బొమ్మ మార్చేందుకు రూ.30 కోట్లు!
♦ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులపై ఇక ఎన్టీఆర్ చిత్రం
♦ లబ్ధిదారులకు కొత్త కార్డుల జారీ
♦ 24న టెండర్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పేరును టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చేసింది. కార్డుల్లో రాజీవ్ గాంధీ బొమ్మ ఉందన్న కారణంతో ఇప్పుడు ఏకంగా కార్డులనే మార్చాలని నిర్ణయించింది. కొత్తకార్డుల్లో ఎన్టీఆర్ బొమ్మను చేర్చనున్నారు. వీటి ముద్రణకు రూ.30 కోట్లు అవసరమని రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్‌ఐడీసీ) అంచనా వేసింది. కార్డుల జారీ ప్రక్రియ ఏపీఎంఎస్‌ఐడీసీ ఆధ్వర్యంలోనే జరగనుంది. కార్డుల ముద్రణకు ఈ నెల 24న టెండర్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. డిసెంబర్ 8న టెండర్ ప్రక్రియను పూర్తిచేసి పనులు అప్పగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ర్టంలో 1.31 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది. ప్రభుత్వం సకాలంలో నిధులు ఇవ్వకపోవడంతో పథకం అమల్లో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కొత్త కార్డుల కోసం రూ.30 కోట్లు వెచ్చిస్తుండటంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
స్క్రూటినీ పేరుతో కోత!
ఎన్టీఆర్ బొమ్మతో కూడిన కొత్త కార్డులను జారీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు సూక్ష్మ పరిశీలన(స్క్రూటినీ) పేరుతో ఉన్న కార్డులను తొలగిస్తారేమోనని పలు వర్గాల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) పథకానికి నిధుల్లో కోత ప్రారంభమైంది. రూ.850 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదించగా, ప్రభుత్వం రూ.500 కోట్లే ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించి నిధులూ ఇవ్వలేదు. కొత్త కార్డులపై పరిశీలన పేరిట పాతవి తొలగించే అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం 84 శాతం మందికి ఈ పథకం వర్తిస్తోంది. వాస్తవానికి ఇంతమందికి అవసరం లేదని, ప్రజల ఆదా య పరిమితిని పరిశీలించి కార్డులను ఇవ్వాలని సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. లేదంటే రూ.30 కోట్లతో కొత్తగా కార్డులు జారీ చేయాల్సిన అవసరం ఏముందని వివిధ వర్గాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.