ఏడాదైనా మాఫీ కాని డ్వాక్రా రుణాలు
రుణాలు చెల్లించాలంటూ మహిళలపై అధికారుల ఒత్తిడి
రుణాలు మాఫీ కాకపోవటంతో కొత్త రుణాలు ఇవ్వని వైనం
మొదట్లో మాఫీ రూ.10 వేలన్నారు.. ఇప్పుడు రూ.3 వేలకు తగ్గించారు
బాబు జమానాలో.. దగాపడ్డ పొదుపుమహిళ
నా పేరు వాకాటి రాజేశ్వరమ్మ, మాది కల్లూరు కొత్తపాళెం. నేను సాయినాథ పొదుపు గ్రూపు లీడర్‌గా ఉన్నాను. మండలంలోనే మంచి గ్రూపుగా అధికారులచే మన్ననలు పొందిన మేం ఇప్పుడు బాబు పుణ్యమా అంటూ ఇబ్బం దులు పడుతున్నాం. రూ. 3 లక్షలు రుణం తీసుకుని రూ.75 వేలు వడ్డీ కడుతున్నాం. ఇచ్చే ఆ రూ.3 వేలు నువ్వే ఉంచుకో. సింగపూర్, చైనా పర్యాటనకైనా పనికొస్తుంది.
నా పేరు యర్రమతి వజ్రమ్మ. మాది వాకాడు మండలం కొత్తపాళెం నేను గణపతి గ్రూపులో ఉన్నాను. మా గ్రూపు తరఫున రూ.3 లక్షలు రుణం తీసుకున్నాం. రుణమాఫీ పేరుతో కట్టడం మానేశాం. రుణమాఫీ జరగకపోగా మా గ్రూపునకు రూ.70 వేలు వడ్డీభారం పడింది. మేం దాచుకున్న పొదుపు డబ్బంతా నిలువునా జమ చేసుకున్నారు. తెలివైన మోసగాడు ఎవరని అడిగితే చంద్రబాబేనని చెప్పాలి.
సాక్షిప్రతినిధి, నెల్లూరు : టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు అధికారం కోసం ‘పొదుపు మహిళలూ మీరు తీసుకున్న రుణాలు బ్యాంకులకు కట్టొద్దు. మనం అధికారంలోకి వస్తున్నాం. వచ్చాక మీ రుణాలన్నీ నేను తీరుస్తాను. మీకు టీడీపీ తరుఫున భరోసా ఇస్తున్నాను. నన్ను నమ్మండి. టీడీపీకి ఓటేయండి’ అని హామీ ఇచ్చారు. బాబు మాటలు నమ్మిన జనం ఆయనకు ఓట్లేసి.. తీసుకున్న రుణాలకు సంబంధించి వడ్డీ కూడా కట్టకుండా నిలిపేశారు. దీంతో అసలు, వడ్డీ పెరిగి పోయింది.
సాధారణ రుణాలకు మొదటి ఏడాదికి వడ్డీ మొత్తం రూ.39.06 కోట్లు. చంద్రబాబు ప్రకటనతో ఏప్రిల్ వరకు అదనంగా చెల్లించాల్సినమొత్తం రూ.98.12 కోట్లు. అసలు, వడ్డీలు చెల్లించాలంటూ ఇటీవల జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. తీసుకున్న రుణాలు చెల్లించేలా డ్వాక్రా లీడర్లు కృషిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశా రు. దీంతో బ్యాంకు అధికారులు మున్సిపాలిటీల్లోని వార్డుల్లో, గ్రామాల్లో తిరిగారు. అసలు, వడ్డీ చెల్లించకపోతే గ్రూపును రద్దుచేస్తామని హెచ్చరించారు కూడా.
మాఫీ హామీతో నష్టపోయిన మహిళలు
బాబు ఇచ్చిన హామీతో డ్వాక్రాసభ్యులు తీవ్రంగా నష్టపోతున్నారు. నెల్లూరులో ఓ మహిళా సంక్షేమ సంఘంలో 20 మంది సభ్యులు బ్యాంకు నుంచి రూ.3లక్షలు రుణం తీసుకున్నారు. ఎన్నికల ముందు బాబు మాఫీ వాగ్దానం చేయడంతో అప్పటి నుంచి రుణాలు కట్టడం మానేశారు. ఏడాది కావస్తుండటంతోనెలకు రూ.18వేల చొప్పున రూ.2.16 లక్షలతో పాటు వడ్డీ చెల్లించమని అధికారులు మహిళలపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. బకాయిలు చెల్లించకపోతే డిఫాల్టర్లుగా చేస్తామని హెచ్చరిస్తున్నట్లు మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే 2014-2015కి జిల్లాలోని డ్వాక్రా సభ్యులకు వివిద బ్యాంకులు రూ.665 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే రుణమాఫీ ప్రకటనతో డ్వాక్రా సభ్యులు అసలు, వడ్డీ చెల్లించకపోవటంతో బ్యాంకర్లు కూడా రుణాలు ఇవ్వకపోవటం గమనార్హం.
మొన్న రూ.10 వేలు.. నేడు రూ.3 వేలు
డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ కాకపోవటంతో మహిళల నుంచి వ్యతిరేకత మొదలైంది. దీంతో సీఎం చంద్రబాబు రుణమాఫీ కింద ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున చెల్లిస్తామని ప్రకటించారు. అదికూడా చెల్లించటం ఇష్టం లేక కొద్దిరోజులకు రూ.3వేలకు తగ్గించారు. గత ఏడాది మార్చి 31 నాటికి సంఘంలో సభ్యులుగా ఉన్నవారికి మాత్రమే రూ.3వేలు చెల్లిస్తామని ప్రభుత్వం నిబంధనపెట్టింది. అదే విధంగా సంఘంలో సభ్యురాలిగా ఉంటూ మొబైల్ బుక్‌కీపింగ్, డేటాబేస్‌లో వారి పేరు లేకుంటే రూ.3వేలు ఇవ్వరు. ఆధార్‌ను అన్‌లై న్‌లో సీడింగ్ చేయకపోయినా అనర్హులే. ప్రభుత్వం ఇచ్చే రూ.3 వేలును నేరుగా సభ్యులకు ఇవ్వరు, వ్యక్తిగత ఖాతాలో జమచేయరు. సంబంధిత గ్రూపు ఖాతాలో మాత్రమే జమచేస్తారు. తీసుకున్న రూ.3వేలకు వడ్డీ చెల్లిస్తుండాల్సిందే.
చెల్లెమ్మలకు టోకరా
Published Fri, May 29 2015 4:56 AM | Last Updated on Sat, Sep 29 2018 6:00 PM
Advertisement
Advertisement