సాక్షి, న్యూఢిల్లీ: మొబైల్ వాలెట్ కంపెనీ మొబీక్విక్ భారీ నష్టాన్ని మూటగట్టుకుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌లో చోటు చేసుకున్న అక్రమాల కారణంగా మోబిక్విక్ గత మూడున్నర నెలల కాలంలో మొత్తం రు. 19.61 కోట్లు నష్టపోయింది. గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా అక్రమాలు చోటుచేసుకున్నాయని కంపెనీ భావిస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై గుర్‌గావ్‌లో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
టెక్నికల్ తప్పిదాన్ని అవకాశంగా తీసుకొని కొంతమంది వ్యక్తులు తమ డబ్బులను వేర్వేరు ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారని మొబీక్విక్ న్యాయవాది లోకేశ్ రాజపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తమ ఖాతాదారుల విలువైన సమాచారం, డబ్బు సురక్షితంగా ఉందని మొబీక్విక్ పేర్కొంది. రికార్డులను, ఖాతాలను స్కాన్ చేసిన తర్వాత భారీ మోసం జరగిందని కనుగొన్నప్పటికీ ..డబ్బు ఎలా పోయిందో మాత్రం గుర్తించలేకపోయింది.
రూ. 19 కోట్ల మేరకు మోసం చేశారన్న ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని గుర్‌గావ్ సైబర్ క్రైమ్ సెల్ చైర్మన్ ఆనంద్ యాదవ్ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందనీ, అంతర్గత సిబ్బంది ప్రమేయంపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.
కాగా మొబైల్ రీచార్జ్ తోపాటు, బిల్ చెల్లింపులు, షాపింగ్, వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ లాంటి వాటికోసం మొబీక్విక్ వాలెట్ ఉపయోగించవచ్చు.దేశం ఒకవైపు డిజిటల్ ఎకానమీవైపు పరుగులు పెడుతోంటే.. ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ లావాదేవీ కంపెనీల డేటా హ్యాకింగ్ వినియోగదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.