
మొండిచేయి
జిల్లాలో డ్వాక్రా మహిళలకు రూ. 995 కోట్లు(పూర్తిగా రుణమాఫీ చేసింటే) రుణమాఫీ చేయాల్సి ఉండగా
♦ డ్వాక్రా మహిళలకు కొత్త రుణం లేనట్లే
♦ ఖాతాల్లో మూలుగుతున్న
♦ రూ. 147 కోట్ల పెట్టుబడి నిధి
డ్వాక్రా మహిళలకు రోజుకో కొత్త సమస్య ఎదురవుతోంది. కొత్త రుణాలైనా వస్తాయని ఆశిస్తే ఇప్పుడు వాటిపై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. బ్యాంకర్లు మొండిచెయ్యి చూపుతుండడం, అధికారులు స్పందించక పోవడంతో డ్వాక్రా మహిళల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పెట్టుబడి నిధి పేరుతో సర్కారు బ్యాంకులకు రూ.147 కోట్లు పంపింది. దానికి 6 రెట్లు అధికంగా రుణాలు పొందే అవకాశం ఉన్నా డ్వాక్రా మహిళలకు బ్యాంకర్లు చిల్లిగవ్వ కూడా ఇవ్వడంలేదు.
అనంతపురం సెంట్రల్ : జిల్లాలో డ్వాక్రా మహిళలకు రూ. 995 కోట్లు(పూర్తిగా రుణమాఫీ చేసింటే) రుణమాఫీ చేయాల్సి ఉండగా ఇటీవల ప్రభుత్వం రూ.147 కోట్లు మంజూరు చేసింది. వీటిని వాడుకోవడానికి వీలులేదని ప్రభుత్వం మెల్లికపెట్టింది. పెట్టుబడి నిధిగా చూపించి బ్యాంకర్ల నుంచి అధికంగా రుణాలు తీసుకుని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేది ప్రభుత్వం ఉద్దేశం. రుణమాఫీ నిధులు విడుదల చేసే సమయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు.
మహిళలు చేసుకున్న పొదుపులో 6 రెట్లు అధికంగా బ్యాంకర్లు రుణాలు మంజూరుచేయాలనేది నిబంధన. ఈ ప్రకారం రూ. 147 కోట్లు స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో జమ చేశారు. అలా సంఘాలకు దాదాపు రూ. 900 కోట్లు మంజూరు చేయాలి. అయితే డ్వాక్రా మహిళలకు రుణాలు మంజూరు చేయించాలనే ద్యాస అధికారుల్లో కన్పించడం లేదు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు అవుతున్నా కొత్తగా ఏ ఒక్కరికీ రుణాలు మంజూరు కాలేదు.
దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్వాక్రా మహిళల జీవనోపాధి మెరుగుపర్చాలనే ద్యాస అధికారుల్లో కన్పించడం లేదు. గతంలో బ్యాంకుల నుంచి విరివిగా రుణాలు మంజూరు చేయించి వారు ఆర్థికంగా అభివృద్ది చెందేలా ఒక కార్యచరణ ప్రణాళికల ద్వారా ముందుకు వెళ్లేవారు. రుణాలన్నీ చెల్లించిన సంఘాలకు కూడా కొత్త రుణం మంజూరు చేయక పోవడంతో మళ్ళీ మైక్రోఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించాల్సి వస్తోందని డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త రుణాలూ ఇవ్వలేదు :
సంఘంలో రూ. 50 వేలు అప్పు తీసుకున్నా. ఇదంతా మాఫీ అవుతుందని అనుకున్నా కాలేదు. పెట్టుబడి నిధి రూపంలో ఇస్తున్న డబ్బు ద్వారా అదనంగా బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవాలని చెబుతున్నారు. బ్యాంకుల మాత్రం రుణాలు మంజూరు చేయడం లేదు. మేము కట్టేదే తప్పా వచ్చేది ఏందీ లేదన్నట్లు తయారైంది.
నరసమ్మ, మాదవరాజు మహిళా సంఘం, సిద్దరాంపురం, బుక్కరాయసముద్రం మండలం