
కారు రివర్స్ చేస్తుంటే బైక్‌ను తగిలిందని..
క్షణికావేశం ఓ వైద్యుడి ప్రాణం బలిగొంది. మద్యం మత్తులో నలుగురు యువకుల వీరంగం.. ప్రజాభిమానం చూరగొన్న సేవకుడి ఉసురు తీసింది. కారు రివర్స్ చేస్తుండగా బైక్‌ను తగిలిందనే చిన్న కారణం.. సోమవారం అర్ధరాత్రి డాక్టర్ శైలేంద్రరెడ్డి మృతికి కారణమయింది. ఈ ఘటనతో ఆయన వైద్యుడుగా పని చేస్తున్న గాజులపల్లెతో పాటు నంద్యాల పట్టణంలో విషాదం అలుముకుంది.
నంద్యాల:
గాజులపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా పని చేస్తున్న శైలేంద్రరెడ్డి(38) స్థానిక బాలాజీ కాంప్లెక్స్‌లోని సీఎస్‌ఆర్ టవర్స్‌లో నివాసం ఉంటున్నారు. సోదరుడు మధుసూదన్‌రెడ్డి, గ్రామస్తులైన షేక్‌మాబు, మహబూబ్‌బాషాతో కలిసి శైలేంద్ర తన కారులో అక్క నిర్మలాదేవి కుమారుడు శరత్‌చంద్రారెడ్డిని హైదరాబాద్ బస్సు ఎక్కించేందుకు సోమవారం రాత్రి 12.30 గంటల సమయంలో ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లారు.
ఆ తర్వాత ఇంటికి వెళ్లేందుకు రివర్స్ చేస్తుండగా కారును వెనుకనున్న బైక్‌ను ఢీకొంది. ఈ విషయమై స్థానిక ఉప్పరిపేటకు చెందిన సల్మాన్, వలి, ఇమ్రాన్, ముజీబ్‌లు ఆయనతో ఘర్షణ పడ్డారు. వాళ్లకు సర్దిచెప్పి శైలేంద్రరెడ్డి, అతని సోదరుడు ఇంటికి వెళ్తుండగా నలుగురు యువకులు బైక్‌పై వెంటాడి శ్రీనివాస జంక్షన్‌లో కారును అటకాయించారు. శైలేంద్రను కిందకు దించి ఇమ్రాన్, వలి పట్టుకోగా సల్మాన్ రాయితో కొట్టాడు. తలపై తీవ్ర గాయం కావడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలగా నిందితులు పారిపోయారు. మధుసూదన్‌రెడ్డి, అతని అనుచరులు ఆటోలో శైలేంద్రను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా కోలుకోలేక మృతి చెందాడు.
పోలీసుల అదుపులో నిందితులు?
శైలేంద్రరెడ్డి హత్యానంతరం నలుగురు నిందితులు ఆర్టీసీ బస్టాండ్ చేరుకొని అక్కడే టిఫిన్ చేసి వెళ్లినట్లు సీసీ కెమెరాల ఆధారంగా తెలుస్తోంది. హత్యకు వీళ్లే కారణమని సీసీ కెమెరా దశ్యాలను పరిశీలించిన అనంతరం మధుసూదన్‌రెడ్డి, అతని అనుచరులు ధ్రువీకరించారు. ఆ మేరకు ఉప్పరిపేటలోని నలుగురు నిందితుల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై వన్‌టౌన్ సీఐ ప్రతాప్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ నిందితులు మద్యం మత్తులోనే ఈ హత్య చేసినట్లు తెలుస్తోందని.. వీరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
పరామర్శ
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల, శ్రీశైలం నియోజకవర్గాల ఇన్‌చార్జీలు రాజగోపాల్‌రెడ్డి, బుడ్డా శేషారెడ్డిలు శైలేంద్ర మతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ శైలేంద్ర వైద్యుడిగానే కాకుండా వ్యక్తిగతంగా ప్రజలకు ఎంతో సేవ చేశారన్నారు. వేలాదిగా తరలివచ్చిన గాజులపల్లె గ్రామస్తులను చూస్తే ఆయన ఎంతలా వారి అభిమానాన్ని చూరగొన్నారో తెలుస్తోందన్నారు. బుడ్డా శేషారెడ్డి మాట్లాడుతూ మద్యం మత్తులో చేసిన తప్పుకు కుటుంబాలు సర్వనాశనమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా శైలేంద్ర మతదేహాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు న్యాయవాది మాధవరెడ్డి, ప్రసాదరెడ్డి సందర్శించారు.