NTR medical service
-
అందుబాటులో ఉన్నా.. అందనంత దూరం
- ఆరోగ్యశ్రీపై రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులతో హైదరాబాద్‌లోని ఏపీ వాసులకు కష్టాలు - పెద్దలకు మాత్రమే అందుతున్న ‘నిమ్స్’ వైద్యసేవలు సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లాకు చెందిన వెంకటప్ప కుటుంబంతో సహా ఇటీవలే హైదరాబాద్‌కు వలస వచ్చాడు. మోతీనగర్‌లోని ఓ అపార్టుమెంట్లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. వారం కిందట ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్ వైద్య సేవ) కార్డు పట్టుకుని నిమ్స్‌కు తీసుకెళ్లారు. అయితే అనంతపురానికి చెందిన ఆరోగ్య శ్రీ కార్డు ఇక్కడ చెల్లదని, ఏపీ వెళ్లి వైద్యం చేయించుకోవాలని నిమ్స్ సిబ్బంది తేల్చిచెప్పారు. దీంతో వెంకటప్పకు ప్రాణం పోయినంత పనైంది. చివరకు అపార్టుమెంట్ వాసులే స్పందించి తలాకొంత సాయం చేసి వైద్యం చేయించారు. ఇది అతనొక్కడి సమస్యే కాదు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఎక్కడో ఓ చోట నిత్యం ఏపీ ప్రజలకు ఎదురవుతున్న దుస్థితి ఇది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావడం.. ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో రాష్ట్రానికి చెందిన అనేక మంది హైదరాబాద్ వెళ్లి బతుకు వెళ్లదీస్తున్నారు. ఏపీలోని స్వగ్రామాల్లో ఆరోగ్య శ్రీ కార్డులున్న ఇలాంటివారు హఠాత్తుగా జబ్బుల బారినపడితే.. అక్కడి ఆస్పత్రులు మొహం మీదే తలుపులేస్తున్నాయి. అలాగని అక్కడి ఆస్పత్రులను తప్పుబట్టడానికి లేదు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలే ఇందుకు కారణం. తమ రాష్ట్ర వాసులకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద హైదరాబాద్‌లో వైద్యమందించొద్దని రాష్ట్ర సర్కార్ ఆదేశాలివ్వడంతోనే అక్కడి ఆస్పత్రులు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి. పెద్దలకు ఓకే.. ఏపీ నుంచి హైదరాబాద్‌కు వలస వెళ్లిన పేదలకు ఎన్టీఆర్ వైద్య సేవ కుదరదన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వంటి పెద్దలు మాత్రం నిమ్స్‌లో వైద్య సేవలు పొందేందుకు అనుమతించడం ద్వారా తన ద్వంద్వ నీతిని చాటుకుంది. ఈ తీరును వైద్యారోగ్య శాఖ అధికారులు సైతం తప్పుబడుతున్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంతకాలం ఆరోగ్యశ్రీని యథాతథంగా అమలు చేసి ఉండాల్సిందని వారు అభిప్రాయపడుతున్నారు. -
మెడాల్ మాయ!
⇒ పేదల రక్తంతో సంపాదన ⇒ దోచుకోవడమే మెడాల్ కేంద్రాల పని ⇒ జ్వరంతో వెళితే పది రకాల పరీక్షలు ⇒ టెస్టుల పేరుతో రూ.2,300 వరకు వసూలు ⇒ ల్యాబ్‌లు, ప్రభుత్వ వైద్యుల కుమ్మక్కు సర్కారు ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన మెడాల్ పరీక్ష కేంద్రాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. పేదల రక్తంతో వ్యాపారం చేస్తూ రూ.లక్ష లు గడిస్తున్నాయి. వైద్యులతో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత ఉన్నతాధికారులు వీటి వైపు కనీసం కన్నెత్తి చూడకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పలమనేరు : ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెడాల్ సంస్థ సిబ్బంది, వైద్యులు కుమ్మక్కై పేద రోగులను బురిడీ కొట్టిస్తున్నారు. ఎన్టీఆర్ వైద్యసేవల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో 27 రకాల రక్త పరీక్షలు, టెలీమెడిసిన్, టెలీరేడియాలజీ తదితర పరీక్షలను ఉచితంగా చేపట్టాల్సి ఉంది. ఈ కాంట్రాక్టును రాష్ట్ర వ్యాప్తంగా చెన్నైకు చెందిన మెడాల్ అనే సంస్థ దక్కించుకుంది. వీరు జిల్లాలో కొన్ని ఫ్రాంచైజీలకు సబ్ కాంట్రాక్టు ఇచ్చారు. మెడాల్ నెలకు నిర్ణయించిన రూ.25 కోట్లను ఫ్రాంచైజీలు చెల్లించాల్సి ఉంది. జిల్లాలోని 94 పీహెచ్‌సీలు, 18 ఏరియా ఆస్పత్రులు,10 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల నుంచి రోగులకు అవసర మైన రక్త పరీక్షలను మెడాల్ సంస్థ పరిధిలో సబ్ కాంట్రాక్టు పొందిన ల్యాబ్‌లకు పంపాలి. 10 పీహెచ్‌సీలు, ఓ ఏరియా ఆస్పత్రి, సీహెచ్‌సీలకు కలిపి ఒక్కో ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇలాంటి కేంద్రాలున్నాయి. ఇందులోని ప్రైవేటు ల్యాబ్ టెక్నీషియన్లు ఆస్పత్రులకు వెళ్లి డాక్టర్లు సూచించిన రోగుల నుంచి రక్తాన్ని సేకరించాలి. ఒక్కో టెస్టుకు ప్రభుత్వం వీరికి రూ.230 అందజేస్తుంది. ఇలా ల్యాబ్ పరిధిలోని అన్ని ఆస్పత్రుల నుంచి సేకరించిన శాంపిళ్లను పరీక్షించి రిపోర్టులను సంబంధిత ఆస్పత్రులకు మెయిల్ చేస్తారు. అక్రమాలు ఇలా.. పీహెచ్సీలో రోజుకు సరాసరి ఓపీ 60 నుంచి వంద దాకా ఉంటుంది. వాస్తవంగా రక్త పరీక్షలకు వచ్చినవారు పదిమంది మాత్రమే ఉంటారు. డాక్టర్లు 30 మంది రోగులను పరీక్షలకు సిఫారసు చేస్తారు. వీరిలో మెడాల్ సెంటర్ నుంచి వచ్చే ల్యాబ్ టెక్నీషియన్ రక్తాన్ని సేకరిస్తారు. కొందరు డాక్టర్లు రోగికి అవసరం లేకున్నా మొత్తం పది రకాల పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తారు. ఒక్కో టెస్టుకు రూ.230 చొప్పున మొత్తం పది టెస్టులకు రూ.2,300 ఖర్చుచేసినట్టు చూపిస్తారు. ఈ మొత్తాన్ని సబ్ లీజు పొందిన ఫ్రాంచైజీకి ప్రభుత్వం చెల్లించాలి. నెలలో జరిగిన మొత్తం టెస్టులకు కలిపి 40 శాతం దాకా వైద్యులకు కమీషన్లు అందుతున్నట్టు తెలుస్తోంది. అవసరమైన టెస్టు ను మాత్రం చేసి మిగిలినవాటికి నెగెటివ్ డమ్మీ రిపోర్టులను మెయిల్ చేయడంతో మిగతా 9 టెస్టులకు పైసా ఖర్చులేదు. ఇలా ప్రాంచైజీలు, మెడికల్ ఆఫీసర్లు కలసి ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతా చేతివాటమే.. ఫ్రాంచైజీల పరిధిలోని ల్యాబ్‌ల్లో సిబ్బందిని మూడు ఆస్పత్రులకు కలిపి ఒకరినే పెట్టారు. వీరు వచ్చేంతవరకు రోగులు ఆస్పత్రుల్లో వేచి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్లు వెళ్లినప్పుడు ఆస్పత్రిలోని ఓపీలో ఉన్న రోగులకు గబగబా పరీక్షల కోసమని రక్తాన్ని సేకరిçస్తున్నట్లు సమాచారం. ఇలా సేకరించిన రక్తానికి కొన్ని సందర్భాల్లో అదే రోజు పరీక్షలు చేయడం లేదు. సెలవురోజుల్లో మెడాల్ సేవలు ఉండవు. మొత్తం మీద రోజూ రోగులకు భారీగా పరీక్షలు నిర్వహించి రిపోర్టులను ఆస్పత్రులకు మెయిల్ పంపించి ప్రభుత్వం నుంచి బోగస్ బిల్లులు స్పష్టమవుతోంది. పీహెచ్‌సీలకు వెళితే రక్త పరీక్షలు చేయించుకున్న రోగులకు సైతం ఎటువంటి రిపోర్టులుండవు. డాక్టర్లను అడిగితే మీకేరోగం లేదు రిపోర్టులు తమ మెయిల్లో ఉన్నాయంటూ వెనక్కు పంపిస్తున్నారు. ప్రభుత్వ ల్యాబ్‌లు నిర్వీర్యం మామూలుగా షుగర్ టెస్టుకు రూ.50 అవుతుంది. కానీ మెడాల్‌లో రూ.230గా నిర్ణయించారు. దానికితోడు మెడాల్ రాకతో ప్రభుత్వాసుపత్రుల్లోని ల్యాబ్‌లు అటకెక్కాయి. ఏరియా ఆస్పత్రిలో అన్ని రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నా మెడాల్ ల్యాబ్‌లోనే పరీక్షలను చేయిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ల్యాబ్‌లకు కెమికల్స్, కిట్లు రాకపోగా అందులోని సిబ్బందిని ఇతర విధులకు డెప్యూటేషన్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వమే ఓ పద్ధతి ప్రకారం సర్కారు ఆస్పత్రులను నాశనం చేస్తోందని వైద్య సిబ్బందే పెదవి విరుస్తున్నారు. -
వైద్యం చేయలేం!
లబ్బీపేట (విజయవాడ తూర్పు) : రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో కార్పొరేట్ ఆస్పత్రులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. బ్యాంకు ఖాతాలు ఓవర్ డ్రాఫ్ట్‌కు చేరడంతో ఈ నెలలో సిబ్బందికి ఇంకా జీతాలు కూడా చెల్లించలేని దయనీయ స్థితి నెలకొంది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిరుపేదలకు అందిస్తున్న వైద్యానికి సంబం«ధించిన బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు కారణం. రెండు నెలలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, బయటకు చెప్పలేని స్థితిలో ఆస్పత్రుల నిర్వాహకులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాగైతే వైద్యం ఎలా చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే వైఖరి అవలంబిస్తే వైద్య సేవ పథకాన్ని అమలు చేయడం తమవల్ల కాదని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంపై ఏ ఆస్పత్రి నిర్వాహకుడైనా ప్రశ్నిస్తే వారిపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రెండు జిల్లాలకు రూ.250 కోట్ల బకాయి కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ పథకం ద్వారా వైద్య సేవలు అందించిన ఆస్పత్రులకు రూ.250 కోట్లు బకాయి ఉన్నట్లు సమాచారం. రెండు జిల్లాల్లో వంద వరకూ నెట్వర్క్ ఆస్పత్రులు ఉండగా, ప్రతి ఆస్పత్రికి రూ.3 కోట్ల నుంచి రూ.5కోట్ల వరకూ బకాయి ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మధ్య త రహా ఆస్పత్రులకు సైతం ఒక్కోదానికి రూ.3 కోట్లు బకాయి ఉండటంతో నిర్వహణ కష్టతరంగా మారిందన్నారు. సమ్మె నోటీసు ఇస్తే కొద్దిగా విదిల్చారు జనవరిలో ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ పథకం సేవలు నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆషా) ఆధ్వర్యాన సమ్మె నోటీసు ఇచ్చిన సమయంలో కొద్ది మొత్తంలో బిల్లులు విడుదల చేసినట్లు వైద్యులు తెలిపారు. అప్పటికే రూ.3 కోట్లకు పైగా బకాయి ఉన్న ఆస్పత్రులకు రూ.30లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ విడుదల చేశారని చెప్పారు. ప్రభుత్వం తమ బకాయిలు ఎప్పటికప్పుడు విడుదల చేయకపోతే నిర్వహణ కష్టతరంగా మారుతుందని వాపోతున్నారు. ఇదే వైఖరి అవలంబిస్తే రానున్న కాలంలో సేవలు నిలిపివేయడం మినహా మరోమార్గం లేదని పేర్కొంటున్నారు. తక్కువ ప్యాకేజీలైనా... ఎన్టీఆర్ వైద్యసేవ ప్యాకేజీలు తొమ్మిదేళ్ల కిందట నిర్ణయించినవే నేటికీ కొనసాగిస్తున్నారు. అప్పటికీ... ఇప్పటికీ ఆస్పత్రి నిర్వహణ వ్యయం మూడు రెట్లు పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. తమకు ఏమాత్రం ప్రయోజనం లేకపోయినా పేదలనే సేవా భావంతో వైద్యం చేస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ బిల్లులు చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బిల్లులు తక్షణమే విడుదల చేయాలి రాష్ట్రంలోని ఎన్టీఆర్ వైద్యసేవ ఎంపానల్మెంట్ ఆస్పత్రులకు ప్రభుత్వ బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. దీంతో ఆస్పత్రుల నిర్వహణ కష్టతరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పథకం కూడా నిర్యీర్యం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలు వ్యాధులకు చికిత్స చేసేందుకు ప్రభుత్వాస్పత్రులే దిక్కుగా మారాయి. పేదలకు మెరుగైన వైద్యం కలగానే మారే రోజులు వస్తాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆస్పత్రులకు ఉన్న బకాయిలను తక్షణమే చెల్లించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. – డాక్టర్ మెహబూబ్ షేక్,వైఎస్సార్ సీపీ వైద్య విభాగం కృష్ణా జిల్లా అధ్యక్షుడు -
వైద్యసేవ డబ్బుల సంగతి తేల్చండి
గత ఏడాది జూన్ నుంచి చెల్లింపులు లేవు ఇలాగైతే సర్జరీలు చేస్తాం.. కానీ రిజిష్టర్ చేయం వైద్యశాఖ కార్యదర్శికి వైద్యుల సంఘం వినతి విజయవాడ (లబ్బీపేట) : ఎన్టీఆర్ వైద్య సేవ(ఆరోగ్యశ్రీ) పథకంలో సర్జరీలు చేయించుకున్న ప్రభుత్వాస్పత్రి రోగులకు ఇంటికి వెళ్లేటపుడు చెల్లించాల్సిన చార్జీల విషయం తేల్చాలని మెడికల్ కో-ఆర్డినేటర్లు కోరుతున్నారు. రోగులకు వైద్యసేవ పథకంలో సర్జరీలు చేయడంతో ప్రభుత్వాస్పత్రికి ఆదాయం వస్తుంది. కానీ ఆ రోగులు ఇంటికెళ్లేటప్పుడు ఇవ్వాల్సిన చార్జీలను నిలిపి వేయడంతో మెడికల్ కో-ఆర్డినేటర్లు తమ జేబులో డబ్బులు ఇవ్వవల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది జూన్ నుంచి ఎన్టీఆర్ పథకం ద్వారా ఆస్పత్రికి నిధులు సమకూరుతున్నా, వాటిని వైద్యులకు రావాల్సిన చెల్లింపులతో పాటు, రోగులకు ఇచ్చే చార్జీల డబ్బులు కూడా నిలిపివేసారని వారు పేర్కొంటున్నారు. నిబంధనలు ఇలా.. ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టినపుడు ప్రైవేటు ఆస్పత్రులతోపాటు ప్రభుత్వాస్పత్రుల్లో కూడా పథకాన్ని అమలు చేశారు. ఆరోగ్యశ్రీ సర్జరీలకు వచ్చే డబ్బులతో 20 శాతం మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం వద్ద ఉంచుకుని మిగిలిన 80 శాతం ఆస్పత్రికి విడుదల చేశారు. వాటిలో 35 శాతం సర్జరీ బృందం తీసుకోవాల్సి ఉంది. ఏడాదికి ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవ పథకంలో సర్జరీలు చేస్తున్నా వైద్యులు, సిబ్బందికి ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం ఇవ్వకపోవడంతో వైద్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసలేం జరిగిందంటే.. ప్రభుత్వాస్పత్రికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సమకూరిన నిధులు ప్రత్యేక అకౌంట్లో ఉండేవి. వాటిపై జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ చెక్ పవర్ ఉండేది. రూ.100 చెల్లింపునకు సైతం ఆయన వద్దకు చెక్కు కోసం వెళ్లడం కష్టమవడంతో చెల్లింపులు జాప్యం జరుగుతుందని అప్పట్లో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశం పలువురు వైద్యులు నాటి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో ఓ వైద్యునికి ఆరోగ్యశ్రీ చెల్లింపులకు సంబంధించి చెక్‌పవర్ ఇచ్చారు. కొన్నాళ్లు పని సజావుగానే జరిగింది. ఎప్పటికప్పుడు చెల్లింపులు చేసేవారు. అయితే కలెక్టర్‌గా బాబు.ఎ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆరోగ్యశ్రీ అకౌంట్ లావాదేవీలు తానే చేస్తానని వైద్యునికి ఇచ్చిన డ్రా పవర్‌ను రద్దు చేశారు. దీంతో గత ఏడాది జూన్ నుంచి అన్ని చెల్లింపులు నిలిచిపోయాయి. వైద్య శాఖ కార్యదర్శికి వినతి ఎన్టీఆర్ వైద్య సేవ చెల్లింపులు నిలుపుదల చేయడంపై ప్రభుత్వాస్పత్రికి తనిఖీలకు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శికి టీచింగ్ వైద్యుల సంఘం తరపున రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.అప్పారావు వినతిపత్రం సమర్పించారు. ఇలాగైతే తాము సర్జరీలు చేస్తాము కానీ, ఎన్టీఆర్ వైద్య సేవలో రోగిని రిజిస్ట్రేషన్ చేయమని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఆస్పత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఆరోగ్యశ్రీ నిధులు రూ.కోట్లలో ఉన్నట్లు వారు పేర్కొన్నారు. వారి వినతిపై స్పందించిన పూనం మాలకొండయ్య ఈ విషయాన్ని పరిశీలిస్తానని తెలిపారు. ఇదే వినతిపత్రాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవో రవిశంకర్ అయ్యర్, డీఎంఈ డాక్టర్ టి.వేణుగోపాలరావులకు కూడా అందజేశారు. -
ఎందుకో ఈ కక్ష..?
► పేదల ఆరోగ్యంతో రాష్ర్ట ప్రభుత్వం ఆటలు ► ఒక్కో ఆసుపత్రికి రూ.కోట్లలో నిలిచిపోయిన ‘ఎన్టీఆర్ వైద్యసేవ’ బకాయిలు ► నెట్వర్క్ ఆసుపత్రులకు మూడు నెలలుగా బిల్లులు చెల్లించని వైనం ఆందోళనలో నిర్వాహకులు ► అనుమతుల జాప్యంతో నిలిచిపోతున్న ఆపరేషన్లు ఇబ్బందులు పడుతున్న నిరుపేద రోగులు సాక్షి, గుంటూరు : నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే పథకంపై టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తోంది.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చేందుకు అనేక చర్యలు చేపట్టింది.. గతంలో ఉన్న రోగాల జాబితాను తగ్గించడం, అనుమతులు సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలకు దిగారు.. నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులను సక్రమంగా చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచడం.. పేరు మార్చి ఎన్టీఆర్ వైద్య సేవగా నామకరణం చేయడం.. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును పేదల మనసుల్లోంచి చెరిపివేయాలనేది వీరి కుట్రలో భాగంగా ఉంది.. ఆరోగ్యశ్రీ అనే పేరు ఉన్నంత వరకూ ఇది సాధ్యం కాదని భావించి ఆరోగ్యశ్రీ కార్డులను సైతం మార్చి నిరుపేదలకు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులను అందించారు.. అనుమతుల కోసం తప్పని నిరీక్షణ.. మూడు నెలలుగా ఎన్టీ ఆర్ వైద్యసేవ పథకం కింద నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో కొన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవల కోసం వచ్చే నిరుపేద రోగులను చేర్చుకోకుండా వెనక్కు పంపుతున్నట్లు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేయించుకునే రోగులకు ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా ఒక్క రోజులో అనుమతి వచ్చేది. కానీ ప్రస్తుతం ఈ అనుమతులు రావాలంటే కనీసం నాలుగు నుంచి వారం రోజులు పడుతోంది. నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులు ప్రతి నెలా సకాలంలో చెల్లించేవారు. దీంతో ఆసుపత్రుల నిర్వాహకులు ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేసేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చేవారు. ప్రస్తుతం 2016 జనవరి నుంచి ఇంత వరకూ ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా తమకు రావాల్సిన బిల్లులు నిలిచిపోవడంతో ఆసుపత్రి నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే రోగులను వెనక్కు పంపుతున్నారు. దీనిపై నెట్వర్క్ ఆసుపత్రుల నిర్వాహకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధంకాగా ఈ నెల 15వ తేదీ నాటికి బిల్లులు చెల్లిస్తామంటూ వైద్య ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు ఇచ్చిన హామీతో తాత్కాలికంగా వాయిదా వేశారు. ఒక్కో ఆసుపత్రికి కోట్ల రూపాయలు బకాయి ఉండటంతో మరింత పెట్టుబడి పెట్టలేక ఇబ్బంది పడుతున్నామని నిర్వాహకులు వాపోతున్నారు. మందులూ అందడం లేదు.. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఆపరేషన్లు చేయించుకున్న వారికి ఫాలోఅప్ మందులు సక్రమంగా అందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలనెలా ఇచ్చే మందుల్లో రెండు, మూడు రకాల మందులను మాత్రమే ఇస్తూ మిగతావి లేవని, మరుసటి రోజు రావాలంటూ చెబుతున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే మందుల కోసం ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పడిగాపులు చేయాల్సిన దుస్థితి నెలకొందని వారు మండిపడుతున్నారు. అసలే అస్వస్థతతో ఉన్న రోగులు మందుల కోసం గంటల తరబడి వేచి ఉండలేక బయట మార్కెట్లో డబ్బులు వెచ్చించి కొనుగోలు చేస్తున్నామంటూ మరికొందరు చెబుతున్నారు. మొత్తంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యమవుతుందని వైద్యులే చెబుతుండటం గమనార్హం. -
