
అజయ్ జైన్
బృందాలను ఏర్పాటు చేయండి అవసరమైన మెటీరియల్‌ను సిద్ధం చేయండి
తుపాను నేపథ్యంలో విద్యుత్ అధికారుల్ని అప్రమత్తం చేసిన సర్కారు
డిస్కంలకు ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ ఆదేశాలు
సాక్షి, విజయవాడ బ్యూరో: హుద్‌హుద్ తుపాను కారణంగా ఉత్తరాంధ్రలో విధ్వంసమైన విద్యుత్ వ్యవస్థ పూర్తి స్థాయిలో పునరుద్ధరణ కాక ముందే మరో తుపాను విరుచుకు పడేందుకు సిద్ధంగా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తుపానుగా మారి విశాఖకు ఆగ్నేయ దిశగా 560 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో మరోసారి విద్యుత్ సరఫరాకు నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని అంచనాకు వచ్చిన ప్రభుత్వం గురువారం జిల్లాస్థాయి అధికారులను అప్రమత్తం చేసింది. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ ఈ మేరకు ఏపీఎస్‌పీడీసీఎల్, ఈపీఎస్‌పీడీసీఎల్ చీఫ్ మేనేజింగ్ డెరైక్టర్లు, డిస్కంల డెరైక్టర్లు, అన్ని జిల్లాల పర్యవేక్షక ఇంజినీర్లకు ఫ్యాక్స్ మెసేజ్ పంపారు. హుద్‌హుద్ నేర్పిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ‘రాగల 24 గంటల్లో తుపాను ప్రభావంతో తీరంలోని జిల్లాల్లో గాలుల తీవ్రత పెరిగే అవకాశం వుంది.
జిల్లా స్థాయి అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు తీర ప్రాంత గ్రామాల్లో ఉంటూ గాలుల తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ విద్యుత్ సరఫరాను పర్యవేక్షించాలి’ అని ఆదేశించారు. హుద్‌హుద్ సమయంలో ముందస్తుగా విద్యుత్ సరఫరా నిలిపి వేయడంవల్ల ప్రాణనష్టాన్ని నివారించగలిగామన్న విషయాన్ని గుర్తుంచుకుని వచ్చే తుపానును కూడా సమర్థంగా ఎదుర్కోవాలని పేర్కొన్నారు. గురువారం నుంచే విద్యుత్ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలనీ, అవసరమైన విద్యుత్ సామగ్రిని ముందుగానే తీర ప్రాంత గ్రామాలకు తరలించాలని సూచించారు. ఈ సమాచారాన్ని అందుకున్న ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల విద్యుత్ అధికారులు ప్రతి 20 మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసే పనుల్లో పడ్డారు. సముద్ర తీర మండలాల్లో పనిచేసే ఏఈల నుంచి విద్యుత్ సబ్‌స్టేషన్ల సమాచారాన్ని తెప్పించుకుని ఎక్కడెక్కడ పోల్స్ పడే అవకాశాలున్నాయో తెల్సుకుంటున్నారు. శుక్రవారం ఉదయానికి తుపాను తీరం దాటే దిశ స్పష్టంగా తెలిసే వీలున్నందున ఆ తరువాత మెటీరియల్‌ను చేరవేసే పనులు చేపట్టాలని నిర్ణయించారు.
కాగా హుద్‌హుద్ తుపాను వల్ల దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను చక్కదిద్దే పనుల్లో తలమునకలవుతున్న ఉత్తరాంధ్ర విద్యుత్ ఉద్యోగులకు తాజా తుపాను కబురు ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటివరకూ ఎడతెరిపి లేని పునరుద్ధరణ పనులతో నీరసించిన ఉద్యోగులను మళ్లీ అప్రమత్తం చేసుకుని బృందాలుగా ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుందని అక్కడి సర్కిల్ అధికారులు అంటున్నారు.