ఇలాగైతే వైద్యం చేయలేం
► బిల్లులు ఇవ్వరు.. ప్యాకేజీలు పెంచరు..
► అప్పుల్లో కూరుకుపోతున్న ఆస్పత్రులు
► రాష్ట్ర వ్యాప్తంగా రూ.350 కోట్ల బకాయి
► నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద సేవలు బంద్
విజయవాడ (లబ్బీపేట) : ‘ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్య శ్రీ) పథకంలో ఎనిమిదేళ్ల కిందట నిర్ణయించిన ప్యాకేజీలే ఇప్పటికీ అమలు చేస్తున్నారు. ఎన్నిసార్లు పెంచమన్నా స్పందించడం లేదు. అయినప్పటికీ మానవతా దృక్పథంతో పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం.. బిల్లులు చెల్లించే విషయంలో మొండి చేయి చూపుతున్నారు. ఇలాగైతే మేం వైద్యం చేయలేం. నాటికీ నేటికీ ఆస్పత్రుల నిర్వహణ వ్యయం మూడు నాలుగు రెట్లు పెరిగింది. బిల్లులు రాక పోవడంతో ఆస్పత్రి నిర్వహణ కష్టతరంగా మారింది’ అంటూ ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆషా) సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ రిఫరల్ ఆస్పత్రులకు మూడు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉంచడంతో బకాయిలు రూ.350 కోట్లకు చేరినట్లు చెపుతున్నారు. చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో శుక్రవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవతో పాటు, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్‌ఎస్), వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు పేర్కొంటున్నారు.
భారంగా మారిన నిర్వహణ
ప్రస్తుతం ఆస్పత్రుల నిర్వహణ భారంగా మారినట్లు ఆస్పత్రుల యాజమాన్యాలు చెపుతున్నాయి. వైద్యులు, సిబ్బంది వేతనాలతో పాటు, కరెంటు బిల్లులు, ఇతర మెయింటినెన్స్ ఖర్చులు రోజు రోజుకు పెరుగుతున్నాయని వివరిస్తున్నాయి. అయినప్పటికీ నామమాత్రపు ప్యాకేజీలతో ఎన్టీఆర్ వైద్యసేవ, ఈహెచ్‌ఎస్‌లలో సేవలు అందిస్తున్నామని పేర్కొంటున్నాయి. ఈ తరుణంలో నగదు రహిత సేవలకు సంబంధించిన బిల్లులు సకాలంలో రాక పోవడంతో సిబ్బంది జీతాలు చెల్లించడం కూడా కష్టతరంగా మారిందని ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి ప్రతినెలా బిల్లులు ఇవ్వాలని, కనీసం రెండు నెలలకు ఒక్కసారైనా ఇవ్వాలని కోరారు.
ప్యాకేజీలు పెంచాలి
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో నిరుపేదలకు వైద్యం అందిస్తున్నందుకు, గిట్టుబాటు కాకున్నా తక్కువ ఫ్యాకేజీలపై వైద్యం చేస్తున్నామని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌కు అదే ప్యాకేజీ ఇస్తామంటే ఎలాగని ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకూ చార్జి చేసే ఆర్థోపెడిక్ సర్జరీకి ఎన్టీఆర్ వైద్య సేవలో రూ.15 వేలు మాత్రమే ప్యాకేజీ ఇస్తున్నారని, అన్ని విభాగాల్లోనూ ఇలానే ఉందని వివరించారు. వాటిని పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా స్పందించడం లేదని ఆషా సభ్యులు చెపుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం, తన తీరు మార్చుకోకుండా ఆస్పత్రుల యాజమాన్యాలపై వత్తిడి చేసి వైద్యం చేయించాలని చూడటం సరికాదని పలువురు వైద్యులు అంటున్నారు. ఇప్పటికైనా ప్యాకేజీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.