వేశారు.. తీసేసుకున్నారు..! | Dwcra women is unfair in interest subsidy | Sakshi
Sakshi News home page

వేశారు.. తీసేసుకున్నారు..!

Published Sat, Apr 22 2017 12:21 PM | Last Updated on Tue, Aug 14 2018 3:48 PM

Dwcra women is unfair in interest subsidy

► వడ్డీ రాయితీలో డ్వాక్రా మహిళలకు శఠగోపం అన్యాయం
► గందరగోళ పరిస్థితుల్లో పొదుపు సంఘాలు
► అసలేమి జరిగింది తెలియదంటున్న లీడర్లు
► సాంకేతిక లోపమంటున్న అధికారులు

స్వయం సహాయక సంఘాల మహిళలకు కష్టాలు తీరడం లేదు. తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ మహిళలకు హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా, ఆ ఊసే ఎత్తడం లేదు. చివరకు పెట్టుబడి నిధి కింద వచ్చిన మొత్తం కూడా వడ్డీకే సరిపోయిన విషయం తెలిసిందే. ఈ సమస్య నుంచి తేరుకోకమునుపే ఇటీవల వడ్డీ రాయితీని ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి లాగేసుకోవడంపై మహిళలు భగ్గుమంటున్నారు..

వేంపల్లె: పొదుపు సంఘాల్లో  వడ్డీ రాయితీ గందరగోళం నెలకొంది. గత మార్చి 24న వడ్డీ రాయితీ కింద మంజూరైన మొత్తాన్ని సెర్ప్‌ నుంచి  డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమైం ది. ఆ విధంగా వైఎస్సార్, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి కేవలం ఏపీజీబీ శాఖల్లోనే మహిళల ఖాతాల్లో సెర్ప్‌ సంస్థ రూ.250 కోట్లకు పైగా జమచేసింది. జిల్లాలోని ఏపీజీబీ శాఖల్లో  దాదాపు 28వేల గ్రూపులకు సంబంధించి రూ.25కోట్లు పడింది. 

ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారులు, డీఆర్డీఏ అధికారులు సంబంధించిన ఏపీఎంలు, సీసీలు, స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ రాయితీ పడిందని దాదాపు రూ.5లక్షల రుణం ఉన్నవారికి రూ.30వేల దాకా జమ అయ్యిం ద ని చెప్పారు. అయితే వారి ఆనం దం ఎంతోసేపు నిలబడలేదు. కేవలం 10 రోజుల్లోనే అనగా ఏప్రిల్‌ 6న తిరిగి సెర్ప్‌ సంస్థ ఆ డబ్బులను వెనక్కి తీసుకుంది. దీంతో డ్వాక్రా మహ్డి ళల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వీఓల సమావేశంలో సిబ్బందిని నిలదీస్తున్నారు.

గురువారం వేంపల్లెలోని శ్రీరామ్‌నగర్‌లో వీఓల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీలను మహిళలు తీవ్రస్థాయిలో నిలదీశారు. డబ్బులను ఖాతాలో వేయడం దేనికి.. మళ్లీ వెనక్కు తీసుకోవడం దేనికని వారు మండిపడ్డారు. వడ్డీ రాయితీ వచ్చిన గ్రూపులకు మళ్లీ 2015 అక్టోబరు నుంచి అన్ని గ్రూపులకు వడ్డీ రాయితీ రావాల్సి ఉంది. ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవడం ఏమిటని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  జిల్లాకు రూ.25కోట్లకుపైగా ఈ వడ్డీ రాయితీ వచ్చింది.

వడ్డీ రాయితీలో నిజాయితీ లేదు..
గతంలో పావలా వడ్డీ ఉండగా.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీలేని రుణాలను ప్రకటించింది. అయితే ప్రస్తు తం డ్వాక్రా మహిళలు 14శాతం అంటే రూ.1.50లతో వడ్డీతో తమ రుణాలను చెల్లిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడి నిధి కింద వచ్చిన హక్కు పత్రంలో కొన్ని గ్రూపులకు వడ్డీ రాయితీ రాగా.. మరికొన్ని గ్రూపులకు వడ్డీ రాయితీ ఇంకా మంజూరు కాలేదు.

కొన్ని గ్రూపులకు అరకొరగానే మంజూరైంది. ప్రభుత్వం వడ్డీ రాయితీని మంజూరు చేసేటప్పటికీ మేం చెల్లించిన వడ్డీకి సరిపోతుందని, ప్రభుత్వం వడ్డీలేని రుణాలను ఎక్కడ అందిస్తోందని డ్వాక్రా మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి.

సాంకేతిక లోపంతోనే ఇలా జరిగింది..
2015 అక్టోబరులో పెట్టుబడి నిధి కింద రూ.3వేలు మంజూరైన గ్రూపులకు హక్కు పత్రాన్ని అందజేశామని, అందులో ఆ గ్రూపులకు వడ్డీ రాయితీ కూడా వచ్చిందని అటు బ్యాంకు అధికారులు, ఇటు డీఆర్డీఏ అధికారులు, ఆయా మండలాల ఏపీఎంలు వివరణ ఇస్తున్నారు. సాంకేతికలోపం కారణంగా వడ్డీ మంజూరు కానీ డ్వాక్రా సంఘాలకు కూడా ఏకంగా అన్ని ఖాతాల్లో జమ చేశారు. ఈ తప్పును తెలుసుకొని మళ్లీ  పదిరోజుల వ్యవధిలోనే ఆ మొత్తాన్ని వెనక్కు తీసుకున్నారని, మంజూరు కానీ గ్రూపులకు వడ్డీ రాయితీ వస్తుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.

ఇది కుంభకోణమే..
వడ్డీ రాయితీ మొత్తాన్ని సెర్ప్‌ సంస్థ వెనక్కి తీసుకోవడం కుంభకోణంలాగా కనిపిస్తోంది. తమ గ్రూపునకు వడ్డీ రాయితీ మంజూ రైంది. డ్రా చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ విషయాన్ని డ్వాక్రా మహిళలందరికి తెలియజేశాం. వచ్చిన మొత్తం వెనక్కి పోవడంతో సమాధానం చెప్పలేకున్నాం.  – ఆదిమూలం అంజన యాదవ్, డ్వాక్రా సంఘ లీడర్, వేంపల్లె

స్పష్టత ఇవ్వాలి..
వడ్డీ రాయితీ ఆయా బ్యాంకు ఖాతాలలో డ్వాక్రా మహిళలకు జమ చేశారు. మార్చి 24న జమ చేసి, ఏప్రిల్‌ 6న మళ్లీ వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు బ్యాంకు అధికారులను అడిగితే తమకు సంబంధంలేదని, అది డీఆర్డీఏ సంస్థకు చెందిన సమస్య అని చెబుతున్నారు. సమావేశాలు ఏర్పాటు చేయాలంటే ఇబ్బందికరంగా ఉంది. – విజయలక్ష్మి, డ్వాక్రా సంఘ కోశాధికారి, వేంపల్లె

వడ్డీ రాయితీ రాలేదు..
తమ గ్రూపు ఏర్పాటు చేసి ఏడాదిన్నర అయ్యింది. ఇంతవరకు వడ్డీ రాయితీ రాలేదు. ఇటీవల వడ్డీ రాయితీ వచ్చిందని అధికారులు చెప్పారు. తీసుకొనేలోపే మళ్లీ వెనక్కి పోయింది. ఎవరి ఏమి చెబుతున్నారో తెలియని పరిస్థితి. ఒక్కోసారి డ్వాక్రా సంఘంలో ఎందుకు చేరామా అని నిరాశ కలుగుతోంది. – నాగమ్మ, డ్వాక్రా సంఘ టీడర్, వేంపల్లె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement