ఖమ్మం: ఎంసెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నెలరోజులుగా ఈ పరీక్ష కోసం యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఖమ్మం, కొత్తగూడెం పట్టణాల్లో గురువారం జరిగే పరీక్షలకు 42 కేంద్రాలను సిద్ధం చేశారు. వీటిలో 21,543 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 4 వేల పై చిలుకు విద్యార్థులు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిరాసే వారు కావడం గమనార్హం.
ఖమ్మంలో 20 కేంద్రాలలో 10,182 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు, 14 కేంద్రాలల్లో 7,058 మంది అగ్రికల్చర్, మెడికల్ విద్యార్థులు ఉండగా... కొత్తగూడెంలోని 5 కేంద్రాల్లో 2,915 మంది ఇంజినీరింగ్, మూడు కేంద్రాల్లో 1,388 మంది అగ్రికల్చర్, మెడికల్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షల నిర్వాహణ, ఇతర ఏర్పాట్ల కోసం జిల్లా కలెక్టర్ ఇలంబరితి, అదనపు కలెక్టర్ బాబురావు, జేఎన్‌టీయూ వైస్ చాన్సలర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు పలుమార్లు సమీక్షించారు.
పర్యవేక్షణ కట్టుదిట్టం
ఈ పరీక్షల నిర్వహణ కోసం 42 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 42 మంది చీఫ్ అబ్జర్వర్స్‌తో పాటు 898 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంజినీరింగ్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు మెడికల్, అగ్రికల్చర్ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని జిల్లా కో-ఆర్డినేటర్ పుష్పలత చెప్పారు. విద్యార్థులు పరీక్ష సమయూనికి గంట ముందుగా రావాలన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్నారు.
జేఎన్‌టీయూ నుంచి ఫ్లయింగ్‌స్క్వాడ్ బృందాలు, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను నియమించారు. పరీక్ష సమయంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, విద్యుత్, పోలీస్, మున్సిపాలిటీ అధికారుల సేవలు వినియోగించుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల కోసం రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ఇతర కూడళ్ల వద్ద హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు చేర్చేందుకు ఇంజినీరింగ్ కళాశాలలు బస్సు సౌకర్యాన్ని కల్పించాయి.
మాస్ కాపీయింగ్ నియంత్రణకు..
మాస్ కాపీయింగ్ నియంత్రణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఖమ్మం, కొత్తగూడెం కన్వీనర్లు మాలోజి పుష్పలత, శ్రీనివాస్ తెలిపారు. చేతి గడియారాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చి, సెల్‌ఫోన్‌లు, ఇతర పరికరాలతో మాల్‌ప్రాక్టిస్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చారుు. ఈ నేపథ్యంలో విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు కూడా చేతిగడియారాలు పెట్టుకొని రావడం, సెల్ ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడాన్ని నిషేధించారు. ప్రతి పరీక్ష హాల్‌లో గోడగడియూరం ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష ప్రారంభం నుంచి ముగిసే వరకు కళాశాల యూజమాన్యాలు అటువైపు రావద్దని ఆదేశించారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నా చీఫ్ సూపరింటెండెంట్, చీఫ్ అబ్జర్వర్స్‌దే బాధ్యతని పేర్కొన్నారు.
ఏపీ నుంచి 4వేల మంది..
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 4వేల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఎంసెట్‌లో 15 శాతం నాన్‌లోకల్ కోటా ఉండటం, ఏపీలో ఈ పరీక్షలు ఇప్పటికే జరగడంతో నాన్‌లోకల్ అభ్యర్థులు జిల్లాలో భారీ సంఖ్యలో పరీక్ష రాస్తున్నారు. ఏపీ సరిహద్దులో జిల్లా ఉండటంతో ఎక్కువ మంది దీన్ని ఎంచుకున్నారు.
నేడే ఎంసెట్.. సర్వం సిద్ధం
Published Thu, May 14 2015 4:42 AM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM
Advertisement
Advertisement