ఇలాగైతే వైద్యం చేయలేం
► బిల్లులు ఇవ్వరు.. ప్యాకేజీలు పెంచరు.. ► అప్పుల్లో కూరుకుపోతున్న ఆస్పత్రులు ► రాష్ట్ర వ్యాప్తంగా రూ.350 కోట్ల బకాయి ► నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద సేవలు బంద్ విజయవాడ (లబ్బీపేట) : ‘ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్య శ్రీ) పథకంలో ఎనిమిదేళ్ల కిందట నిర్ణయించిన ప్యాకేజీలే ఇప్పటికీ అమలు చేస్తున్నారు. ఎన్నిసార్లు పెంచమన్నా స్పందించడం లేదు. అయినప్పటికీ మానవతా దృక్పథంతో పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం.. బిల్లులు చెల్లించే విషయంలో మొండి చేయి చూపుతున్నారు. ఇలాగైతే మేం వైద్యం చేయలేం. నాటికీ నేటికీ ఆస్పత్రుల నిర్వహణ వ్యయం మూడు నాలుగు రెట్లు పెరిగింది. బిల్లులు రాక పోవడంతో ఆస్పత్రి నిర్వహణ కష్టతరంగా మారింది’ అంటూ ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆషా) సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ రిఫరల్ ఆస్పత్రులకు మూడు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉంచడంతో బకాయిలు రూ.350 కోట్లకు చేరినట్లు చెపుతున్నారు. చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో శుక్రవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవతో పాటు, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్), వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు పేర్కొంటున్నారు. భారంగా మారిన నిర్వహణ ప్రస్తుతం ఆస్పత్రుల నిర్వహణ భారంగా మారినట్లు ఆస్పత్రుల యాజమాన్యాలు చెపుతున్నాయి. వైద్యులు, సిబ్బంది వేతనాలతో పాటు, కరెంటు బిల్లులు, ఇతర మెయింటినెన్స్ ఖర్చులు రోజు రోజుకు పెరుగుతున్నాయని వివరిస్తున్నాయి. అయినప్పటికీ నామమాత్రపు ప్యాకేజీలతో ఎన్టీఆర్ వైద్యసేవ, ఈహెచ్ఎస్లలో సేవలు అందిస్తున్నామని పేర్కొంటున్నాయి. ఈ తరుణంలో నగదు రహిత సేవలకు సంబంధించిన బిల్లులు సకాలంలో రాక పోవడంతో సిబ్బంది జీతాలు చెల్లించడం కూడా కష్టతరంగా మారిందని ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి ప్రతినెలా బిల్లులు ఇవ్వాలని, కనీసం రెండు నెలలకు ఒక్కసారైనా ఇవ్వాలని కోరారు. ప్యాకేజీలు పెంచాలి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో నిరుపేదలకు వైద్యం అందిస్తున్నందుకు, గిట్టుబాటు కాకున్నా తక్కువ ఫ్యాకేజీలపై వైద్యం చేస్తున్నామని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌కు అదే ప్యాకేజీ ఇస్తామంటే ఎలాగని ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకూ చార్జి చేసే ఆర్థోపెడిక్ సర్జరీకి ఎన్టీఆర్ వైద్య సేవలో రూ.15 వేలు మాత్రమే ప్యాకేజీ ఇస్తున్నారని, అన్ని విభాగాల్లోనూ ఇలానే ఉందని వివరించారు. వాటిని పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా స్పందించడం లేదని ఆషా సభ్యులు చెపుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం, తన తీరు మార్చుకోకుండా ఆస్పత్రుల యాజమాన్యాలపై వత్తిడి చేసి వైద్యం చేయించాలని చూడటం సరికాదని పలువురు వైద్యులు అంటున్నారు. ఇప్పటికైనా ప్యాకేజీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. -
‘మిత్ర’ ద్రోహం!
♦ దాదాపు 2 వేల మంది ఆరోగ్య మిత్రలను తొలగిస్తూ ఉత్తర్వులు ♦ ఏడేళ్ల్లకు పైగా అనుభవం ఉన్నా.. విద్యార్హతలు లేవని సాకు ♦ తమ వారికి అవకాశమిచ్చేందుకు కొత్తగా నియామకాలు ♦ ఉద్యోగాన్నే నమ్ముకున్న ఆరోగ్యమిత్రల కుటుంబాల్లో ఆందోళన ♦ నమ్మక ద్రోహంచేసి జాబులు తీసేస్తున్నారని ఆవేదన ♦ నేటి నుంచి ఆందోళన బాటలోకి ఉద్యోగులు సాక్షి, హైదరాబాద్: చిరు జీతగాళ్లయిన సుమారు 2 వేల మంది ఆరోగ్యమిత్రల పొట్టగొట్టింది రాష్ట్ర ప్రభుత్వం. వారిని వెంటనే తొలగించాలంటూ కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలో ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వారిని తొలగిస్తూ బుధవారం ప్రభుత్వం జీవో జారీచేసింది. దీంతో ఆరోగ్యమిత్రల కుటుంబాల్లో ఆందోళన పెల్లుబుకుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,984 మంది ఆరోగ్యమిత్రలు ఉన్నారు. వీరికి నెలకు రూ. 8,300 వేతనంగా ఇస్తున్నారు. చాలీచాలని జీతాలతోనే నెట్టుకొస్తున్న తమని చంద్రబాబు ప్రభుత్వం దొంగదెబ్బ తీసిందని ఆరోగ్యమిత్రలు వాపోతున్నారు. బాబొస్తే.. జాబొస్తుంది, తమను పర్మినెంట్ చేస్తారని నమ్మకంతో ఓట్లేస్తే నిండాముంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వారిని నియమించడం కోసం.. ఆరోగ్యశ్రీ సేవల కోసం వచ్చే రోగుల పేర్లు ఆన్లైన్లో నమోదుతో పాటు వారి జబ్బుల వివరాలు సేకరించి నెట్వర్క్ ఆస్పత్రికి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు పంపుతూ వాటికి అనుసంధానకర్తలుగా ఆరోగ్యమిత్రలు పనిచేస్తున్నారు. 2008లో ఆరోగ్యశ్రీ ప్రారంభమైన నాటి నుంచి వీరిని దశల వారీగా ఎంపిక చేశారు. ఏడేళ్లుగా పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలకు సరైన విద్యార్హతలు లేవని, కంప్యూటర్ పరిజ్ఞానం కూడా లేదని, విద్యార్హతలున్న వారిని ఎన్టీఆర్ వైద్యసేవ వైద్యమిత్రలుగా నియమిస్తున్నామని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని వెనుక ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి 20 నుంచి 30 వైద్య మిత్రల సిఫార్సుకు అవకాశం ఇచ్చి.. వారికి లబ్ధి చేకూర్చాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అందుకే ఇంతకాలం ఒక్క పోస్టును భర్తీ చేయని ప్రభుత్వం.. విద్యార్హతల పేరుతో ఆరోగ్యమిత్రలను తొలగిస్తున్నారని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. కొత్త నియామకాలు ఔట్సోర్సింగ్ ఏజెన్సీల పరిధిలో ఉంటాయని ఉత్తర్వుల్లో కూడా పేర్కొనడం కూడా దీనికి బలం చేకూరుస్తోంది. కొత్త నియామకాలకు విద్యార్హతలివీ.. తాజాగా నెట్వర్క్ వైద్య మిత్ర, పీహెచ్సీ వైద్య మిత్ర, నెట్వర్క్ టీమ్‌లీడర్, డివిజనల్ టీం లీడర్ ఉద్యోగాలు సృష్టించారు. ఉద్యోగాన్ని బట్టి వీటికి బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బి ఫార్మసీ, ఫార్మ డి, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ విద్యార్హత ఉండాలి. విద్యార్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, బాగా మాట్లాడే చొరవ, తెలుగు ఇంగ్లీషు రాయడం, చదవడం, మెడికల్ పరిభాషను త్వరగా అర్థం చేసుకోవడం వంటివి కూడా కావాలి. పోస్ట్‌గ్రాడ్యుయేషన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే అదనపు అర్హతగా భావిస్తారు. ఇక ఔట్సోర్సింగ్ ఏజెన్సీని కలెక్టర్ నియమిస్తారు. నియామక కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా వైద్యాధికారి సభ్య కార్యదర్శిగా, స్థానిక బోధనాసుపత్రి సూపరింటెండెంట్, వైద్యసేవ జిల్లా కో ఆర్డినేటర్లు సభ్యులుగా ఉంటారు. విద్యార్హతకు 65 మార్కులు, కంప్యూటర్ స్కిల్స్‌కు 15 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కులు ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మేమేమీ చేయలేం..: పూనం తొలగింపు ఉత్తర్వులు రాగానే ఆరోగ్యమిత్రల బృందం బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యను కలిశారు. దేశవ్యాప్తంగా ఆరోగ్యశ్రీకి గుర్తింపు వచ్చేలా చేశామని, పదుల సంఖ్యలో అవార్డులు వచ్చాయంటే అందులో తమ కృషి కూడా ఉందని ఆమెకు చెప్పారు. అయినా ఈ విషయంలో తానేమీ చేయలేనని, ఇది సర్కారు నిర్ణయమని చెప్పినట్టు ఆరోగ్యమిత్రలు ‘సాక్షి’కి తెలిపారు. సర్కారు నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ నేటినుంచి సమ్మెలోకి వెళుతున్నామని ఆరోగ్యమిత్రల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. ఈమేరకు అధ్యక్షులు సీహెచ్ గోవింద్, ప్రధాన కార్యదర్శి డీఆర్డీ రాయ్ సాక్షితో మాట్లాడారు. రోగులకు ఇబ్బంది కలిగించడం తమకు బాధ కలిగిస్తోందని, అయినా విధిలేని పరిస్థితుల్లో తమ కుటుంబాలు వీధిన పడుతున్నాయనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మా ఉసురు తగులుతుంది మా ఉసురు చంద్రబాబు ప్రభుత్వానికి తగులుతుంది. 8 ఏళ్లుగా పనిచేస్తున్న మమ్మల్ని తొలగించడం అన్యాయం. తెలంగాణలో ఉన్న వారిని కొనసాగిస్తూ జీతాలు పెంచితే ఆంధ్రప్రదేశ్ సీఎం జీతాలు పెంచకపోగా తొలగించడం దుర్మార్గపు చర్య. టీడీపీ ప్రభుత్వం దగాకోరు ప్రభుత్వం. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తం గా మిత్రలు అందరం విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టాలని నిర్ణయించాం. - సీహెచ్.నాయుడు, ఆరోగ్యమిత్రల సంఘ రాష్ట్ర కార్యదర్శి బాబు వచ్చి జాబులు పీకేస్తున్నారు తాను అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు భృతి ఇస్తానని, ఇంటింటికీ ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక తన పాత పంథానే కొనసాగిస్తున్నారు. బాబు వస్తే జాబు వస్తుందనుకుంటే ఉన్న ఉద్యోగాలనే తీసేస్తున్నారు. 8 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నాం. చాలీచాలని వేతనాలతో కడుపు కాల్చుకుని పనిచేస్తున్నాం. అయినా మాపై కనికరం లేకుండా ఉద్యోగాలు తీసేయడానికి సిద్ధమయ్యారు. దీనిపై ఆందోళనలు చేస్తాం. - నరసింహులు, ఆరోగ్యశ్రీ అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్, కర్నూలు జిల్లా అధ్యక్షుడు -
బొమ్మ మార్చేందుకు రూ.30 కోట్లు!
♦ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులపై ఇక ఎన్టీఆర్ చిత్రం ♦ లబ్ధిదారులకు కొత్త కార్డుల జారీ ♦ 24న టెండర్ నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పేరును టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చేసింది. కార్డుల్లో రాజీవ్ గాంధీ బొమ్మ ఉందన్న కారణంతో ఇప్పుడు ఏకంగా కార్డులనే మార్చాలని నిర్ణయించింది. కొత్తకార్డుల్లో ఎన్టీఆర్ బొమ్మను చేర్చనున్నారు. వీటి ముద్రణకు రూ.30 కోట్లు అవసరమని రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్ఐడీసీ) అంచనా వేసింది. కార్డుల జారీ ప్రక్రియ ఏపీఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలోనే జరగనుంది. కార్డుల ముద్రణకు ఈ నెల 24న టెండర్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. డిసెంబర్ 8న టెండర్ ప్రక్రియను పూర్తిచేసి పనులు అప్పగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ర్టంలో 1.31 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది. ప్రభుత్వం సకాలంలో నిధులు ఇవ్వకపోవడంతో పథకం అమల్లో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కొత్త కార్డుల కోసం రూ.30 కోట్లు వెచ్చిస్తుండటంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్క్రూటినీ పేరుతో కోత! ఎన్టీఆర్ బొమ్మతో కూడిన కొత్త కార్డులను జారీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు సూక్ష్మ పరిశీలన(స్క్రూటినీ) పేరుతో ఉన్న కార్డులను తొలగిస్తారేమోనని పలు వర్గాల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) పథకానికి నిధుల్లో కోత ప్రారంభమైంది. రూ.850 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదించగా, ప్రభుత్వం రూ.500 కోట్లే ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించి నిధులూ ఇవ్వలేదు. కొత్త కార్డులపై పరిశీలన పేరిట పాతవి తొలగించే అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం 84 శాతం మందికి ఈ పథకం వర్తిస్తోంది. వాస్తవానికి ఇంతమందికి అవసరం లేదని, ప్రజల ఆదా య పరిమితిని పరిశీలించి కార్డులను ఇవ్వాలని సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. లేదంటే రూ.30 కోట్లతో కొత్తగా కార్డులు జారీ చేయాల్సిన అవసరం ఏముందని వివిధ వర్గాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.