నేటి నుంచి పీహెచ్‌సీల్లో వైద్య సేవలు బంద్‌ | Medical services in PHCs will be closed from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పీహెచ్‌సీల్లో వైద్య సేవలు బంద్‌

Published Sat, Sep 14 2024 5:09 AM | Last Updated on Sat, Sep 14 2024 10:49 AM

Medical services in PHCs will be closed from today

అత్యవసర వైద్య సేవలు మాత్రమే అందించనున్న వైద్యులు 

పీజీ వైద్య విద్య ఇన్‌సర్వీస్‌ కోటా కుదింపుపై వైద్యుల ఆందోళన 

శుక్రవారం ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం 

ఆందోళన తీవ్రం చేసిన పీహెచ్‌సీ వైద్యుల సంఘం 

సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్‌ కోటా కుదింపును వ్యతిరేకిస్తూ పీహెచ్‌సీ వైద్యులు చేపట్టిన ఆందోళనను తీవ్రం చేశారు. శనివారం నుంచి పీహెచ్‌సీల్లో అత్యవసర వైద్య సేవలు, మినహా మిగిలిన సేవలను అందించబోమని ఏపీ పీహెచ్‌సీ వైద్యుల సంఘం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్‌సర్వీస్‌ కోటా కుదింపు జీవో 85ను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 10 నుంచి వైద్యులు ఆందోళన చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ప్రభుత్వం శుక్రవారం వైద్యులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ హరికిరణ్‌ వైద్యులతో సచివాలయంలో సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారంపై అధికారులు కనీస ఆసక్తి చూపించలేదని వైద్యుల సంఘం అభిప్రాయపడింది. 

స్పెషలిస్ట్‌ వైద్యుల కొరత ఉంది అని చెబుతూ తాము చూపిన ప్రత్యామ్నాయాల్లో వేటినీ స్వీకరించకపోవడం తీవ్ర మనోవేదనకు గురి చేసిందని సంఘం తెలిపింది. ప్రభుత్వంలోకంటే ప్రైవేటులో మెరుగైన సేవలు అందుతున్నాయని అధికారులు అనడం శోచనీయమంది. ఈ క్రమంలో ఆదివారం చలో విజయవాడ, సోమవారం డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ కార్యాలయానికి భారీ ర్యాలీ చేపడతామని తెలిపింది. మంగళవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తామని వెల్లడించింది.  



పీహెచ్‌సీ వైద్యులు కోల్పోతున్న మొత్తం సీట్లు 336
336 సీట్లు నష్టపోతున్న వైద్యులు ప్రభుత్వాస్పత్రుల్లో స్పెషలిస్ట్‌ వైద్యుల సంఖ్యను పెంచడం కోసం పీహెచ్‌సీల్లో సేవలు అందించే ఎంబీబీఎస్‌ వైద్యులను ఇన్‌సర్వీస్‌ కోటాలో పీజీ చేయించి, అనంతరం వారి సేవలను ఆస్పత్రుల్లో వినియోగిస్తుంటారు. కాగా, గత ప్రభుత్వంలో అన్ని ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో స్పెషలిస్ట్‌లను అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఇన్‌సర్వీస్‌ కోటాను పెంచారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement