ఎందుకో ఈ కక్ష..?
► పేదల ఆరోగ్యంతో రాష్ర్ట ప్రభుత్వం ఆటలు
► ఒక్కో ఆసుపత్రికి రూ.కోట్లలో నిలిచిపోయిన ‘ఎన్టీఆర్ వైద్యసేవ’ బకాయిలు
► నెట్‌వర్క్ ఆసుపత్రులకు మూడు నెలలుగా బిల్లులు చెల్లించని వైనం ఆందోళనలో నిర్వాహకులు
► అనుమతుల జాప్యంతో నిలిచిపోతున్న ఆపరేషన్లు ఇబ్బందులు పడుతున్న నిరుపేద రోగులు
సాక్షి, గుంటూరు : నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే పథకంపై టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తోంది.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చేందుకు అనేక చర్యలు చేపట్టింది.. గతంలో ఉన్న రోగాల జాబితాను తగ్గించడం, అనుమతులు సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలకు దిగారు.. నెట్‌వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులను సక్రమంగా చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచడం.. పేరు మార్చి ఎన్టీఆర్ వైద్య సేవగా నామకరణం చేయడం.. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును పేదల మనసుల్లోంచి చెరిపివేయాలనేది వీరి కుట్రలో భాగంగా ఉంది.. ఆరోగ్యశ్రీ అనే పేరు ఉన్నంత వరకూ ఇది సాధ్యం కాదని భావించి ఆరోగ్యశ్రీ కార్డులను సైతం మార్చి నిరుపేదలకు ఎన్‌టీఆర్ వైద్య సేవ కార్డులను అందించారు..
అనుమతుల కోసం తప్పని నిరీక్షణ..
మూడు నెలలుగా ఎన్టీ ఆర్ వైద్యసేవ పథకం కింద నెట్‌వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో కొన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవల కోసం వచ్చే నిరుపేద రోగులను చేర్చుకోకుండా వెనక్కు పంపుతున్నట్లు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌లు చేయించుకునే రోగులకు ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా ఒక్క రోజులో అనుమతి వచ్చేది. కానీ ప్రస్తుతం ఈ అనుమతులు రావాలంటే కనీసం నాలుగు నుంచి వారం రోజులు పడుతోంది. నెట్‌వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులు ప్రతి నెలా సకాలంలో చెల్లించేవారు. దీంతో ఆసుపత్రుల నిర్వాహకులు ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌లు చేసేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చేవారు.
ప్రస్తుతం 2016 జనవరి నుంచి ఇంత వరకూ ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా తమకు రావాల్సిన బిల్లులు నిలిచిపోవడంతో ఆసుపత్రి నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే రోగులను వెనక్కు పంపుతున్నారు. దీనిపై నెట్‌వర్క్ ఆసుపత్రుల నిర్వాహకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధంకాగా ఈ నెల 15వ తేదీ నాటికి బిల్లులు చెల్లిస్తామంటూ వైద్య ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు ఇచ్చిన హామీతో తాత్కాలికంగా వాయిదా వేశారు. ఒక్కో ఆసుపత్రికి కోట్ల రూపాయలు బకాయి ఉండటంతో మరింత పెట్టుబడి పెట్టలేక ఇబ్బంది పడుతున్నామని నిర్వాహకులు వాపోతున్నారు.
మందులూ అందడం లేదు..
గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఆపరేషన్‌లు చేయించుకున్న వారికి ఫాలోఅప్ మందులు సక్రమంగా అందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలనెలా ఇచ్చే మందుల్లో రెండు, మూడు రకాల మందులను మాత్రమే ఇస్తూ మిగతావి లేవని, మరుసటి రోజు రావాలంటూ చెబుతున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే మందుల కోసం ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పడిగాపులు చేయాల్సిన దుస్థితి నెలకొందని వారు మండిపడుతున్నారు. అసలే అస్వస్థతతో ఉన్న రోగులు మందుల కోసం గంటల తరబడి వేచి ఉండలేక బయట మార్కెట్‌లో డబ్బులు వెచ్చించి కొనుగోలు చేస్తున్నామంటూ మరికొందరు చెబుతున్నారు. మొత్తంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యమవుతుందని వైద్యులే చెబుతుండటం గమనార్హం.