
అత్యధికుల్లో లోపించిన చట్టపరమైన అవగాహన
క్లయింట్స్ గురించి సెల్ఫ్ చెక్ చేసుకుంటున్న వైనం
తాజా ఉదంతంతో అప్రమత్తమైన సిటీ సోషల్ స్టార్స్
నగరంలోనూ భారీ సంఖ్యలో ఇన్‌ఫ్లూయెన్సర్లు
బ్యూటీ ఫ్యాషన్ రంగాల్లో అధికం
క్లాసులూ, స్నేహితులతో ఊసులు తప్ప వేరే విషయాలు తెలియని ఓ కళాశాల విద్యార్థి ఓవర్‌నైట్ సోషల్ మీడియా స్టార్ అయిపోతాడు.. గడప దాటడం ఎరుగని ఓ గృహిణి కిచెన్‌లో గరిటె తిప్పుతూ లక్షల సంఖ్యలో ఫాలోయర్లను కూడగట్టుకుంటున్నారు. పల్లెటూరి నుంచి వచ్చిన అవ్వ మొదలు పట్నం ముఖం చూడని తాత వరకూ.. ఎందరో స్టార్లు.. పుట్టుకొచ్చేస్తున్న కాలమిది. కారెవరూ సెలబ్రిటీ స్టేటస్‌కు అనర్హం అన్నట్లు.. నేమ్.., ఫేమ్‌తో పాటు ఇన్‌కమ్ అంతా ఓకే. కానీ వీరి పాపులారిటీని సొమ్ము చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆయా వ్యాపారులే సోషల్ స్టార్స్‌కు చిక్కులు తెచ్చిపెడుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో
దాదాపు నాలుగు నెలల క్రితం ఔటర్ రింగ్‌రోడ్డుపై కరెన్సీ నోట్లను వెదజల్లి మనీ హంట్ నిర్వహించిన బాలానగర్ నివాసి యాంకర్ చందు అలియాస్ భాను చందర్, అదే విధంగా నోట్లను కూకట్‌పల్లిలో నడిరోడ్డు మీద విసిరేసిన కూరపాటి వంశీ అనే ఇన్‌ఫ్లూయన్సర్లను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నగర ఇన్‌ఫ్లూయన్సర్లలో లోపించిన చట్టపరమైన అవగాహనకు ఈ తరహా ఉదంతాలెన్నో అద్దం పడతాయి. ఇదొక్కటే కాదు గతంలో ఓ కంపెనీ అధిక వడ్డీ ఆశ చూపి నగరవ్యాప్తంగా 18వేల మందిని ముంచేసిన ఉదంతంలో ఆ కంపెనీని ప్రమోట్ చేసిన పాపం కూడా సోషల్ మీడియా స్టార్లకే చుట్టుకుంది. అడపాదడపా జరుగుతున్న ఇలాంటివి ఒకెత్తయితే తాజాగా గేమింగ్ యాప్స్‌కు సంబంధించి పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవుతుండడం సిటీ ఇన్‌ఫ్లూయన్సర్స్ కమ్యూనిటీని అప్రమత్తం చేస్తున్నాయి.
స్టార్లందు సూపర్‌స్టార్లు వేరయా..
సామాజిక మాధ్యమాలైన యూట్యూబ్, ఇన్‌స్టా, ఫేస్ బుక్, బ్లాగ్స్, వ్లాగ్స్.. వగైరాల ద్వారా వేలు, లక్షల సంఖ్యలో ఫాలోయర్లను పొందుతున్నవారినే ఇన్‌ఫ్లూయన్సర్లుగా పేర్కొంటున్నారు. అలాంటి వారు నగరంలోనూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరిలో 10 వేల నుంచి లక్ష మంది ఫాలోయర్ల లోపు ఉన్నవారిని మైక్రోఇన్‌ఫ్లూయన్సర్లుగా అలాగే లక్ష నుంచి 5లక్షల లోపు ఉన్నవారిని మిడ్–టైర్ ఇన్‌ఫ్లుయెన్సర్లు, 5లక్షల నుంచి 10లక్షల మంది ఉన్నవారిని మ్యాక్రో ఇన్‌ఫ్లూయన్సర్లు, 10లక్షలు ఆ పైన ఉంటే టాప్ క్రియేటర్స్‌గా పేర్కొంటారు. వీళ్లు మాత్రమే కాకుండా ప్రతి పోస్టుకూ లక్షల సంఖ్యలో స్పందన అందుకునే వారిని సెలబ్రిటీ ఇన్‌ఫ్లూయన్సర్లుగా పిలుస్తారు. సాధారణంగా సినిమా తారలు, క్రికెటర్లు.. ఈ విభాగంలోకి వస్తారు.
అనుసరణ.. అనుకరణే ఆదాయం
ఈ ఇన్‌ఫ్లూయన్సర్లకు ఆదాయం వారిని అనుసరించే ఫాలోయర్ల సంఖ్యను బట్టఆధారపడి ఉంటుంది. మైక్రో కిందకి వచ్చేవారికి పోస్టుకు రూ.5వేల నుంచి రూ.50వేల వరకూ, అలాగే లిమిడ్ టైర్ విభాగంలో ఉన్నవారికి రూ.50వేల నుంచి రూ.2లక్షలు, మ్యాక్రో స్టార్స్‌కి రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకూ, టాప్ క్రియేటర్స్‌కు రూ.5లక్షల నుంచి రూ.20లక్షల వరకూ క్లయింట్స్ చెల్లిస్తున్నారు. ఇక సెలబ్రిటీ ఇన్‌ఫ్లూయన్సర్లకు ఆదాయం కొన్ని సార్లు రూ. కోట్లలో కూడా ఉంటుంది. సాధారణంగా ఫాలోయర్ల సంఖ్యను బట్టే పేమెంట్ ఉంటుంది. అయితే లైక్స్, కామెంట్స్, షేర్స్ కూడా కొన్ని సార్లు కీలకపాత్ర పోషిస్తాయి. ఫ్యాషన్, బ్యూటీ, టెక్నాలజీ.. రంగాలకు సంబంధించిన ప్రమోషన్లకు అధిక మొత్తాలు లభిస్తాయి.
నగరంలో వేగంగా
ఇన్‌ఫ్లూయన్సర్ల సంఖ్యను పెంచుకోవడంలో నగరం దూసుకుపోతోంది. ప్రస్తుతం నగరంలో పేరొందిన ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయన్సర్లు 761 మంది వరకూ ఉన్నట్లు మోదాష్ అనే ఆన్‌లైన్ సంస్థ అంచనా వేసింది. నగరం ఇటీవల ఫ్యాషన్, ఫుడ్, ఫిట్‌నెస్, టెక్నాలజీ హబ్‌గా మారుతున్న నేపథ్యంలో ప్రముఖ బ్రాండ్స్ లోకల్ స్టార్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకోడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇవి నగరానికి చెందిన ఇన్‌ఫ్లూయన్సర్లకు కాసుల పంట పండిస్తున్నాయి. వీరిని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకోవాలంటే.. వారి ఇన్‌స్టా ఖాతాల్లోకి వెళ్లడం, తమ బ్రాండ్ గురించి క్లుప్తంగా చెప్పడం, ఎన్ని రోజులు, ఎలాంటి ప్రచారం కావాలి? తదితర వివరాలు మెసేజ్ చేస్తే.. సరిపోతుంది. ఆన్‌లైన్, చాట్స్ ద్వారానే కుదిరిపోయే డీల్స్ కోకొల్లలు. అందువల్లే చట్ట వ్యతిరేక, చట్ట పరిధిలో లేని గేమింగ్ యాప్స్ లాంటి వాటిని ప్రమోట్ చేస్తూ.. కేసుల్లో ఇరుక్కుంటున్నారు.
ఇదీ చదవండి:సునీతా విలియమ్స్ మీద సింపతీలేదు : యూఎస్ ఖగోళ శాస్త్రవేత్త
ఇన్‌ఫ్లూయన్లర్లు, జర జాగ్రత్త..
ఈ నేపథ్యంలో ఎడా పెడా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఇన్‌ఫ్లూయన్సర్లు ఒక్కసారిగా అప్రమత్తమై.. తాము ప్రమోట్ చేస్తున్న బ్రాండ్స్ గురించి మరోసారి సమీక్షించుకోవాలని అడ్వర్టయిజింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. అలాగే వాణిజ్య సంబంధిత ప్రచారాలకు సంబంధించి చట్ట పరమైన నియమ నిబంధనలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని న్యాయ కోవిదులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment