‘మిత్ర’ ద్రోహం! | From today employees way into the concern | Sakshi
Sakshi News home page

‘మిత్ర’ ద్రోహం!

Published Thu, Jan 21 2016 4:07 AM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM

‘మిత్ర’ ద్రోహం!

‘మిత్ర’ ద్రోహం!

♦ దాదాపు 2 వేల మంది ఆరోగ్య మిత్రలను తొలగిస్తూ ఉత్తర్వులు
♦ ఏడేళ్ల్లకు పైగా అనుభవం ఉన్నా.. విద్యార్హతలు లేవని సాకు
♦ తమ వారికి అవకాశమిచ్చేందుకు కొత్తగా నియామకాలు
♦ ఉద్యోగాన్నే నమ్ముకున్న ఆరోగ్యమిత్రల కుటుంబాల్లో ఆందోళన
♦ నమ్మక ద్రోహంచేసి జాబులు తీసేస్తున్నారని ఆవేదన
♦ నేటి నుంచి ఆందోళన బాటలోకి ఉద్యోగులు
 
 సాక్షి, హైదరాబాద్: చిరు జీతగాళ్లయిన సుమారు 2 వేల మంది ఆరోగ్యమిత్రల పొట్టగొట్టింది రాష్ట్ర ప్రభుత్వం. వారిని వెంటనే తొలగించాలంటూ కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలో ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వారిని తొలగిస్తూ బుధవారం ప్రభుత్వం జీవో జారీచేసింది. దీంతో ఆరోగ్యమిత్రల కుటుంబాల్లో ఆందోళన పెల్లుబుకుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,984 మంది ఆరోగ్యమిత్రలు ఉన్నారు. వీరికి నెలకు రూ. 8,300 వేతనంగా ఇస్తున్నారు. చాలీచాలని జీతాలతోనే నెట్టుకొస్తున్న తమని చంద్రబాబు ప్రభుత్వం దొంగదెబ్బ తీసిందని ఆరోగ్యమిత్రలు వాపోతున్నారు. బాబొస్తే.. జాబొస్తుంది, తమను పర్మినెంట్ చేస్తారని నమ్మకంతో ఓట్లేస్తే నిండాముంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 తమ వారిని నియమించడం కోసం..
 ఆరోగ్యశ్రీ సేవల కోసం వచ్చే రోగుల పేర్లు ఆన్‌లైన్‌లో నమోదుతో పాటు వారి జబ్బుల వివరాలు సేకరించి నెట్‌వర్క్ ఆస్పత్రికి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు పంపుతూ వాటికి అనుసంధానకర్తలుగా ఆరోగ్యమిత్రలు పనిచేస్తున్నారు. 2008లో ఆరోగ్యశ్రీ ప్రారంభమైన నాటి నుంచి వీరిని దశల వారీగా ఎంపిక చేశారు. ఏడేళ్లుగా పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలకు సరైన విద్యార్హతలు లేవని, కంప్యూటర్ పరిజ్ఞానం కూడా లేదని, విద్యార్హతలున్న వారిని ఎన్టీఆర్ వైద్యసేవ వైద్యమిత్రలుగా నియమిస్తున్నామని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని వెనుక ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి 20 నుంచి 30 వైద్య మిత్రల సిఫార్సుకు అవకాశం ఇచ్చి.. వారికి లబ్ధి చేకూర్చాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అందుకే ఇంతకాలం ఒక్క పోస్టును భర్తీ చేయని ప్రభుత్వం.. విద్యార్హతల పేరుతో ఆరోగ్యమిత్రలను తొలగిస్తున్నారని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. కొత్త నియామకాలు ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల పరిధిలో ఉంటాయని ఉత్తర్వుల్లో కూడా పేర్కొనడం కూడా దీనికి బలం చేకూరుస్తోంది.

 కొత్త నియామకాలకు విద్యార్హతలివీ..
 తాజాగా నెట్‌వర్క్ వైద్య మిత్ర, పీహెచ్‌సీ వైద్య మిత్ర, నెట్‌వర్క్ టీమ్‌లీడర్, డివిజనల్ టీం లీడర్ ఉద్యోగాలు సృష్టించారు. ఉద్యోగాన్ని బట్టి వీటికి బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బి ఫార్మసీ, ఫార్మ డి, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ  విద్యార్హత ఉండాలి. విద్యార్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, బాగా మాట్లాడే చొరవ, తెలుగు ఇంగ్లీషు రాయడం, చదవడం, మెడికల్ పరిభాషను త్వరగా అర్థం చేసుకోవడం వంటివి కూడా కావాలి. పోస్ట్‌గ్రాడ్యుయేషన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే అదనపు అర్హతగా భావిస్తారు.

ఇక ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీని కలెక్టర్ నియమిస్తారు. నియామక కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా వైద్యాధికారి సభ్య కార్యదర్శిగా, స్థానిక బోధనాసుపత్రి సూపరింటెండెంట్, వైద్యసేవ జిల్లా కో ఆర్డినేటర్‌లు సభ్యులుగా ఉంటారు. విద్యార్హతకు 65 మార్కులు, కంప్యూటర్ స్కిల్స్‌కు 15 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కులు ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

 మేమేమీ చేయలేం..: పూనం
 తొలగింపు ఉత్తర్వులు రాగానే ఆరోగ్యమిత్రల బృందం బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యను కలిశారు. దేశవ్యాప్తంగా ఆరోగ్యశ్రీకి గుర్తింపు వచ్చేలా చేశామని, పదుల సంఖ్యలో అవార్డులు వచ్చాయంటే అందులో తమ కృషి కూడా ఉందని ఆమెకు చెప్పారు. అయినా ఈ విషయంలో తానేమీ చేయలేనని, ఇది సర్కారు నిర్ణయమని చెప్పినట్టు ఆరోగ్యమిత్రలు ‘సాక్షి’కి తెలిపారు. సర్కారు నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ నేటినుంచి సమ్మెలోకి వెళుతున్నామని ఆరోగ్యమిత్రల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. ఈమేరకు అధ్యక్షులు సీహెచ్ గోవింద్, ప్రధాన కార్యదర్శి డీఆర్‌డీ రాయ్ సాక్షితో మాట్లాడారు. రోగులకు ఇబ్బంది కలిగించడం తమకు బాధ కలిగిస్తోందని, అయినా విధిలేని పరిస్థితుల్లో తమ కుటుంబాలు వీధిన పడుతున్నాయనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
 
 మా ఉసురు తగులుతుంది
 మా ఉసురు చంద్రబాబు ప్రభుత్వానికి తగులుతుంది. 8 ఏళ్లుగా పనిచేస్తున్న మమ్మల్ని తొలగించడం అన్యాయం. తెలంగాణలో ఉన్న వారిని కొనసాగిస్తూ జీతాలు పెంచితే ఆంధ్రప్రదేశ్ సీఎం జీతాలు పెంచకపోగా తొలగించడం దుర్మార్గపు చర్య. టీడీపీ ప్రభుత్వం దగాకోరు ప్రభుత్వం. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తం గా మిత్రలు అందరం విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టాలని నిర్ణయించాం.
 - సీహెచ్.నాయుడు, ఆరోగ్యమిత్రల సంఘ రాష్ట్ర కార్యదర్శి
 

 బాబు వచ్చి జాబులు పీకేస్తున్నారు
 తాను అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు భృతి ఇస్తానని, ఇంటింటికీ ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక తన పాత పంథానే కొనసాగిస్తున్నారు. బాబు వస్తే జాబు వస్తుందనుకుంటే ఉన్న ఉద్యోగాలనే తీసేస్తున్నారు. 8 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నాం. చాలీచాలని వేతనాలతో కడుపు కాల్చుకుని పనిచేస్తున్నాం. అయినా మాపై కనికరం లేకుండా ఉద్యోగాలు తీసేయడానికి సిద్ధమయ్యారు. దీనిపై ఆందోళనలు చేస్తాం.
 - నరసింహులు, ఆరోగ్యశ్రీ అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్, కర్నూలు జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement