![Eamcet exam postponed in Telangana - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/14/eamcet.jpg.webp?itok=hgrmajTc)
సాక్షి, హైదరాబాద్: తీవ్ర తర్జనభర్జనలు, విద్యార్థి సంఘాల నిరసనల నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో జరగాల్సిన ఎంసెట్‌ను వాయిదా వేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ఈమేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. అయితే 14, 15 తేదీల్లో జరగాల్సిన వ్యవసాయ, మెడికల్ విభాగానికి చెందిన ఎంసెట్ మాత్రమే వాయిదా వేశామని, 18 నుంచి 20వరకూ జరిగే ఇంజనీరింగ్ విభాగం ఎంసెట్ యథావిధిగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
వాయిదా పడ్డ ఎంసెట్ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని తెలి పారు. రాబోయే మూడు రోజులూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఐటీ కన్సల్టెన్సీ సంస్థ నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకున్న మండలి వర్గాలు కూడా వర్షాలున్నా ఎంసెట్‌ను నిర్వహించి తీరుతామని తొలుత స్పష్టం చేశాయి. విద్యార్థి సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో ఎంసెట్‌ను వాయిదా వేయడానికి ప్రభుత్వం అంగీకరించక తప్పలేదు.
16 వరకు ఓయూ పరీక్షలు వాయిదా: ఓయూ పరిధిలో ఈనెల 16 వరకు అన్ని పరీక్షలను వాయిదా వేసిన్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ బుధవారం తెలిపారు. ప్రధాన కార్యాలయాలు యథావిధిగా కొనసాగుతాయని సపోర్టింగ్ స్టాఫ్ విధులకు హాజరుకావాలన్నారు.
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ పరీక్షలు వాయిదా
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఈనెల 14, 15 తేదీల్లో జరగాల్సిన పీజీ రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పరాంకుశం వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. వాయిదా పడ్డ పరీక్షలను నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment