాదిస్తుండటం వితండవాదమేనన్నారు. టిడిపి నాయకుడు ప్రసాద్‌బాబు, ఎన్‌జీఓసంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, జేఏసీ నేతలు శ్రీనివాసరాజు, విఆర్ రెడ్డి, జనార్దన్, ఆర్టీసీ కార్మిక నాయకులు రామమోహన్,యహియాబాష, జమియత్ ఉలేమా నాయకుడు అజ్మతుల్లా, ప్రైవేటుస్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజులు ప్రసంగించారు. జెఏసీ నేతలు మనోహర్‌రాజు, నాగేశం, సాంబశివ, ప్రైవేటు స్కూల్ కరస్పాండెంట్లు పి. మనోహర్‌రెడ్డి, రమణారెడ్డి, శివగంగిరెడ్డి, ఎస్డిహెచ్ఆర్ డిగ్రీకళాశాల కరస్పాండెంట్ హరినాధరెడ్డి, సర్పంచ్ రవిరాజు, టిడిపి నేత ఇర్షాద్అలీఖాన్, డ్వాక్రా మహిళలు, వ్యాపారులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, విద్యార్థులు వేలాదిగా పాల్గొన్నారు.