- కలెక్టరేట్ ఎదుట మహిళల ధర్నా
మచిలీపట్నం : ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తామని చెప్పిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలను మోసం చేసేలా వ్యవహరిస్తున్నారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్‌సీహెచ్ శ్రీనివాస్ విమర్శించారు. డ్వాక్రా రుణాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డ్వాక్రా మహిళల సమన్వయ కమిటీ, సీఐటీయూ ఆధ్వర్యాన బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన హామీలను నమ్మిన డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో రుణాలను చెల్లించలేదన్నారు. పొదుపు సొమ్మును వడ్డీ కింద బ్యాంకులు జమ చేసుకుంటున్నాయని తెలిపారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌సీహెచ్ సుప్రజ మాట్లాడుతూ డ్వాక్రా రుణాలను ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేయాలని, బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.
వీవోఏల సమస్యలు పరిష్కరించండి
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యాన ఐకేపీ యానిమేటర్ల(వీవోఏ) సంఘం ప్రతినిధులు, సభ్యులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీవోఏల సంఘ జిల్లా అధ్యక్షురాలు ఎం.ఆదిలక్ష్మి మాట్లాడుతూ తమకు సెర్ఫ్ నుంచి 15 నెలల వేతన బకాయిలు రావాల్సి ఉందన్నారు. వెంటనే బడ్జెట్‌ను విడుదల చేయాలన్నారు. రాజకీయ నాయకుల వేధింపులు, అక్రమ తొలగింపులు, బెదిరింపుల నుంచి తమకు విముక్తి కలిగించాలని, గుర్తింపు కార్డులు, నియామక పత్రాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీవోఏల సంఘ జిల్లా కమిటీ గౌరవాధ్యక్షురాలు ఎ.కమల, ప్రధాన కార్యదర్శి బి.సౌజన్య, ఎన్‌డీ భవానీ, పలువురు వీవోఏలు పాల్గొన్నారు.