అంతా సెట్ చేశారు | everything is ready for eamcet exam | Sakshi
Sakshi News home page

అంతా సెట్ చేశారు

Published Fri, May 8 2015 4:56 AM | Last Updated on Thu, Mar 21 2019 8:22 PM

అంతా సెట్ చేశారు - Sakshi

అంతా సెట్ చేశారు

నేటి ఎంసెట్ కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాలు
4,300 ప్రయివేట్ వాహనాలు సిద్ధం
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
టెట్ వరకు కొనసాగింపు
ఇబ్బందులు ఎదురైతే డయల్ 100
కలెక్టర్, సీపీ వెల్లడి

సాక్షి, విజయవాడ : జిల్లాలో శుక్రవారం జరిగే ఎంసెట్‌కు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వీలైనన్ని ఆర్టీసీ సర్వీసులతో పాటు ప్రయివేటు వాహనాలు నడపనున్నామని వివరించారు. ఆ తర్వాత జరిగే టెట్‌కు కూడా ఇవే ఏర్పాట్లు కొనసాగిస్తామని ఆయన వివరించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం కలెక్టర్ సీపీ వెంకటేశ్వరరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో గురువారం 36 శాతం ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించాయని, శుక్రవారం ఎంసెట్ నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ ఆర్టీసీ బస్సులు, అన్ని ప్రయివేటు విద్యాసంస్థల బస్సులు నడుపుతామని చెప్పారు.
 
 అన్ని మండలాల నుంచీ..
 జిల్లాలో 1,400 బస్సులకు గానూ గురువారం 235 ఆర్టీసీ అద్దె బస్సులు, 265 ఆర్టీసీ బస్సులు నడిచాయని వివరించారు. జిల్లాలో 45వేల మంది ఎంసెట్ రాయనున్నారని, విజయవాడ, మచిలీపట్నంలో 81 సెంటర్లలో పరీక్ష జరుగుతుందని వివరించారు. 4,300 వరకు ప్రయివేట్ విద్యాసంస్థల వాహనాలు ఉన్నాయని రవాణాశాఖ ఇప్పటికే అన్ని యాజమాన్యాలను సంప్రదించిందని, ప్రయివేటు బస్సులు కూడా వినియోగించి విజయవాడ, మచిలీపట్నంకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి రవాణా ఏర్పాటు చేస్తామన్నారు.
 
 ట్రాఫిక్ సమస్యకు చెక్
 సీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులను విధుల్లో ఉంచి ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థుల రవాణా సౌకర్యం కోసం కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ వాహనాలను వినియోగిస్తామని చెప్పారు. దీనికోసం డయల్ 100కు ఫోన్‌చేస్తే ద్విచక్ర వాహనం నుంచి పోలీస్ వ్యాన్ వరకు ఏదైనా పంపుతామని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఆర్‌ఎం సుదేశ్‌కుమార్, రవాణా శాఖ ఇన్‌చార్జి డెప్యూటీ కమిషనర్ ఆర్.పురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
 
 ఒక నిమిషం ఆలస్యమైనా నోఎంట్రీ
 పెనమలూరు : విజయవాడ రీజియన్‌లో జరిగే ఎంసెట్‌కు మొత్తం 40,899 మంది హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు జరిగే ఇంజినీరింగ్ పరీక్షకు 23,069, మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగే మెడికల్ పరీక్షకు 17,630 మంది హాజరవుతారు. ఇందుకు నగర పరిధిలో మొత్తం 81 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. పరీక్ష కేంద్రానికి గంట ముందు రావాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. అభ్యర్థులు హాల్ టికెట్, డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తు, ఎస్సీ, ఎస్టీలైతే కుల ధ్రువీకరణ అటెస్టేషన్ కాపీని విధిగా తీసుకురావాలి. పరీక్ష హాల్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. మొత్తం 1,795 మంది అధికారులను పరీక్ష నిర్వహణకు నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement