Be alert
-
మోసపూరిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి : బెనకా గోల్డ్ ఎండి భరత్
సాక్షి, హైదరాబాద్: బెనక గోల్డ్ పేరు చెప్పి కొంతమంది వ్యక్తులు తమ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తూ మోసగిస్తున్న ఘటనలు తమ దృష్టికి వస్తున్నాయని వినియోగదారులు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వెనక గోల్డ్ ఎండి భరత్ కుమార్ కోరారు. జూబ్లీహిల్స్ లోని బెనక గోల్డ్ కార్పొరేట్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థలో గతంలో శివసాగర్, జగదీష్, మాణిక్ దాస్, రవీంద్ర అనే నలుగురు పనిచేసేవారని, వారు పనిచేసే సమయంలో సంస్థతోపాటు వినియోగదారులను మోసగించడంతో వారిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని వారిపై కేసు కూడా నమోదయిందని తెలిపారు. ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత కూడా సదరు వ్యక్తులు సంస్థ బ్రాండ్ ని ఉపయోగించుకొని కొంతమంది వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నారని సంస్థకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని తెలిపారు. బెనక గోల్డ్ అనేది వినియోగదారులు తమ బంగారు ఆభరణాలను వివిధ సంస్థల్లో తాకట్టు పెడితే ఆ బంగారాన్ని విడిపించి వారికి నగదు చెల్లించే సంస్థ అని అన్నారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తమ సంస్థకు చెందిన 15కుపైగా బ్రాంచీలు ఉన్నాయని కావాలని కొంతమంది సంస్థ పేరును పాడు చేసేందుకు కుట్ర చేస్తున్నారని వారిపై త్వరలోనే నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఎవరైనా సంస్థ పేరు చెప్పి వినియోగదారులకు వద్దకు వస్తె అనుమానం కలిగితే సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 6366111999 కు కానీ, పోలీసులకు కానీ ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో సంస్థ లీగల్ అడ్వైజర్ మహమ్మద్ మోహిసిన్, రీజినల్ మేనేజర్ అనిల్ కుమార్, భాస్కర్ రెడ్డి, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
మీకు చేతులెత్తి దండం పెడుతున్న..
సాక్షి, హైదరాబాద్ : ‘విదేశాల నుంచి వచ్చిన వారికి చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్న. మీరు మా బిడ్డలే. మా వోళ్లే. మీరు అత్యుత్సాహంతో బయటకు పోయి కుటుంబాన్ని, సమాజాన్ని చెడగొడతారు. దయచేసి మీరు కొంచెం ప్రభుత్వం చెప్పినట్టు వినాలె. సమాజహితం కోరి సహకరించాలె. విదేశాల నుంచి వచ్చామని మీ అంతట మీరు స్వచ్ఛందంగా చెప్పాలి’ అని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ‘ఎక్కడో ఉంటే పట్టుకురావడం ఎందుకు? ఇవాళ ఒకాయన పారిపోతుంటే ఆలేరు కాడ పట్టుకొచ్చిండ్రు. ఇంకొకాయన ఢిల్లీ వెళ్తుంటే కాజీపేట కాడ పట్టుకొచ్చి గాంధీలో పడేసినం. అట్ల చేయకూడదు. నియంత్రణ పాటించాలి. ప్రపంచం ప్రపంచమే.. దేశం దేశమే పరేషానై ఉన్న ఈ సమయంలో ఈమాత్రం స్వీయ నియంత్రణ లేకపోతే కష్టమైతది. కుటుంబ సభ్యులైనా రిపోర్టు చేయాలి.. మీరు స్వచ్ఛందంగా స్థానిక వైద్యులు, పోలీసులు, తహశీల్ కార్యాలయంలో రిపోర్టు చేయండి. మిమ్మల్ని అరెస్టు చేయరు. మీకు ఏమైనా లక్షణాలుంటేనే ఆస్పత్రికి రిఫర్ చేస్తరు. మీకు కొద్దిగా స్టాంప్ వేసి మీ ఇంటికాడే ఉంచుతరు. ఉదయం, సాయంత్రం మీ పరిస్థితి కనుక్కుంటరు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. తద్వారా మీ క్షేమం, మీ కుటుంబ క్షేమం, రాష్ట్ర క్షేమం, దేశ క్షేమం, ప్రపంచ క్షేమం కూడా మానవజాతి క్షేమం దానిలో ఉంటది. విదేశాల నుంచి వచ్చిన వారు స్వయంగా రిపోర్టు చేయకుంటే వారి కుటుంబ సభ్యులు రిపోర్టు చేయాలి. ఇది మీ సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. ఎవరో చెప్పాలె.. బలవంతం పెట్టాలని కాకుండా మీ అంతట మీరే ఐసోలేషన్‌లో ఉండాలి. జ్వరం, జలుబు, దగ్గు, శ్వాసకోస ఇబ్బందులు వంటి లక్షణాలుంటే తక్షణమే రిపోర్టు చేయాలి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో మీ సహకారం చాలా అవసరం. ఈ వైరస్ ఇతర దేశాల నుంచి వస్తుంది కాబట్టి... మీరు ఇతర దేశాల నుంచి వస్తున్నారు కాబట్టి రిపోర్టు చేయాలి. మీరు రూ. 10 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు కేవలం రిపోర్టు చేస్తే ప్రభుత్వమే అంబులెన్స్ ఏర్పాటు చేస్తది, మందులిస్తది. చికిత్స ఖర్చులన్నీ పెట్టుకుంటది. గ్రామ సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు విజ్ఞప్తి. మీ గ్రామాలు/బస్తీల్లో విదేశాల నుంచి వచ్చిన వారుంటే సమాచారం ఇవ్వండి. 700 అనుమానిత కేసులు... మార్చి 1 తర్వాత హైదరాబాద్ ఎయిర్‌పోర్టుతోపాటు ఇతర విమానాశ్రయాల ద్వారా 20 వేల మంది మన రాష్ట్రంలోకి వచ్చిన్రు. ఇప్పటివరకు 11 వేల మందిని గుర్తించి అధీనంలోకి తీసుకున్నం. ఇంకా కొందరిని గుర్తించాల్సి ఉంది. వాళ్లను 14 రోజులు మన నియంత్రణలో పెట్టుకొని వదిలేస్తాం. వాళ్లపై నిఘా కోసం 5,274 నిఘా బృందాలు/పర్యవేక్షక బృందాలు ఏర్పాటు చేసినం. 700 పైచిలుకు కోవిడ్–19 అనుమానితులుంటే వారిని తెచ్చి పరీక్షలు చేస్తున్నం. రాష్ట్రంలో ఇప్పటివరకు 21 మందికి పాజిటివ్ వచ్చింది. అంతర్రాష్ట సరిహద్దుల్లో 52 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రాష్ట్రంలోకి వచ్చే వాళ్ల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. సరిహద్దుల్లో 78 జాయింట్ బృందాలు పనిచేస్తున్నయి’. ఐదుగురితో నిపుణుల కమిటీ.. వైద్యారోగ్య శాఖ, సీఎంవో, డీజీపీ కార్యాలయాల నేతృత్వంలో ఐదుగురితో నిపుణుల కమిటీ ఏర్పాటు చేశాం. అంతర్జాతీయ, జాతీయ పరిస్థితులు, మన దగ్గర ఉత్పన్నమవుతున్న పరిస్థితులు, మనం కరెక్ట్ లై¯Œ లో ఉన్నమా లేదా? మనం తీసుకున్న చర్యలు సరిపోతున్నాయా లేవా? ఇంకేమైనా చేయాల్సి ఉందా? అని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఈ టీం సూచనలు ఇస్తుంటుంది. -
సూర్యలంకలో ‘బీ అలర్ట్’
గుంటూరు: సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ ఎస్పీ కేజీవీ సరిత ఆధ్వర్యంలో నూతనంగా రూపొందుతున్న ‘బీఅలర్ట్’ డాక్యుమెంటరీ షూటింగ్ మంగళవారం సూర్యలంక బీచ్‌లో దర్శకుడు, సీఐడీ ఎస్ఐ కొట్టె శ్రీహరి పర్యవేక్షణలో జరిగింది. యువత బీచ్‌లకు వెళ్ళి వ్యసనాలకు బానిసలుగా మారడం, పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం పై చిత్రీకరణ జరిగింది. సన్ని వేశాల్లో సీఐడీ ఎస్ఐ రామకోటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, నటీనటులు జెస్సీ హారిక, సాయినా«థ్ తదితరులు పాల్గొన్నారు. -
అప్రమత్తతతోనే చోరీలకు అడ్డుకట్ట
పటాన్చెరు టౌన్: వేసవి కాలం అంటే కేవలం ఉక్కపోత.. వడదెబ్బే కాదు.. దొంగలు.. దొంగతనాల బాధలూ అధికంగానే ఉంటాయి. వేసవిలో చాలా వరకు ప్రజలు ఉక్కపోత తట్టుకోలేక రాత్రి సమయంలో హాయిగా ఆరు బయట నిద్రపోతుంటే దొంగలు ఇంట్లోకి చొరపడి వారి పని వారు కానిచ్చేస్తారు. బీరువాల్లోని బంగారం, నగదు చోరీ చేసి పారిపోతుంటారు. ఇక వేసవిలో పిల్లల స్కూళ్లకు సెలువులు కావడంతో వివాహాలు, విహారయాత్రలు, తీర్థ యాత్రలు, బంధువుల ఇంటికంటూ చాలా మంది ఇంటికి తాళం వేసి ఊళ్లకు వెళుతుంటారు. దీన్ని అదనుగా చేసుకొని దొంగలు హస్తలాఘవం ప్రదర్శిస్తారు. ఇలాంటి సమయంలో పోలీసులు సైతం దొంగలను గుర్తించలేకపోయే అవకాశం ఉంది. అందుకే ప్రజలు చైతన్యవంతులైతే చోరీలకు అడ్డుకట్ట వేయడం తేలికవుతుందంటున్నారు డీఎస్పీ సీతారాం.. దొంగతనాలకు వేసవి అనువుగా ఉంటుందని చెప్తున్నారాయన. దొంగలు ఎంచుకున్న ఇంటి పరిసరాలను రెండు రోజులు పరిశీలిస్తారని, అంటే.. చెత్త కాగితాలు, వాకిట్లో శుభ్రతను భిక్షగాళ్లుగా వచ్చి చుట్టు పక్కల పరిశీలించిన తర్వాత ప్రణాళిక ప్రకారం సులువుగా పని ముగించుకుంటారని చెప్తున్న డీఎస్పీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చోరీలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు æ చోరీలకు వచ్చే దొంగలు ఒక రోజు ముందే పరిసర ప్రాంతాలను పరిశీలిస్తారు. అందువల్ల అనుమానాస్పదంగా కనిపించిన వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలి. æ ఇంటి కిటికీలను మూసివేయాలి. వాటికి ఉన్న బోల్టులు, బెడాలు సక్రమంగా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు చూసుకోవాలి. æ దుస్తుల్లో డబ్బులు పెట్టి కిటికీలకు, తలుపులకు తగిలించవద్దు. æ ఆరుబయట, డాబాలపై నిద్రించే వారు అప్రమత్తంగా ఉండాలి. ఇంటికి ఒకటి లేదా రెండు తాళాలు వేసుకోవాలి. æ బంగారు ఆభరణాలు ఒంటిపై వేసుకొని ఆరుబయట నిద్రించవద్దు. ఇంట్లో పడుకున్నా ఆభరణాలు ఒంటిపై వేసుకున్నవారు కిటికీలు తెరిచి ఉన్న వైపు పడుకోకూడదు. æ దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నంబర్‌ను సంబంధిత పోలీస్ స్టేషన్లో తెలియజేయాలి. æ రాత్రి సమయంలో కొత్తవారు ఎవరైనా వస్తే వారి వివరాలు సేకరించి పెట్టుకోవడం మంచిది. æ అనుమానితులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారమివ్వాలి. æ బంగారం, నగదు ఇంట్లో ఉంచేకన్నా బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవడం అన్ని విధాలా ఉత్తమం. -
డిజిటల్ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలి
వరంగల్ రూరల్: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా మార్కెట్లో డిజిటల్(నగదు రహిత) లావాదేవీలు పెరుగుతున్నాయి.. మోసాల బారిన పడకుండా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి భూక్యా హరిసింగ్ సూచించారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సివిల్ సప్లై అధికారి ఎస్డబ్ల్యూ.పీటర్ అధ్యక్షత ఏర్పాటు చేసిన వినియోగదారుల సదస్సులో ఆయన మాట్లాడారు. డిజిటల్ మార్కెట్ విస్తృతమంతున్న తరుణంలో అదే స్థాయిలో వినియోగదారుల సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు. డబ్బులు చెల్లించి వస్తువులు కొనుగోలు చేసే సమయంలో, సేవలు పొందేప్పుడు స్పష్టమైన అవగాహన కలిగిఉండాలన్నారు. జిల్లా అధికార యంత్రాంగం, వినియోగదారుల సంఘాలు సమన్వయంతో పనిచేసి సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పారు. సివిల్ సప్లై అధికారి పీటర్ మాట్లాడుతూ జిల్లాలో వీలైనంత త్వరగా ఆహార సలహా సంఘం, ధరల పర్యవేక్షణ కమిటీలను పునర్వ్యవస్థీకరించి వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. సమావేశ సమన్వయకర్తగా ఏఎస్ఓ పుల్లయ్య వ్యవహరించగా జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్, సమన్వయ సమితి అధ్యక్షుడు బి.శ్రావన్‌కుమార్ మాట్లాడారు. లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ రాజేశ్వర్‌రావు, సివిల్ సప్లై, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్లు వెంకటేశ్వర్లు, హరిప్రసాద్, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ జ్యోతిర్మయి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రమేష్, ప్రభాకర్, సదానందం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆహార భద్రత విభాగం, తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. -
పాతబస్తీలో దొంగ బాబాల హల్చల్
-
అదిగదిగో.. జిల్లాకేంద్రం!
♦ ఈసాకుతో భూములు, ప్లాట్ల ధరలకు రెక్కలు ♦ ఇష్టారాజ్యంగా పెంచుతున్న దళారులు ♦ శంషాబాద్‌లో అడ్డగోలు దందా ♦ వినియోగదారులూ.. పారాహుషార్ శంషాబాద్: శంషాబాద్‌లో దళారుల దందా మూడు ప్లాట్లు.. ఆరు బిట్లు.. అనే విధంగా కొనసాగుతోంది. జిల్లా కేంద్రం ప్రకటనతో రెక్కలు విప్పుకున్న రియల్ ఎస్టేట్ దళారులు ఖాళీగా ఉన్న భూములపై వాలిపోతున్నారు. అడ్డగోలుగా ధరలు పెంచేస్తూ నిజమైన కొనుగోలుదారులను అవస్థల పాలుచేస్తున్నారు. శంషాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించిన నాటి నుంచి రియల్ వ్యాపారం మరోసారి జోరందుకుంది. దీనిని అదనుగా చేసుకున్న మధ్యవర్తుల దందా కూడా పెరిగిపోయింది. శంషాబాద్లోనే శాశ్వత జిల్లా కేంద్రం ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వకముందే అదిగో జిల్లా కేంద్రం.. ఇదిగో జిల్లా కేంద్రం.. అంటూ భూముల ధరలను అడ్డగోలుగా పెంచేస్తున్నారు. శంషాబాద్ పంచాయతీ పరిధిలోని హుడా కాలనీలో సర్వే నంబరు 726 నుంచి 730 వరకు ఉన్న హెచ్ఎండీఏ స్థలాల్లో ప్రభుత్వం శాశ్వత జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ స్థానికంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఔటర్ రింగురోడ్డు, నలభైనాలుగో నంబరు జాతీయ రహదారికి ఇది అత్యంత చేరువులో ఉండడంతో ఇక్కడే జిల్లా కేంద్రం ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని పట్టణవాసులు కోరుతున్నారు. అయితే సర్కారు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఈ భూములపై పరిశీలన కూడా చేపట్టలేదు. ప్రజా సంఘాలు, పార్టీల నుంచి జిల్లా కేంద్రానికి డిమాండ్‌గా ఉన్న ఈ భూములకు సమీపంలోనే ఉన్న హుడా కాలనీ, ఎయిర్‌పోర్టు కాలనీలో పదిహేనురోజుల కిందట ఉన్న ధరలను మధ్యవర్తులు అడ్డగోలుగా పెంచేశారు. నెలరోజుల కిందట రూ. 2-3 వేలకు గజం ఉన్న ధరలు ఇప్పుడు ఏకంగా రూ. 6-8 వేల వరకు చేరాయి. నిన్నమొన్నటి వరకు ఏమాత్రం డిమాండ్ లేని ఈ భూముల్లో మధ్యవర్తులు పెద్దఎత్తున తచ్చాడుతున్నారు. వీరు కృత్రిమంగా పెంచుతున్న ధరలతో సొంతిల్లు కోసం స్థలం కొనుగోలు చేయాలనుకునేవారికి మాత్రం ఇక్కట్లు తప్పడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్రమత్తతే శ్రీరామరక్ష.. దళారులు అడ్డగోలుగా విక్రయిస్తున్నా.. భూములు, ప్లాట్లు కొనుగోలు చేసే వినిచయోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. పట్టణంలోని హుడా కాలనీ సమీపంలో ఉన్న కొన్ని భూముల్లో ఓవ్యక్తి పెద్దఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈవిషయమై ఇప్పటికే దళారుల మధ్య తీవ్రంగా చర్చజరుగుతోంది. ఇవే కాకుండా ఔటర్ రింగురోడ్డు సమీపంలో ఓ బడావ్యాపారి స్థానిక రియల్ వ్యాపారులకు ఒప్పదం చేసిన వెంచర్లో కూడా కొన్ని ప్లాట్లను ఇద్దరు, ముగ్గురికి విక్రయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒప్పందం చేసుకున్న వారితో పాత యజమానికి కూడా తిరిగి ప్లాట్లు విక్రయిస్తుండడడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ప్లాట్లు కొనుగోలు చేసే వారు ముందస్తుగా పూర్తి సమాచారంతో అప్రమత్తం కాకపోతే దళారుల చేతిలో భారీగా మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని సంబంధిత రియల్ఎస్టేట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం శాశ్వత జిల్లా కేంద్రం ఏర్పాటు స్థలంపై ఏమాత్రం స్పష్టత నివ్వకముందు దళారులు చేస్తున్న ప్రచారాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. -
'మిస్డ్ కాల్ వస్తే తిరిగి చేయొద్దు..'
రనితా డిసౌజా అనే ఆవిడ..గాఢ నిద్రలో ఉండగా సరిగ్గా అర్థరాత్రి 1.30కు ఓ ఫోన్‌కు కాల్ వచ్చింది. ఆమె సెల్ ఫోన్ ఎత్తాక అవతలి వ్యక్తి మాట్లాడకుండా కట్ చేశారు. ఆ ఫోన్ కాల్ కోడ్ ప్లస్ 216గా ఉంది. దీంతో అది ముఖ్యమైన ఫోన్ కాల్ అనుకొని రనితా డిసౌజా తిరిగి ఆ నెంబర్ కు కాల్ చేయగా అవతల ఫోన్ ఎత్తారు కానీ ఏం మాట్లాడలేదు.. దీంతో ఆమె ఫోన్ పెట్టేశారు. తీరా చూస్తే ఆమె సెల్ ఫోన్ లో బ్యాలెన్స్ మాత్రం ఒక్కసారిగా 60 రూపాయలు కట్ అయింది. దాంతో ఖంగుతిన్నరనితా డిసౌజా కస్టమర్ కేర్ కు కాల్ చేసి బ్యాలెన్స్ కట్ అయినట్లు ఫిర్యాదు చేశారు. అయితే ఇది రనితా డిసౌజా ఒక్కరి సమస్యే కాదు.. ఇలాంటి సమస్యలు ఈ మధ్య చాలా ఎక్కువయ్యాయి. చాలామందికి తెలియక ఇలాంటి నెంబర్లను చూసి పొరపడి తిరిగి ఫోన్లు చేస్తున్నారు. దీనిపై ఎయిర్టెల్ సంస్థకు చెందిన శరత్ తేజస్వీ అనే వ్యక్తి స్పందిస్తూ ఇప్పటికే తాము తమ కస్టమర్లకు ఇలాంటి నెంబర్ల నుంచి మిస్డ్ కాల్ వస్తే తిరిగి చేయొద్దని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. -
బీ అలర్ట్..
బృందాలను ఏర్పాటు చేయండి అవసరమైన మెటీరియల్‌ను సిద్ధం చేయండి తుపాను నేపథ్యంలో విద్యుత్ అధికారుల్ని అప్రమత్తం చేసిన సర్కారు డిస్కంలకు ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ ఆదేశాలు సాక్షి, విజయవాడ బ్యూరో: హుద్‌హుద్ తుపాను కారణంగా ఉత్తరాంధ్రలో విధ్వంసమైన విద్యుత్ వ్యవస్థ పూర్తి స్థాయిలో పునరుద్ధరణ కాక ముందే మరో తుపాను విరుచుకు పడేందుకు సిద్ధంగా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తుపానుగా మారి విశాఖకు ఆగ్నేయ దిశగా 560 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో మరోసారి విద్యుత్ సరఫరాకు నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని అంచనాకు వచ్చిన ప్రభుత్వం గురువారం జిల్లాస్థాయి అధికారులను అప్రమత్తం చేసింది. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ ఈ మేరకు ఏపీఎస్పీడీసీఎల్, ఈపీఎస్‌పీడీసీఎల్ చీఫ్ మేనేజింగ్ డెరైక్టర్లు, డిస్కంల డెరైక్టర్లు, అన్ని జిల్లాల పర్యవేక్షక ఇంజినీర్లకు ఫ్యాక్స్ మెసేజ్ పంపారు. హుద్‌హుద్ నేర్పిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ‘రాగల 24 గంటల్లో తుపాను ప్రభావంతో తీరంలోని జిల్లాల్లో గాలుల తీవ్రత పెరిగే అవకాశం వుంది. జిల్లా స్థాయి అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు తీర ప్రాంత గ్రామాల్లో ఉంటూ గాలుల తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ విద్యుత్ సరఫరాను పర్యవేక్షించాలి’ అని ఆదేశించారు. హుద్‌హుద్ సమయంలో ముందస్తుగా విద్యుత్ సరఫరా నిలిపి వేయడంవల్ల ప్రాణనష్టాన్ని నివారించగలిగామన్న విషయాన్ని గుర్తుంచుకుని వచ్చే తుపానును కూడా సమర్థంగా ఎదుర్కోవాలని పేర్కొన్నారు. గురువారం నుంచే విద్యుత్ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలనీ, అవసరమైన విద్యుత్ సామగ్రిని ముందుగానే తీర ప్రాంత గ్రామాలకు తరలించాలని సూచించారు. ఈ సమాచారాన్ని అందుకున్న ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల విద్యుత్ అధికారులు ప్రతి 20 మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసే పనుల్లో పడ్డారు. సముద్ర తీర మండలాల్లో పనిచేసే ఏఈల నుంచి విద్యుత్ సబ్స్టేషన్ల సమాచారాన్ని తెప్పించుకుని ఎక్కడెక్కడ పోల్స్ పడే అవకాశాలున్నాయో తెల్సుకుంటున్నారు. శుక్రవారం ఉదయానికి తుపాను తీరం దాటే దిశ స్పష్టంగా తెలిసే వీలున్నందున ఆ తరువాత మెటీరియల్‌ను చేరవేసే పనులు చేపట్టాలని నిర్ణయించారు. కాగా హుద్‌హుద్ తుపాను వల్ల దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను చక్కదిద్దే పనుల్లో తలమునకలవుతున్న ఉత్తరాంధ్ర విద్యుత్ ఉద్యోగులకు తాజా తుపాను కబురు ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటివరకూ ఎడతెరిపి లేని పునరుద్ధరణ పనులతో నీరసించిన ఉద్యోగులను మళ్లీ అప్రమత్తం చేసుకుని బృందాలుగా ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుందని అక్కడి సర్కిల్ అధికారులు అంటున్నారు.