రైతులకు ఈ-పాస్ పుస్తకాలు
హైదరాబాద్: ఏపీలో రైతులకు ఈ (ఎలక్ట్రానిక్) పాస్ పుస్తకాలు అందించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకాల స్థానంలో ఇవి అందజేస్తారు. వీటిని ఆధార్ కార్డులతో అనుసంధానం చేస్తారు. మంగళవారం అసెంబ్లీలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించారు.
ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తోపాటు రెవిన్యూ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎంతమంది రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఉన్నాయి, వారి పొలం వివరాలు ఎంతవరకు నమోదు చేసుకున్నారు అనే అంశాలపై చర్చించారు. రైతుల భూముల వివరాలను నమోదు చేయటంతో పాటు ఈ పాస్ పుస్తకాలను రూపొందించి అందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూమి ఎంత ఉంది, వ్యవసాయ భూమి ఎంత, వ్యవసాయేతర భూమి ఎంత అనే వివరాలను సేకరించాలని కూడా నిర్ణయించారు. రాష్ట్ర రాజధానిని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో స్థానికంగా భూమి లభ్యత ఎంత ఉంది అనే అంశంపైనా చర్చించినట్లు సమాచారం.