విద్యార్థులతో కలిసి నిద్రిస్తున్న కలెక్టర్ మురళీధర్ రెడ్డి, పక్కన ఎంపి భరత్
సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి) : వసతి గృహాలు, ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలల్లో కలెక్టర్లు వారంలో ఒక రోజు నిద్రించి అక్కడి సమస్యలను పరిష్కారించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించడంతో కలెక్టర్ మురళీధర్ రెడ్డి రాజమహేంద్రవరం నుంచి ఈ కార్యక్రమానికి శనివారం శ్రీకారం చుట్టారు. స్థానిక సాంఘిక సంక్షేమ కళాశాలకు చెందిన వసతి గృహం, దాని పక్కనే ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్‌ను తనిఖీ చేశారు. అక్కడి మౌలిక సదుపాయాలు, మరుగుదొడ్ల నిర్వహణ, భోజనం తదితర వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉండాలని, అమ్మఒడి పథకం గురించి తెలుసుకోవాలన్నారు.
వసతుల కల్పనకు ప్రాధాన్యం
కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో నిర్ణయించిన విధంగా హాస్టళ్లు, ఆస్పత్రులను తనిఖీ చేసి వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక రిటైర్ అధికారిని ఏర్పాటు చేసి వసతులు, మరుగుదొడ్డి సౌకర్యాలను పరిశీలిస్తున్నామన్నారు. వారంలో ఒక రోజు ఈ కార్యక్రమం చేపడతామన్నారు. ఆరు నెలల నుంచి ఏడాదిలోపు వసతి గృహాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులను మెరుగు పరుస్తామన్నారు. రాజమహేంద్రవరంలోని వసతి గృహాల్లో వసతుల కల్పనకు మున్సిపల్ కమిషనర్ చర్యలు చేపట్టాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ కళాశాలకు కమిషనర్ రూ.15 లక్షల నిధులు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారన్నారు. వసతి గృహాల్లో వసతుల కోసం రూ.15 కోట్లు ఖర్చు చేయడానికి కలెక్టర్లకు ప్రభుత్వం వీలు కల్పించిందన్నారు.
అభివృద్ధికి దోహదం
ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ ఆస్పత్రులు, వసతి గృహాల్లో కలెక్టర్లు బస చేయడం వాటి అభివృద్ధికి దోహద పడుతుందన్నారు. అక్కడి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పరిష్కారానికి వీలుంటుందన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎంపీ ఆకాంక్షించారు.
విద్యార్థులతో మాటామంతీ
ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించారు. అమ్మఒడి పథకం గురించి ఎంతమందికి తెలుసు అని అడగడంతో విద్యార్థులందరూ చేతులు పైకెత్తి మాకు తెలుసు అని చెప్పారు. భోజనానికి ముందు, అనంతరం చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో వారిని అడిగారు. స్వయంగా చేసి చూపిం చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల న్నారు. టెస్టు పుస్తకాలను బాగా చదివితే విషయ పరిజ్ఞానం పెరుగుతుందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రాత్రికి సాంఘిక బాలుర వసతి గృహం–1లో బస చేశారు. ఆయన వెంట రాజమహేంద్రవరం ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment