కొండపై ఏర్పాటుచేస్తున్న బారికేడ్లు
సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ సన్నిధిలో ఏటా దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ శాశ్వత ఏర్పాట్లు చేయడంలో దుర్గ గుడి అధికారులు విఫలమవుతున్నారు. దసరా ఉత్సవాలు, భవానీదీక్షల విరమణకు సంబంధించిన ఏర్పాట్లు కోసం రూ.కోట్లు వెచ్చిస్తున్నా అన్నీ తాత్కాలిక ప్రాతిపదికగానే చేయడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉత్సవాలు అయిపోగానే వీటిని తొలగిస్తారు. ప్రతి ఏడాది జరిగే కార్యక్రమాలకు శాశ్వత ఏర్పాట్లు ఎందుకు చేయడం లేదనే విషయం దుర్గమ్మకే తెలియాలని అంటున్నారు.
రూ.1.54 కోట్లతో...
దసరా ఉత్సవాలకు రూ.1.54 కోట్లతో తాత్కాలిక ఏర్పాట్లుకు రంగం సిద్ధమైంది. కొండపైన రూ.4 లక్షలతో క్యూలైన్లు, రూ.9 లక్షలతో షామియానాలు, కొండ కింద భాగంంలో 20 లక్షలతో క్యూలైన్లు, రూ.32 లక్షలతో షామియానాలు ఏర్పాటు చేస్తారు. రూ.10 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని రెవెన్యూ, పోలీసు అధికారులకు అప్పగిస్తారు. కొండపైన లైటింగ్‌కు రూ.27 లక్షలు, కొండదిగువన లైటింగ్‌కు రూ.18 లక్షలు, మొబైల్ టాయిలెట్స్‌కు రూ.15లక్షలు ఖర్చు చేస్తారు. వీఐపీలు కొండ మీద రాకపోకలకువీలుగా 12 వాహనాలకు రూ.12 లక్షలు, మైక్‌లు ఏర్పాటుకు రూ.7 లక్షలు చెల్లిస్తారు. 9 రోజులు పాటు జరిగే ఉత్సవాలకు రూ.1.54 కోట్లతో తాత్కాలిక ఏర్పాట్లు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అంతా హడావుడిగా..
అక్టోబర్ 10 నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇంకా నెలరోజులు వ్యవధి లేదు. శనివారం నుంచి క్యూలైన్ల ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు. దసరా ఉత్సవాల ప్రారంభానికి రెండు మూడు రోజులు ముందే ఏర్పాట్లు పూర్తవుతాయనుకుంటే పోరపాటే. ప్రస్తుతం ఫ్లై ఓవర్ పనులు జరుగుతూ ఉండటంతో అక్టోబర్ 1 వరకు కెనాల్ రోడ్డులో పనులు చేసుకునేందుకు అవకాశం ఉండదని దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులు భావిస్తున్నారు. సీతమ్మవారి పాదాలు వద్ద కేశఖండనశాలకు షెడ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ స్థలాన్ని కూడా సోమా కంపెనీ ఖాళీ చేసి ఇచ్చిన తరువాతనే పనులు ప్రారంభిస్తారు. దీంతో హడావుడిగానే దసరా ఉత్సవాల పనులు చేయాల్సి వస్తుందని సిబ్బంది చెబుతున్నారు.
కోట్లు కుమ్మరించినా తప్పని కష్టాలు....
అమ్మవారి సొమ్మును మంచినీళ్లులాగా ఖర్చు చేసినప్పటికీ, భక్తులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. దసరా ఉత్సవాల్లో సాధారణ భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే కనీసం 4 కి.మీ నడవాల్సి వస్తోంది. వినాయకుడు గుడి నుంచి దర్శనం చేసుకుని మెట్ల మార్గంలో కిందకు వచ్చే వరకు ఎక్కడా కూర్చునే అవకాశం లేదు. ఈ ఇబ్బందుల్ని తీర్చడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఇక దసరా ఉత్సవాల్లో దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఒకటి రెండు రోజులు అమ్మవార్ని సన్నిధిలో ఉండాలంటే అందుకు తగిన వసతి లేదు. ప్రైవేటు హోటళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. సీవీ రెడ్డి చారిటీస్ స్థలంలో నిర్మించిన కాటేజ్‌లు, మాడపాటి గెస్ట్ హౌస్ ఉత్సవాలకు వచ్చే అధికారులకే కేటాయించడానికి సరిపోతోంది. దీంతో భక్తులు వసతి లేక రాత్రి వేళల్లో నడి రోడ్లపైనే సేద తీరాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment