Eamcet exams
-
ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలకు రీషెడ్యూల్.. తేదీలివే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వాయిదాపడిన ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు, టీఎస్ ఈసెట్, టీఎస్ పీజీఈసెట్ పరీక్షలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి రీ షెడ్యూల్ ప్రకటించింది. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్లో మార్పులను అభ్యర్థులు గమనించాలని కోరింది. హాల్ టికెట్స్‌ను త్వరలో డౌన్లోడ్ చేసుకునేందుకు సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షల తేదీలు.. 1. టీఎస్ ఎంసెట్ (అగ్రికల్చర్&మెడికల్)-జులై 30 మరియు 31 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు 2. టీఎస్ ఈసెట్ ఆగస్టు 1న ఉదయం 9 నుంచి 12 మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు 3. టీఎస్ పీజీఈసెట్- ఆగస్టు 2 నుంచి 5 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు -
Telangana: ఎంసెట్ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తీవ్ర తర్జనభర్జనలు, విద్యార్థి సంఘాల నిరసనల నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో జరగాల్సిన ఎంసెట్‌ను వాయిదా వేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ఈమేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. అయితే 14, 15 తేదీల్లో జరగాల్సిన వ్యవసాయ, మెడికల్ విభాగానికి చెందిన ఎంసెట్ మాత్రమే వాయిదా వేశామని, 18 నుంచి 20వరకూ జరిగే ఇంజనీరింగ్ విభాగం ఎంసెట్ యథావిధిగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వాయిదా పడ్డ ఎంసెట్ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని తెలి పారు. రాబోయే మూడు రోజులూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఐటీ కన్సల్టెన్సీ సంస్థ నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకున్న మండలి వర్గాలు కూడా వర్షాలున్నా ఎంసెట్‌ను నిర్వహించి తీరుతామని తొలుత స్పష్టం చేశాయి. విద్యార్థి సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో ఎంసెట్‌ను వాయిదా వేయడానికి ప్రభుత్వం అంగీకరించక తప్పలేదు. 16 వరకు ఓయూ పరీక్షలు వాయిదా: ఓయూ పరిధిలో ఈనెల 16 వరకు అన్ని పరీక్షలను వాయిదా వేసిన్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ బుధవారం తెలిపారు. ప్రధాన కార్యాలయాలు యథావిధిగా కొనసాగుతాయని సపోర్టింగ్ స్టాఫ్ విధులకు హాజరుకావాలన్నారు. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ పరీక్షలు వాయిదా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఈనెల 14, 15 తేదీల్లో జరగాల్సిన పీజీ రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పరాంకుశం వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. వాయిదా పడ్డ పరీక్షలను నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. -
ప్రశాంతంగా ఎంసెట్
తిరుపతి ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఎంసెట్ పరీక్ష శనివారం జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైంది. గత రెండేళ్లుగా ఎంసెట్ పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తు విషయం తెలిసిందే. ఇక కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు 5 రోజుల పాటు ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తారు. 20 నుంచి 23వ తేదీ వరకు ఇంజినీరింగ్, 23, 24వ తేదీల్లో అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలను రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండు సెషన్స్‌లో నిర్వహించనున్నారు. ఎంసెట్ పరీక్ష కోసం చిత్తూరులో 1, మదనపల్లిలో 2, పుత్తూరులో 3, తిరుపతిలో 4, మొత్తం 10 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి జిల్లా నుంచి 14,409 మంది, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్‌లో 8,642 మంది, మొత్తం 23,051 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా తొలిరోజు ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 143 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఎంసెట్–2019 కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్.సాయిబాబు తెలిపారు. 143 మంది గైర్హాజరు.. తొలిరోజు జిల్లావ్యాప్తంగా 10 పరీక్ష కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో ఎంసెట్ పరీక్ష జరిగింది. ఉదయం జరిగిన పరీక్షకు 730 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 45 మంది గైర్హాజరవ్వడంతో 685 మంది పరీక్ష రాశారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 1,928 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 98 మంది గైర్హాజరవ్వడంతో 1,830 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 2,658 మందికి 143 మంది గైర్హాజరవ్వడంతో 2,515 మంది విద్యార్థులు పరీక్షను రాసినట్లు ఎంసెట్ కన్వీనర్ పేర్కొన్నారు. క్షుణ్ణంగా తనిఖీలు.. ప్రశాంతంగా ఎంసెట్ ప్రశాంతంగా ఎంసెట్ పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థినీ, విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువానే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. హాల్‌టికెట్‌తో పాటు ఫొటో ఐడీని తనిఖీ చేశారు. సెల్ఫోన్లు, క్యాలికులేటర్, స్మార్ట్ వాచ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించ లేదు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎటువంటి వసతి కల్పించకపోవడంతో తల్లిదండ్రులు ఎండల్లోనే వేచి ఉన్న పరిస్థితి కనిపించింది. కొన్నిచోట్ల చెట్ల నీడన సేదదీరారు. -
19 నుంచి ఎంసెట్ ప్రాక్టీస్ టెస్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పద్ధతిలో తొలిసారిగా జరిగే ఎంసెట్– 2018 ఆన్లైన్ పరీక్షకు సంబంధించి విద్యార్థులకు జేఎన్టీయూ సరికొత్త అవకాశం కల్పించింది. పరీక్షపై అవగాహనకు ప్రాక్టీస్ టెస్ట్‌లు నిర్వహిస్తోంది. ఈనెల 19, 20 తేదీల్లో ప్రాక్టీస్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నట్లు జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఎంసెట్ పరీక్ష నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను శనివారం జేఎన్టీయూలో రిజిస్ట్రార్ యాదయ్యతో కలిసి ఆయన మీడియాకు వివరిం చారు. ప్రాక్టీస్ టెస్టులకు హాజరుకావాలనుకున్న విద్యార్థులు ముందుగా www.eamcet. tsche.ac.inలో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌కు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ, హైదరాబాద్ జోన్లలో 70 వేల మంది టెస్ట్‌కు హాజరయ్యేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది. వెబ్సైట్లో మాక్‌టెస్టులు రాసే అవకాశమూ కల్పించింది. ఒక విద్యార్థి ఎన్నిసార్లయినా మాక్‌టెస్ట్ రాయొచ్చని, దీంతో తుది పరీక్షలో ఎలాంటి ఆందోళనకు గురికారని అధికారులు చెబుతున్నారు. 2,17,166 దరఖాస్తులు.. ఎంసెట్–2018కు 2,17,166 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 1,45,549 మంది ఇంజనీరింగ్, 71,617 మంది అగ్రికల్చర్, మెడిసిన్ విభాగం కింద దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పరీక్ష నిర్వహణకు 2 రాష్ట్రాల్లో 168 కేంద్రాల ను ఏర్పాటు చేశారు. మే 2 నుంచి 7 వరకు ఎంసెట్ జరుగనుంది. మే 2, 3 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్, 4, 5, 7 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతాయి. రోజూ 2 సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు జరుగుతుంది. ఈ నెల 20 నుంచి వెబ్సైట్లో హాల్‌టికెట్లు ఉంచుతారు. నిమిషం ఆలస్యమైనా.. తొలిసారిగా ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు 2 గంటల ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. 2 గంటల ముందు నుంచే పరీక్ష కేంద్రం లోనికి విద్యార్థులను అనుమతిస్తారు. దీనివల్ల విద్యార్థి ఎలాంటి గందరగోళానికి గురికాకుండా కంప్యూటర్లో వివరాలను సరి చూసుకునే వీలుంటుంది. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని యంత్రాంగం స్పష్టం చేసింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దని సూచించింది. గోరింటాకు పెట్టుకోవద్దని, గోరింటాకు వల్ల వేలిముద్రలు సరిపోలకపోవచ్చని, ఫలితంగా విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపింది. మొబైల్ యాప్ కూడా ఎంసెట్‌కు సంబంధించి యంత్రాంగం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ ప్లేస్టోర్‌లో TSCHE myCET అని టైప్ చేసి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంతో నోటిఫికేషన్‌తోపాటు సీబీటీకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. హాల్‌టికెట్ సైతం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి విద్యార్థి మే 1 లోపు హాల్‌టికెట్‌ను తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవాలి. పరీక్ష కేంద్రాన్ని ముందుగానే చూసుకోవాలి. హాల్‌టికెట్‌తోపాటు ఆన్లైన్ దరఖాస్తు, బాల్‌పాయింట్ పెన్ను తప్పకుండా వెంట తెచ్చుకోవాలి. రఫ్ వర్క్ కోసం పరీక్ష కేంద్రంలోనే బుక్లెట్ ఇస్తారు. జవాబు మార్చుకోవచ్చు! ప్రశ్నకు ఇచ్చిన సమాధానం సరికాదని విద్యార్థికి అనిపిస్తే మార్చుకునే వీలుంది. చివరి నిమిషంలో సరైన సమాధానం ఎంపిక చేసుకునే వీలుంది. గతంలో మాన్యువల్ పద్ధతిలో నిర్వహించిన పరీక్షలో ఈ అవకాశం లేకపోవడంతో తప్పుడు సమాధానం గుర్తించిన విద్యార్థులు నష్టపోయేవారు. తాజాగా సర్దుబాటుకు అవకాశం ఉండటంతో విద్యార్థులకు మార్కులు కలిసివచ్చే అవకాశం ఉంది. ఇక యూజర్ ఐడీ విద్యార్థి హాల్‌టికెట్‌పైనే ఉంటుంది. పాస్వర్డ్ మాత్రం పరీక్ష హాలుకి చేరుకున్న తర్వాత ఇస్తారు. పరీక్ష తీరుపై వీడియో పరీక్ష హాలులోకి ప్రవేశించినప్పటి నుంచి వివరాలు సరిచూసుకోవడం, ప్రశ్నలు చదవడం, జవాబులు ఎంపిక చేసుకోవడం, పరీక్ష ముగింపు తీరుపై యంత్రాంగం ప్రత్యేక వీడియో రూపొందించింది. విద్యార్థుల్లో ఆందోళన తొలగించేందుకోసం ఎంసెట్ వెబ్సైట్లో ఈ వీడియోను అందుబాటులో ఉంచింది. యూట్యూబ్‌లో కూడా వీడియో అందుబాటులో ఉంచామని, ఈనెల 8 నుంచి ఆన్లైన్ ఎంసెట్‌పై అవగాహన తరగతులు నిర్వహించనున్నామని జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహిస్తామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో పది శాతం కంప్యూటర్లను అదనంగా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. -
ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే ఎంసెట్ పరీక్షా కేంద్రాలు
హైదరాబాద్ : ప్రైవేట్ విద్యాసంస్థలు నిరాకరించడంతోనే తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్ష వాయిదా పడిందని ఆ పరీక్ష కన్వీనర్ రమణారావు వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లో సాక్షి విలేకరితో ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వంతో చర్చించి త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపారు. ఎంసెట్ పరీక్ష నిర్వహణ కోసం ఇంజినీరింగ్‌కు 1, 45, 000 మెడికల్‌కు 105,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే ఎంసెట్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. -
నేడే ఎంసెట్.. సర్వం సిద్ధం
-
నేడే ఎంసెట్.. సర్వం సిద్ధం
ఖమ్మం: ఎంసెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నెలరోజులుగా ఈ పరీక్ష కోసం యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఖమ్మం, కొత్తగూడెం పట్టణాల్లో గురువారం జరిగే పరీక్షలకు 42 కేంద్రాలను సిద్ధం చేశారు. వీటిలో 21,543 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 4 వేల పై చిలుకు విద్యార్థులు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిరాసే వారు కావడం గమనార్హం. ఖమ్మంలో 20 కేంద్రాలలో 10,182 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు, 14 కేంద్రాలల్లో 7,058 మంది అగ్రికల్చర్, మెడికల్ విద్యార్థులు ఉండగా... కొత్తగూడెంలోని 5 కేంద్రాల్లో 2,915 మంది ఇంజినీరింగ్, మూడు కేంద్రాల్లో 1,388 మంది అగ్రికల్చర్, మెడికల్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షల నిర్వాహణ, ఇతర ఏర్పాట్ల కోసం జిల్లా కలెక్టర్ ఇలంబరితి, అదనపు కలెక్టర్ బాబురావు, జేఎన్టీయూ వైస్ చాన్సలర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు పలుమార్లు సమీక్షించారు. పర్యవేక్షణ కట్టుదిట్టం ఈ పరీక్షల నిర్వహణ కోసం 42 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 42 మంది చీఫ్ అబ్జర్వర్స్‌తో పాటు 898 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంజినీరింగ్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు మెడికల్, అగ్రికల్చర్ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని జిల్లా కో-ఆర్డినేటర్ పుష్పలత చెప్పారు. విద్యార్థులు పరీక్ష సమయూనికి గంట ముందుగా రావాలన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్నారు. జేఎన్టీయూ నుంచి ఫ్లయింగ్‌స్క్వాడ్ బృందాలు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను నియమించారు. పరీక్ష సమయంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, విద్యుత్, పోలీస్, మున్సిపాలిటీ అధికారుల సేవలు వినియోగించుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల కోసం రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ఇతర కూడళ్ల వద్ద హెల్ప్లైన్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు చేర్చేందుకు ఇంజినీరింగ్ కళాశాలలు బస్సు సౌకర్యాన్ని కల్పించాయి. మాస్ కాపీయింగ్ నియంత్రణకు.. మాస్ కాపీయింగ్ నియంత్రణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఖమ్మం, కొత్తగూడెం కన్వీనర్లు మాలోజి పుష్పలత, శ్రీనివాస్ తెలిపారు. చేతి గడియారాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చి, సెల్ఫోన్లు, ఇతర పరికరాలతో మాల్‌ప్రాక్టిస్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చారుు. ఈ నేపథ్యంలో విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు కూడా చేతిగడియారాలు పెట్టుకొని రావడం, సెల్ ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడాన్ని నిషేధించారు. ప్రతి పరీక్ష హాల్లో గోడగడియూరం ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష ప్రారంభం నుంచి ముగిసే వరకు కళాశాల యూజమాన్యాలు అటువైపు రావద్దని ఆదేశించారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నా చీఫ్ సూపరింటెండెంట్, చీఫ్ అబ్జర్వర్స్దే బాధ్యతని పేర్కొన్నారు. ఏపీ నుంచి 4వేల మంది.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 4వేల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఎంసెట్‌లో 15 శాతం నాన్‌లోకల్ కోటా ఉండటం, ఏపీలో ఈ పరీక్షలు ఇప్పటికే జరగడంతో నాన్‌లోకల్ అభ్యర్థులు జిల్లాలో భారీ సంఖ్యలో పరీక్ష రాస్తున్నారు. ఏపీ సరిహద్దులో జిల్లా ఉండటంతో ఎక్కువ మంది దీన్ని ఎంచుకున్నారు. -
అంతా సెట్ చేశారు
నేటి ఎంసెట్ కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాలు 4,300 ప్రయివేట్ వాహనాలు సిద్ధం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు టెట్ వరకు కొనసాగింపు ఇబ్బందులు ఎదురైతే డయల్ 100 కలెక్టర్, సీపీ వెల్లడి సాక్షి, విజయవాడ : జిల్లాలో శుక్రవారం జరిగే ఎంసెట్‌కు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వీలైనన్ని ఆర్టీసీ సర్వీసులతో పాటు ప్రయివేటు వాహనాలు నడపనున్నామని వివరించారు. ఆ తర్వాత జరిగే టెట్‌కు కూడా ఇవే ఏర్పాట్లు కొనసాగిస్తామని ఆయన వివరించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం కలెక్టర్ సీపీ వెంకటేశ్వరరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో గురువారం 36 శాతం ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించాయని, శుక్రవారం ఎంసెట్ నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ ఆర్టీసీ బస్సులు, అన్ని ప్రయివేటు విద్యాసంస్థల బస్సులు నడుపుతామని చెప్పారు. అన్ని మండలాల నుంచీ.. జిల్లాలో 1,400 బస్సులకు గానూ గురువారం 235 ఆర్టీసీ అద్దె బస్సులు, 265 ఆర్టీసీ బస్సులు నడిచాయని వివరించారు. జిల్లాలో 45వేల మంది ఎంసెట్ రాయనున్నారని, విజయవాడ, మచిలీపట్నంలో 81 సెంటర్లలో పరీక్ష జరుగుతుందని వివరించారు. 4,300 వరకు ప్రయివేట్ విద్యాసంస్థల వాహనాలు ఉన్నాయని రవాణాశాఖ ఇప్పటికే అన్ని యాజమాన్యాలను సంప్రదించిందని, ప్రయివేటు బస్సులు కూడా వినియోగించి విజయవాడ, మచిలీపట్నంకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి రవాణా ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాఫిక్ సమస్యకు చెక్ సీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులను విధుల్లో ఉంచి ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థుల రవాణా సౌకర్యం కోసం కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ వాహనాలను వినియోగిస్తామని చెప్పారు. దీనికోసం డయల్ 100కు ఫోన్‌చేస్తే ద్విచక్ర వాహనం నుంచి పోలీస్ వ్యాన్ వరకు ఏదైనా పంపుతామని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఆర్ఎం సుదేశ్‌కుమార్, రవాణా శాఖ ఇన్చార్జి డెప్యూటీ కమిషనర్ ఆర్.పురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఒక నిమిషం ఆలస్యమైనా నోఎంట్రీ పెనమలూరు : విజయవాడ రీజియన్‌లో జరిగే ఎంసెట్‌కు మొత్తం 40,899 మంది హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు జరిగే ఇంజినీరింగ్ పరీక్షకు 23,069, మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగే మెడికల్ పరీక్షకు 17,630 మంది హాజరవుతారు. ఇందుకు నగర పరిధిలో మొత్తం 81 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. పరీక్ష కేంద్రానికి గంట ముందు రావాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. అభ్యర్థులు హాల్ టికెట్, డౌన్లోడ్ చేసిన దరఖాస్తు, ఎస్సీ, ఎస్టీలైతే కుల ధ్రువీకరణ అటెస్టేషన్ కాపీని విధిగా తీసుకురావాలి. పరీక్ష హాల్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. మొత్తం 1,795 మంది అధికారులను పరీక్ష నిర్వహణకు నియమించారు. -
ఏపీలో తెలంగాణ ఎంసెట్ కేంద్రాల ఏర్పాటు అసాధ్యం!
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తెలంగాణ కేంద్రాల్లో రాయాల్సిందే ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేయనున్న తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ కేంద్రాలను ఏపీలో ఏర్పాటు చేయడం కుదరదని, అక్కడి విద్యార్థులు కూడా తెలంగాణకే వచ్చి ఎంసెట్ రాయాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఏపీలోనూ తెలంగాణ ఎంసెట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా ఇటీవల తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్యకు లేఖ రాశారు. దీనిపై రంజీవ్ ఆర్.ఆచార్య, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు మంగళవారం సమావేశమై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రాల ఏర్పాటు విషయంలో సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఈనెల 9తో ఎంసెట్ దరఖాస్తుల గడువు ముగియనున్న నేపథ్యంలో కొత్త కేంద్రాల ఏర్పాటు అసాధ్యమని తేల్చారు. ఏపీ విద్యార్థులు కూడా తెలంగాణ ఎంసెట్ రాయొచ్చని, అయితే వారు తెలంగాణలోని కేంద్రాల్లోనే ఎంసెట్ రాయాలని అందులో పేర్కొంది. ఏపీ విద్యార్థుల వెసులుబాటు కోసమే ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, నల్లగొండ జిల్లాలోని కోదాడలో ఈసారి కొత్తగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. నోటిఫికేషన్ జారీ చేసినప్పటినుంచి కేంద్రాల ఏర్పాటుపై మాట్లాడని ఏపీ ప్రభుత్వం దరఖాస్తుల ప్రక్రియ ముగియనున్న సమయంలో రెండు రోజుల కిందటే ఏపీలో కూడా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఏర్పాట్లన్నీ పూర్తికావచ్చాయని, ఇప్పుడు ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ అదనంగా పరీక్ష కేంద్రాల ఏర్పాటు అసాధ్యమని అధికారులు తేల్చారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ ఒకటి రెండ్రోజుల్లో ఏపీ విద్యా శాఖకు లేఖ రాసేందుకు తెలంగాణ విద్యా శాఖ నిర్ణయించింది. మరోవైపు ఎవరి కౌన్సెలింగ్ వారే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే తెలంగాణలో ఏపీ ఎంసెట్ కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు మాత్రం అధికారులు ఒప్పుకొన్నారు. -
ఎంసెట్.. తుది దశ సన్నాహాలు..
ఇంటర్మీడియెట్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ‘పరీక్షా కాలం’ దగ్గరకొస్తోంది! ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఫిబ్రవరి 12 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఆ తర్వాత మార్చి 9న తెలంగాణలో, మార్చి 11న ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వీటిలో మంచి మార్కులు సాధించేందుకు ప్రయత్నిస్తూనే, ఇంజనీరింగ్‌లో సీటు సాధించేందుకు వీలుకల్పించే ఎంసెట్‌లో ఉన్నత ర్యాంకు కోసం కృషి చేయడం ప్రధానం. ఈ క్రమంలో ఇప్పటి నుంచి ఎంసెట్‌కు ప్రిపరేషన్ ఎలా ఉండాలనే దానిపై స్పెషల్ ఫోకస్.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఇప్పటి నుంచి పూర్తిగా ఇంటర్ సబ్జెక్టుల ప్రిపరేషన్‌పై దృష్టిసారించాలి. ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలి. ప్రతి సబ్జెక్టుకు సంబంధించి తెలుగు అకాడెమీలోని అన్ని ప్రశ్నల సమాధానాలు చదవాలి. తొలుత గత రెండేళ్ల పబ్లిక్ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను పూర్తిచేయాలి. కాలేజీలో జరిగే ప్రి ఫైనల్ పరీక్షల్ని తప్పనిసరిగా రాయాలి. తప్పులు ఎక్కడ దొర్లుతున్నాయో చూసుకొని, మరో ప్రి ఫైనల్లో అలాంటివి జరక్కుండా జాగ్రత్తపడి వంద శాతం మార్కులు తెచ్చుకునేందుకు ప్రయత్నించాలి. ఇంటర్ పబ్లిక్ పరీక్షల తర్వాత ఎంసెట్‌కు దాదాపు 45 రోజులు సమయం అందుబాటులో ఉంటుంది. విశ్వవిద్యాలయాల్లో లేదంటే టాప్-20 ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించడమే లక్ష్యంగా ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి. ప్రభుత్వ, విశ్వవిద్యాలయాల ఇంజనీరింగ్ కాలేజీల్లో రెండు రాష్ట్రాల్లో సుమారు ఆరువేల సీట్లు ఉన్నాయి. వీటిలో సీటును ఖాయం చేసుకోవాలంటే 100-120 మార్కులు తెచ్చుకోవాలి. జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించాలనే లక్ష్యం ఉన్నవారు ఇప్పటి నుంచి ఫిబ్రవరి 28 వరకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లోని కాన్సెప్టులపై పూర్తిస్థాయిలో పట్టుసాధించాలి. దీంతోపాటు ఆయా చాప్టర్లలోని ఆబ్జెక్టివ్ ప్రశ్నలను మరోసారి సాధించాలి ప్రీ ఫైనల్ రాస్తూ కూడా ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్‌పై దృష్టిసారిస్తే ఇంటర్ పరీక్షల తర్వాత పది రోజుల్లో జరిగే జేఈఈ మెయిన్‌లో మంచి ర్యాంకు సంపాదించవచ్చు. మ్యాథమెటిక్స్ ఎంసెట్‌లో 160 మార్కులకు 80 మార్కులు మ్యాథమెటిక్స్‌కు ఉంటాయి. కచ్చితత్వం, వేగంతో కూడిన సమస్యల సాధన మంచి ర్యాంకు సాధనకు వీలుకల్పిస్తుంది. ఇంటిగ్రల్ కాలిక్యులస్, త్రీడీ జామెట్రీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ నంబర్స్, వెక్టార్ ఆల్జీబ్రా, ట్రిగనోమెట్రీ, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మెంట్స్, సర్కిల్స్ చాప్టర్లపై ఎక్కువ దృష్టిసారించాలి. ఈ చాప్టర్ల నుంచి ఎంసెట్‌లో అధిక ప్రశ్నలు వస్తాయి. ద్విపద సిద్ధాంతం, మ్యాథమెటికల్ ఇండక్షన్ సమస్యను సాధించేటప్పుడు లాజిక్స్, మినహాయింపులను గుర్తుంచుకోవడం ద్వారా సులువుగా సమాధానాన్ని రాబట్టవచ్చు. ట్రెగనోమెట్రీలో ప్రత్యేకంగా రాసుకొని, ప్రాక్టీస్ చేయాలి. కోఆర్డినేట్ జామెట్రీలో చాలా సమస్యలకు సమాధానాలను ఆప్షన్ల నుంచి రాబట్టవచ్చు. అందువల్ల వీటిని ప్రాక్టీస్ చేయాలి. ఫంక్షన్స్‌లో డొమైన్, రేంజ్; వెక్టార్ ఆల్జీబ్రాలో వజ్ర, బిందు లబ్ధం; క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్‌లో మూలాల సంబంధాలు; మ్యాట్రిసెస్‌లో నిర్ధారక ధర్మాలు, మాత్రికా ధర్మాలు; స్టాటిస్టిక్స్‌లో క్రమవిచలనం, విస్తృతి; సర్కిల్స్‌లో స్పర్శరేఖలు; 3డీ జ్యామితిలో బిందువులు, తలాలు అంశాలు ముఖ్యమైనవి. ఎంసెట్ 2013, 14 - వివిధ చాప్టర్ల వెయిటేజీ చాప్టర్ ప్రశ్నలు ఆల్జీబ్రా (బీజ గణితం) 26 కాలిక్యులస్ (కలనగణితం) 19 జామెట్రీ (రేఖాగణితం) 17 ట్రిగనోమెట్రీ (త్రికోణమితి) 9 వెక్టార్ ఆల్జీబ్రా (సదిశా బీజగణితం) 6 3డీ-జ్యామితి 3 ఫిజిక్స్ ఎంసెట్ పరంగా ఫిజిక్స్ విభాగం క్లిష్టమైనది. దీనికి 40 మార్కులు కేటాయించారు. కాన్సెప్టులపై ఎంతమేరకు పట్టు సాధించామనే దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. సూత్రాలను తెలుసుకోవడంతో పాటు వాటికి సంబంధించిన సమస్యలను సాధించడం ప్రధానం. ఒక సమస్యను రెండు, మూడు పద్ధతుల్లో సాధించడాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ నమూనా పరీక్షలు రాయడం ద్వారా వేగాన్ని అలవరచుకోవాలి. స్వీయ విశ్లేషణతో పట్టు సాధించాలి. ఎలక్ట్రో మ్యాగ్నటిజం, వేవ్ మోషన్, హీట్, మ్యాగ్నటిజం అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. న్యూక్లియర్ ఫిజిక్స్, అటామిక్ ఫిజిక్స్, సెమీకండక్టర్ డివెసైస్ అంశాలు ముఖ్యమైనవి. ఇవి సులువైన అంశాలు కూడా. మెకానిక్స్ నుంచి 30 శాతం, హీట్ నుంచి 10 శాతం, సౌండ్ అండ్ వేవ్ మోషన్ నుంచి 5 శాతం, ఎలక్ట్రిసిటీ నుంచి 15 శాతం, మ్యాగ్నటిజం నుంచి 13 శాతం, మోడర్న్ ఫిజిక్స్ నుంచి 10 శాతం ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. ఎంసెట్-2014లో చాప్టర్ల వారీగా ప్రశ్నలు మొదటి ఏడాది అంశం ప్రశ్నలు యూనిట్స్ అండ్ డైమన్షన్స్ 1 వెక్టార్స్ 1 కైనమాటిక్స్ 2 డైనమిక్స్ 2 కొలిజన్స్, సెంటర్ ఆఫ్ మాస్ 2 ఫ్రిక్షన్ 1 రొటేటరీ మోషన్ 2 గ్రావిటేషన్ 1 సరళహరాత్మక చలనం 1 ఎలాస్టిసిటీ 1 సర్ఫేస్ టెన్షన్ 1 ఫ్లూయిడ్ డైనమిక్స్ 1 హీట్ 4 ద్వితీయ సంవత్సరం వేవ్ మోషన్ 2 రే ఆప్టిక్స్, ఫిజికల్ ఆప్టిక్స్ 3 మ్యాగ్నటిజం 2 ఎలక్ట్రో స్టాటిక్స్ 2 కరెంట్ ఎలక్ట్రిసిటీ 2 ఎలక్ట్రో మ్యాగ్నటిజం 2 న్యూక్లియర్ ఫిజిక్స్ 2 సెమీ కండక్టర్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ 4 కమ్యూనికేషన్ సిస్టమ్స్ 1 కెమిస్ట్రీ ఫిజిక్స్ మాదిరిగానే ఎంసెట్‌లో కెమిస్ట్రీకి 40 మార్కులు కేటాయించారు. ఈ సబ్జెక్టును చదివేటప్పుడు ముఖ్యమైన అంశాలను అండర్లైన్ చేసుకోవాలి. వీటిని ఎక్కువసార్లు పునశ్చరణ చేయాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలోని అన్ని ఈక్వేషన్స్‌ను పదేపదే రాయడం ద్వారా పట్టు సాధించవచ్చు. సాలిడ్ స్టేట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కాంప్లెక్స్ కాంపౌండ్స్ కష్టమైనవిగా భావిస్తారు కానీ అవి చాలా ముఖ్యమైనవి. ఫిజికల్ కెమిస్ట్రీలోని సమస్య సాధనలు తప్ప మిగిలిన కెమిస్ట్రీలోని అన్నింటికీ ఇంటర్ ప్రిపరేషన్, ఎంసెట్ ప్రిపరేషన్‌కు పెద్దగా తేడా ఉండదు. ఎంసెట్‌లో మెరుగైన ర్యాంకు సాధించడంలో కెమిస్ట్రీ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సబ్జెక్టులో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. ఇందులోని 70 శాతం నుంచి 80 శాతం ప్రశ్నలను తేలి గ్గా సాధించవచ్చు. కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండ్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, పీరియాడిక్ టేబుల్ అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలోని అన్ని రసాయనిక సమ్మేళనాల ధర్మాలు, తయారీ పద్ధతులు నేర్చుకోవాలి. ఆల్కహాల్స్, ఫినాల్స్, అమైన్స్‌లోని నేమ్డ్ రియాక్షన్స్; ఆర్డర్ ఆఫ్ యాసిడ్, బేసిస్ స్ట్రెంథ్లను బాగా గుర్తుంచుకోవాలి. ఇంటర్ కన్వర్షన్స్‌ను నేర్చుకోవాలి. ఫిజికల్ కెమిస్ట్రీలోని సూత్రాలన్నింటినీ నేర్చుకొని, వాటి ఆధారిత సమస్యలను సాధించాలి. ఎంసెట్‌లో ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 12-16 ప్రశ్నలు వస్తాయి. మిగిలిన విభాగాలతో పోల్చితే ఇది కొంత క్లిష్టమైన విభాగం. ఇందులోని మూలకాల ధర్మాలను ఒకదాంతో మరోదాన్ని పోల్చుకుంటూ అధ్యయనం చేయాలి. అన్ని గ్రూప్స్‌లో మూలకాల ధర్మాలు చాలా వరకూ ఒకేలా ఉంటాయి. వాటి భిన్న ధర్మాలపై పట్టు సాధించాలి. పట్టిక రూపంలో రాసుకొని, పునశ్చరణ చేయడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటాయి. గత ఎంసెట్‌లో ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 10, ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 11, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 16, సమ్మిళిత భావనలు (కజ్ఠ్ఛీఛీ ఇౌఛ్ఛిఞ్టట) నుంచి మూడు ప్రశ్నలు వచ్చాయి. ఎంసెట్ 2014 వెయిటేజీ మొదటి సంవత్సరం అంశం ప్రశ్నలు అటామిక్ స్ట్రక్చర్ 2 పీరియాడిక్ టేబుల్ 1 కెమికల్ బాండింగ్ 2 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ 1 స్టాకియోమెట్రీ 1 థర్మోడైనమిక్స్ 1 కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్స అండ్ బేసెస్ 2 హైడ్రోజన్ అండ్ కాంపౌండ్స్ 1 ఆల్కలి, ఆల్కలిన్ ఎర్త్ మెటల్స్ 2 గ్రూప్ 13 ఎలిమెంట్స్ 1 గ్రూప్ 14 ఎలిమెంట్స్ 1 ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ 1 ఆర్గానిక్ బేసిక్స్, హైడ్రోకార్బన్స్ 4 ద్వితీయ సంవత్సరం అంశం ప్రశ్నలు సొల్యూషన్స్ 2 సాలిడ్ స్టేట్ 1 ఎలక్ట్రో కెమిస్ట్రీ 2 కెమికల్ కెనైటిక్స్ 1 మెటలర్జీ 1 గ్రూప్ 15 ఎలిమెంట్స్ 1 గ్రూప్ 16 ఎలిమెంట్స్ 1 గ్రూప్ 17 ఎలిమెంట్స్ 1 డి-బ్లాక్ ఎలిమెంట్స్ 1 నోబెల్ గ్యాసెస్ 1 పాలిమర్స్ 1 రోజువారీ జీవితంలో కెమిస్ట్రీ 1 ఆర్గానిక్ కాంపౌండ్స్ 4 సర్ఫేస్ కెమిస్ట్రీ 1 - ఎం. ఎన్. రావు, శ్రీ చైతన్య విద్యా సంస్థలు