సమావేశంలో మాట్లాడుతోన్న డీఆర్‌ఓ భూక్యా హరిసింగ్
వరంగల్ రూరల్: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా మార్కెట్‌లో డిజిటల్(నగదు రహిత) లావాదేవీలు పెరుగుతున్నాయి.. మోసాల బారిన పడకుండా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి భూక్యా హరిసింగ్ సూచించారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో సివిల్ సప్‌లై అధికారి ఎస్‌డబ్ల్యూ.పీటర్ అధ్యక్షత ఏర్పాటు చేసిన వినియోగదారుల సదస్సులో ఆయన మాట్లాడారు. డిజిటల్ మార్కెట్ విస్తృతమంతున్న తరుణంలో అదే స్థాయిలో వినియోగదారుల సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు.
డబ్బులు చెల్లించి వస్తువులు కొనుగోలు చేసే సమయంలో, సేవలు పొందేప్పుడు స్పష్టమైన అవగాహన కలిగిఉండాలన్నారు. జిల్లా అధికార యంత్రాంగం, వినియోగదారుల సంఘాలు సమన్వయంతో పనిచేసి సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పారు. సివిల్ సప్‌లై అధికారి పీటర్ మాట్లాడుతూ జిల్లాలో వీలైనంత త్వరగా ఆహార సలహా సంఘం, ధరల పర్యవేక్షణ కమిటీలను పునర్వ్యవస్థీకరించి వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.
సమావేశ సమన్వయకర్తగా ఏఎస్‌ఓ పుల్లయ్య వ్యవహరించగా జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్, సమన్వయ సమితి అధ్యక్షుడు బి.శ్రావన్‌కుమార్ మాట్లాడారు. లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ రాజేశ్వర్‌రావు, సివిల్ సప్‌లై, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్లు వెంకటేశ్వర్లు, హరిప్రసాద్, గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ జ్యోతిర్మయి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రమేష్, ప్రభాకర్, సదానందం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆహార భద్రత విభాగం, తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment