తిరుపతి ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఎంసెట్ పరీక్ష శనివారం జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైంది. గత రెండేళ్లుగా ఎంసెట్ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తు విషయం తెలిసిందే. ఇక కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు 5 రోజుల పాటు ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తారు. 20 నుంచి 23వ తేదీ వరకు ఇంజినీరింగ్, 23, 24వ తేదీల్లో అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్ష జరగనుంది.
ఈ పరీక్షలను రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండు సెషన్స్‌లో నిర్వహించనున్నారు. ఎంసెట్ పరీక్ష కోసం చిత్తూరులో 1, మదనపల్లిలో 2, పుత్తూరులో 3, తిరుపతిలో 4, మొత్తం 10 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి జిల్లా నుంచి 14,409 మంది, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్‌లో 8,642 మంది, మొత్తం 23,051 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా తొలిరోజు ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 143 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఎంసెట్–2019 కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్.సాయిబాబు తెలిపారు.
143 మంది గైర్హాజరు..
తొలిరోజు జిల్లావ్యాప్తంగా 10 పరీక్ష కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో ఎంసెట్ పరీక్ష జరిగింది. ఉదయం జరిగిన పరీక్షకు 730 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 45 మంది గైర్హాజరవ్వడంతో 685 మంది పరీక్ష రాశారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 1,928 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 98 మంది గైర్హాజరవ్వడంతో 1,830 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 2,658 మందికి 143 మంది గైర్హాజరవ్వడంతో 2,515 మంది విద్యార్థులు పరీక్షను రాసినట్లు ఎంసెట్ కన్వీనర్ పేర్కొన్నారు.
క్షుణ్ణంగా తనిఖీలు..
ప్రశాంతంగా ఎంసెట్ ప్రశాంతంగా ఎంసెట్ పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థినీ, విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువానే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. హాల్‌టికెట్‌తో పాటు ఫొటో ఐడీని తనిఖీ చేశారు. సెల్‌ఫోన్లు, క్యాలికులేటర్, స్మార్ట్ వాచ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించ లేదు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎటువంటి వసతి కల్పించకపోవడంతో తల్లిదండ్రులు ఎండల్లోనే వేచి ఉన్న పరిస్థితి కనిపించింది. కొన్నిచోట్ల చెట్ల నీడన సేదదీరారు.
Comments
Please login to add a commentAdd a comment