ఆషాఢంలోనూ ‘కనక’వర్షమే
- దుర్గమ్మకు రికార్డుస్థాయిలో హుండీ ఆదాయం
- 20 రోజులకు రూ.1.40 కోట్లు
సాక్షి, విజయవాడ : కోరిన కోర్కెలు తీర్చే కనకదుర్గమ్మకు ఆషాఢమాసంలోనూ భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించుకున్నారు. ఆలయానికి గత 20 రోజులకు గానూ రికార్డుస్థాయిలో రూ.1.40 కోట్ల ఆదాయం సమకూరింది. దసరా ఉత్సవాలు, భవానీదీక్షల విరమణ మహోత్సవాలలో రూ.1.35 కోట్లు, ఇక సాధారణ రోజుల్లో రూ.1.20 కోట్లకు మించి ఎన్నడూ హుండీ ఆదాయం ఇంత భారీగా రాలేదని ఆలయ అధికారులు చెబుతున్నారు.
కానుకల్లో విదేశీ కరెన్సీ కూడా ఎక్కువగానే ఉందని తెలిపారు. అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు, మొక్కులను సోమవారం భవానీ దీక్ష మండపంలో ఆలయ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. 20 రోజులకు గానూ 14 హుండీల ద్వారా రూ.1,40,38,068 నగదు, 387 గ్రాముల బంగారం, 3.571 కిలోల వెండి లభించినట్లు అధికారులు వివరించారు.
కేవలం అమ్మవారి ప్రధాన ఆలయ పరిసరాలలోని హుండీల్లో కానుకలను మాత్రమే లెక్కించారు. ఉపాలయాలు, శివాలయం, స్నానఘాట్ల హుండీల్లోని కానుకలను లెక్కించాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే 20 రోజులకు గానూ రూ.రెండు కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగిన శాకంబరీ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవడంతోపాటు భారీగా కానుకలు, మొక్కులను సమర్పించుకున్నట్లు భావిస్తున్నారు.
దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖులు
బెజవాడ కనకదుర్గమ్మను ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, వట్టి వసంతకుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డీసీసీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు సోమవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. నాయకులు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వదించగా, ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు. నూజివీడు సబ్ కలెక్టర్ చక్రధర్‌బాబు కూడా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు.