మెడాల్‌ మాయ! | Ten types of tests go away with fever | Sakshi
Sakshi News home page

మెడాల్‌ మాయ!

Published Fri, Apr 21 2017 1:45 AM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM

మెడాల్‌ మాయ!

మెడాల్‌ మాయ!

పేదల రక్తంతో సంపాదన
దోచుకోవడమే  మెడాల్‌ కేంద్రాల పని
జ్వరంతో వెళితే పది రకాల పరీక్షలు
టెస్టుల పేరుతో  రూ.2,300 వరకు వసూలు
ల్యాబ్‌లు, ప్రభుత్వ వైద్యుల  కుమ్మక్కు


సర్కారు ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన మెడాల్‌ పరీక్ష కేంద్రాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. పేదల రక్తంతో వ్యాపారం చేస్తూ రూ.లక్ష
లు గడిస్తున్నాయి. వైద్యులతో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత ఉన్నతాధికారులు వీటి వైపు కనీసం కన్నెత్తి చూడకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

పలమనేరు : ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెడాల్‌ సంస్థ సిబ్బంది, వైద్యులు కుమ్మక్కై పేద రోగులను బురిడీ కొట్టిస్తున్నారు. ఎన్టీఆర్‌ వైద్యసేవల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో 27 రకాల రక్త పరీక్షలు, టెలీమెడిసిన్, టెలీరేడియాలజీ తదితర పరీక్షలను ఉచితంగా చేపట్టాల్సి ఉంది. ఈ కాంట్రాక్టును రాష్ట్ర వ్యాప్తంగా చెన్నైకు చెందిన మెడాల్‌ అనే సంస్థ దక్కించుకుంది. వీరు జిల్లాలో కొన్ని ఫ్రాంచైజీలకు సబ్‌ కాంట్రాక్టు ఇచ్చారు. మెడాల్‌ నెలకు నిర్ణయించిన రూ.25 కోట్లను ఫ్రాంచైజీలు చెల్లించాల్సి ఉంది. జిల్లాలోని 94 పీహెచ్‌సీలు, 18 ఏరియా ఆస్పత్రులు,10 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్ల నుంచి రోగులకు అవసర మైన రక్త పరీక్షలను మెడాల్‌ సంస్థ పరిధిలో సబ్‌ కాంట్రాక్టు పొందిన ల్యాబ్‌లకు పంపాలి.

10 పీహెచ్‌సీలు, ఓ ఏరియా ఆస్పత్రి, సీహెచ్‌సీలకు కలిపి ఒక్కో ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇలాంటి కేంద్రాలున్నాయి. ఇందులోని ప్రైవేటు ల్యాబ్‌ టెక్నీషియన్లు ఆస్పత్రులకు వెళ్లి డాక్టర్లు సూచించిన రోగుల నుంచి రక్తాన్ని సేకరించాలి. ఒక్కో టెస్టుకు ప్రభుత్వం వీరికి రూ.230 అందజేస్తుంది. ఇలా ల్యాబ్‌ పరిధిలోని అన్ని ఆస్పత్రుల నుంచి సేకరించిన శాంపిళ్లను పరీక్షించి రిపోర్టులను సంబంధిత ఆస్పత్రులకు మెయిల్‌ చేస్తారు.

అక్రమాలు ఇలా..
పీహెచ్‌సీలో రోజుకు సరాసరి ఓపీ 60 నుంచి వంద దాకా ఉంటుంది. వాస్తవంగా రక్త పరీక్షలకు వచ్చినవారు పదిమంది మాత్రమే ఉంటారు. డాక్టర్లు 30 మంది రోగులను పరీక్షలకు సిఫారసు చేస్తారు. వీరిలో మెడాల్‌ సెంటర్‌ నుంచి వచ్చే ల్యాబ్‌ టెక్నీషియన్‌ రక్తాన్ని సేకరిస్తారు. కొందరు డాక్టర్లు రోగికి అవసరం లేకున్నా మొత్తం పది రకాల పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తారు. ఒక్కో టెస్టుకు రూ.230 చొప్పున మొత్తం పది టెస్టులకు రూ.2,300 ఖర్చుచేసినట్టు చూపిస్తారు. ఈ మొత్తాన్ని సబ్‌ లీజు పొందిన ఫ్రాంచైజీకి ప్రభుత్వం చెల్లించాలి. నెలలో జరిగిన మొత్తం టెస్టులకు కలిపి 40 శాతం దాకా వైద్యులకు కమీషన్లు అందుతున్నట్టు తెలుస్తోంది. అవసరమైన టెస్టు ను మాత్రం చేసి మిగిలినవాటికి నెగెటివ్‌ డమ్మీ రిపోర్టులను మెయిల్‌ చేయడంతో మిగతా 9 టెస్టులకు పైసా ఖర్చులేదు. ఇలా ప్రాంచైజీలు, మెడికల్‌ ఆఫీసర్లు కలసి ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అంతా చేతివాటమే..
ఫ్రాంచైజీల పరిధిలోని ల్యాబ్‌ల్లో సిబ్బందిని మూడు ఆస్పత్రులకు కలిపి ఒకరినే పెట్టారు. వీరు వచ్చేంతవరకు రోగులు ఆస్పత్రుల్లో వేచి ఉండాలి. ల్యాబ్‌ టెక్నీషియన్లు వెళ్లినప్పుడు ఆస్పత్రిలోని ఓపీలో ఉన్న రోగులకు గబగబా పరీక్షల కోసమని రక్తాన్ని సేకరిçస్తున్నట్లు సమాచారం. ఇలా సేకరించిన రక్తానికి కొన్ని సందర్భాల్లో అదే రోజు పరీక్షలు చేయడం లేదు. సెలవురోజుల్లో మెడాల్‌ సేవలు ఉండవు. మొత్తం మీద రోజూ రోగులకు భారీగా పరీక్షలు నిర్వహించి రిపోర్టులను ఆస్పత్రులకు మెయిల్‌ పంపించి ప్రభుత్వం నుంచి బోగస్‌ బిల్లులు స్పష్టమవుతోంది. పీహెచ్‌సీలకు వెళితే రక్త పరీక్షలు చేయించుకున్న రోగులకు సైతం ఎటువంటి రిపోర్టులుండవు. డాక్టర్లను అడిగితే మీకేరోగం లేదు రిపోర్టులు తమ మెయిల్‌లో ఉన్నాయంటూ వెనక్కు పంపిస్తున్నారు.

ప్రభుత్వ ల్యాబ్‌లు నిర్వీర్యం
మామూలుగా షుగర్‌ టెస్టుకు రూ.50 అవుతుంది. కానీ మెడాల్‌లో రూ.230గా నిర్ణయించారు. దానికితోడు మెడాల్‌ రాకతో ప్రభుత్వాసుపత్రుల్లోని ల్యాబ్‌లు అటకెక్కాయి. ఏరియా ఆస్పత్రిలో అన్ని రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నా మెడాల్‌ ల్యాబ్‌లోనే పరీక్షలను చేయిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ల్యాబ్‌లకు కెమికల్స్, కిట్లు రాకపోగా అందులోని సిబ్బందిని ఇతర విధులకు డెప్యూటేషన్‌ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వమే ఓ పద్ధతి ప్రకారం సర్కారు ఆస్పత్రులను నాశనం చేస్తోందని వైద్య సిబ్బందే పెదవి విరుస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement