సాక్షి ప్రతినిధి, కాకినాడ: అభిమాన నేత పట్టాభిషేకం కోసం జిల్లా దారులన్నీ విజయవాడ వైపే దారి తీస్తున్నాయి. జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా.. ఆ కార్యక్రమాన్ని కనులారా వీక్షించేందుకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీ శ్రేణులు తరలి వెళ్తున్నాయి. ఆయనను సీఎంగా చూడాలని గత ఎనిమిదేళ్లుగా అహర్నిశలూ కష్టపడిన పార్టీ కార్యకర్తలు.. ఆ సమయం రావడంతో విజయవాడకు భారీగా పయనమవుతున్నారు. ప్రమాణ స్వీకారాన్ని దగ్గరుండి చూడాలని ఆత్రుత కనబరుస్తున్నారు. ఆమేరకు ఏర్పాట్లు చేసుకున్నారు.
స్వల్ప తేడాతో ఓడినా.. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో..
2014 ఎన్నికల్లోనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తప్పనిసరిగా సీఎం అవుతారని అందరూ భావించారు. రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని ఎంతో ఆశించారు. కానీ, ఆ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో వైఎస్సార్ సీపీ అధికారాన్ని దూరమైంది. వైఎస్ జగన్ గ్యారంటీగా సీఎం అవుతారని భావించిన పార్టీ శ్రేణులకు అప్పట్లో నిరాశ ఎదురైంది. అయితే, కార్యకర్తలు కుంగిపోకుండా.. ఆయన ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో నాటి నుంచి తాజా ఎన్నికల వరకూ కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా కష్టపడ్డారు. చెప్పాలంటే అలుపెరగని పోరాటం చేశారు. పార్టీని నిర్వీర్యం చేసేందుకు అధికార తెలుగుదేశం పార్టీ ఎన్ని ఎత్తులు వేసినా, కుట్రలు చేసినా వెరవకుండా ముందుకు సాగారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ టిక్కెట్టుపై గెలిచిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని ప్రలోభాలతో టీడీపీలోకి తీసుకున్నారు. తద్వారా వైఎస్సార్ సీపీని బలహీనపరచేందుకు ఎంతో ప్రయత్నించారు. అయినప్పటికీ కార్యకర్తల్లో సంకల్పం సడలలేదు.
వేధింపులకు ఎదురొడ్డి..
గత ఐదేళ్ల కాలంలో వైఎస్సార్ సీపీ శ్రేణులను, అభిమానులను టీడీపీ నాయకులు ఎన్నో వేధింపులకు గురి చేశారు. అక్రమ కేసులు బనాయించి భయపెట్టే ప్రయత్నం చేశారు. సంక్షేమ పథకాలేవీ అందకుండా చేశారు. దాడులకు దిగి భయభ్రాంతులకు గురి చేశారు. వైఎస్సార్ సీపీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులను కూడా అవమానపరిచారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు ఒక్క పైసా నిధులు ఇవ్వకుండా వివక్ష చూపించారు. ప్రత్యేక రోజుల్లో జరిగే కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వలేదు. కనీసం టీడీపీ కార్యకర్తకు ఇచ్చిన గౌరవాన్ని కూడా ఎమ్మెల్యేలకు, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు ఇవ్వలేదు. ఒకవిధంగా చెప్పాలంటే టీడీపీ నేతల కనుసన్నల్లో అధికారులు సహితం వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులను చిన్నచూపు చూశారు. నానా అవమానాలకు గురవుతున్నా.. వీటన్నింటికీ ఎదురొడ్డి మరీ వైఎస్సార్ సీపీ నాయకులు ముందుకు సాగారు.
వేధింపులు, కేసులు, ఇతర ఇబ్బందులే కాకుండా వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఆదాయ వనరులను కూడా ‘పచ్చ’ పాలకులు దెబ్బ తీశారు. వ్యాపార వ్యవహారాల్లో ఇబ్బందులు పెట్టారు. కక్ష సాధింపు చర్యలు చేపట్టి నష్టపరిచే కార్యక్రమాలు చేపట్టారు. అన్ని రకాలుగా వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు, కార్యకర్తలు, నాయకులను హింసించారు. మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టాలో అంతా చేశారు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ లేకుండా చేయాలని, తమకు ఎదురే లేకుండా ఉండాలని అన్ని రకాల కుయుక్తులు, కుట్రలు ప్రదర్శించారు. కానీ మొక్కవోని ధైర్యంతో కార్యకర్తలు, నాయకులు ఎదురొడ్డి నిలిచారు.
పీడిత ప్రజలకు అండగా..
2014లో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా తప్పనిసరిగా వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకురావాలని అహోరాత్రాలూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్, ఆ పార్టీ నాయకులు ప్రజల మధ్యనే ఉన్నారు. వారి కష్టాల్లో అండగా నిలిచారు. వారి సమస్యలపై పోరాడారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచారు. గత ఐదేళ్లుగా జగన్‌మోహన్‌రెడ్డి పడిన కష్టాన్ని ప్రజలు కళ్లారా చూశారు. నాయకులు పడిన అవస్థలను దగ్గరుండి చూశారు. ఈసారి ఎలాగైనా వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకురావాలని కంకణబద్ధులయ్యారు. అందుకు తగ్గట్టుగా పార్టీ శ్రేణులు కూడా ఒకవిధమైన కసితో కష్టపడి, సమన్వయంతో పని చేశాయి. వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ప్రజలు అందించారు. ఫలితంగా అత్యధిక ఓట్లు కట్టబెట్టి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లోనూ, మూడు పార్లమెంటరీ స్థానాల్లోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులను జిల్లా ప్రజలు గెలిపించారు. ఇదే ట్రెండ్ రాష్ట్రవ్యాప్తంగా కనిపించడంతో ప్రజాకంటక పాలన సాగించిన టీడీపీ పునాదులు కదిలిపోయాయి. ప్రజాభీష్టం మేరకు రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటవుతోంది. ముఖ్యమంత్రి పీఠాన్ని జనప్రియ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధిష్టించబోతున్నారు. ఆ కీలక, చారిత్రక సందర్భాన్ని దగ్గరుండి చూడాలని మన జిల్లా ప్రజలు ఆరాటపడుతున్నారు. విజయవాడలో జరిగే వైఎస్ జగన్ పట్టాభిషేకాన్ని చూసేందుకు పయనమవుతున్నారు. దాదాపు ప్రతి నియోజకవర్గం నుంచీ వందలాదిగా తరలి వెళ్తున్నారు. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకుని మరీ బయలుదేరుతున్నారు. ఇప్పటికే కొంతమంది విజయవాడ వెళ్లగా, మరికొంతమంది పయనమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment