గత ఏడాది జూన్ నుంచి చెల్లింపులు లేవు
ఇలాగైతే సర్జరీలు చేస్తాం.. కానీ రిజిష్టర్ చేయం
వైద్యశాఖ కార్యదర్శికి వైద్యుల సంఘం వినతి
విజయవాడ (లబ్బీపేట) : ఎన్టీఆర్ వైద్య సేవ(ఆరోగ్యశ్రీ) పథకంలో సర్జరీలు చేయించుకున్న ప్రభుత్వాస్పత్రి రోగులకు ఇంటికి వెళ్లేటపుడు చెల్లించాల్సిన చార్జీల విషయం తేల్చాలని మెడికల్ కో-ఆర్డినేటర్లు కోరుతున్నారు. రోగులకు వైద్యసేవ పథకంలో సర్జరీలు చేయడంతో ప్రభుత్వాస్పత్రికి ఆదాయం వస్తుంది. కానీ ఆ రోగులు ఇంటికెళ్లేటప్పుడు ఇవ్వాల్సిన చార్జీలను నిలిపి వేయడంతో మెడికల్ కో-ఆర్డినేటర్‌లు తమ జేబులో డబ్బులు ఇవ్వవల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది జూన్ నుంచి ఎన్టీఆర్ పథకం ద్వారా ఆస్పత్రికి నిధులు సమకూరుతున్నా, వాటిని వైద్యులకు రావాల్సిన చెల్లింపులతో పాటు, రోగులకు ఇచ్చే చార్జీల డబ్బులు కూడా నిలిపివేసారని వారు పేర్కొంటున్నారు.
నిబంధనలు ఇలా..
ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టినపుడు ప్రైవేటు ఆస్పత్రులతోపాటు ప్రభుత్వాస్పత్రుల్లో కూడా పథకాన్ని అమలు చేశారు. ఆరోగ్యశ్రీ సర్జరీలకు వచ్చే డబ్బులతో 20 శాతం మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం వద్ద ఉంచుకుని మిగిలిన 80 శాతం ఆస్పత్రికి విడుదల చేశారు. వాటిలో 35 శాతం సర్జరీ బృందం తీసుకోవాల్సి ఉంది. ఏడాదికి ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవ పథకంలో సర్జరీలు చేస్తున్నా వైద్యులు, సిబ్బందికి ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం ఇవ్వకపోవడంతో వైద్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
అసలేం జరిగిందంటే..
ప్రభుత్వాస్పత్రికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సమకూరిన నిధులు ప్రత్యేక అకౌంట్‌లో ఉండేవి. వాటిపై జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ చెక్ పవర్ ఉండేది. రూ.100 చెల్లింపునకు సైతం ఆయన వద్దకు చెక్కు కోసం వెళ్లడం కష్టమవడంతో చెల్లింపులు జాప్యం జరుగుతుందని అప్పట్లో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశం పలువురు వైద్యులు నాటి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో ఓ వైద్యునికి ఆరోగ్యశ్రీ చెల్లింపులకు సంబంధించి చెక్‌పవర్ ఇచ్చారు. కొన్నాళ్లు పని సజావుగానే జరిగింది. ఎప్పటికప్పుడు చెల్లింపులు చేసేవారు. అయితే కలెక్టర్‌గా బాబు.ఎ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆరోగ్యశ్రీ అకౌంట్ లావాదేవీలు తానే చేస్తానని వైద్యునికి ఇచ్చిన డ్రా పవర్‌ను రద్దు చేశారు. దీంతో గత ఏడాది జూన్ నుంచి అన్ని చెల్లింపులు నిలిచిపోయాయి.
వైద్య శాఖ కార్యదర్శికి వినతి
ఎన్టీఆర్ వైద్య సేవ చెల్లింపులు నిలుపుదల చేయడంపై ప్రభుత్వాస్పత్రికి తనిఖీలకు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శికి టీచింగ్ వైద్యుల సంఘం తరపున రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.అప్పారావు వినతిపత్రం సమర్పించారు. ఇలాగైతే తాము సర్జరీలు చేస్తాము కానీ, ఎన్టీఆర్ వైద్య సేవలో రోగిని రిజిస్ట్రేషన్ చేయమని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఆస్పత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఆరోగ్యశ్రీ నిధులు రూ.కోట్లలో ఉన్నట్లు వారు పేర్కొన్నారు. వారి వినతిపై స్పందించిన పూనం మాలకొండయ్య ఈ విషయాన్ని పరిశీలిస్తానని తెలిపారు. ఇదే వినతిపత్రాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవో రవిశంకర్ అయ్యర్, డీఎంఈ డాక్టర్ టి.వేణుగోపాలరావులకు కూడా అందజేశారు.