East Godavari collector
-
ఆ గ్రామాలను కంటైన్మెంట్గా ప్రకటిస్తాం: కలెక్టర్
సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలో నేడు కొత్తగా 367 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3,539 కు చేరినట్లు తెలిపారు. ప్రస్తుతం 1883 యాక్టివ్ కేసులు ఉండటంతో రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా పలు ఆంక్షలతో కూడిన నిబంధనలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 20కి పైగా పాజిటివ్ కేసులు నమోదైన గ్రామాలను పూర్తిగా కంటైన్మెంట్గా ప్రకటిస్తామని ఆయన చెప్పారు. కేసులు అధికంగా నమోదైన ప్రాంతాల్లో అధికారులు పర్యటిస్తారని కలెక్టర్ తెలిపారు. యువకులు అనవసరంగా బైకులపై రోడ్ల మీద తిరుగుతున్నారని, వారు బయటకు రాకుండా తల్లిదండ్రులు కట్టడి చేయాలని ఆయన కోరారు. కరోనా రోజురోజుకు కోరలు చాస్తున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, లేదంటే మహమ్మారి మరింత విజృంభిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఉందని, మెడికల్ షాపులు నిత్యవసరాల దుకాణాలకు మాత్రమే మినహాయింపు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆదివారం మటన్, చికెన్ షాపులు, చేపల మార్కెట్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. -
కరోనా అలర్ట్: ‘రిపోర్టు వస్తేనే చెప్పగలం’
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పర్యటించారు. కరోనా ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న అనుమానితుడిని వైద్యులతో కలిసి బుధవారం ఉదయం కలెక్టర్ పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉంది. కోవిడ్-19పై ప్రజలు ఆందోళ చెందాల్సిన అవసరం లేదు. (చదవండి : తూర్పుగోదావరిలో కరోనా కలకలం!) అనుమానిత వ్యక్తి నుంచి శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షలు నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి పంపించాం. రిపోర్టు వచ్చాకే అతనికి కరోనా వైరస్ సోకిందా లేదా అనే విషయం చెప్పగలం. అనుమానితుడు తిరిగిన ఇంటిని కూడా డొమెస్టిక్ ఐసోలేషన్‌లో పెట్టాం. కరోనా వైరస్‌పై సాఫ్ట్వేర్ ఉద్యోగి బంధువులకు అవగాహన కల్పించాం. చికిత్సకు సంబంధించి అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాం’అని కలెక్టర్ పేర్కొన్నారు. (చదవండి: కరోనా భయం : హోలీ వేడుకలపై పిటిషన్) -
ధర్మాడి సత్యం బృందంపై కలెక్టర్ ప్రశంసలు
సాక్షి, తూర్పుగోదావరి : దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద సెప్టెంబర్ 15వ తేదీన గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటు ఒడ్డుకు చేరుకుంది. బోటును ఒడ్డుకు చేర్చేందుకు నిండు గోదావరిలో 38 రోజులుగా సాగుతున్న ‘ఆపరేషన్ వశిష్ట సక్సెస్’ అయింది. కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం ఎంతో శ్రమించి మంగళవారం మధ్యాహ్నం బోటును ఒడ్డుకు తరలించింది. కాగా, ఎన్నో సవాళ్లతో కూడుకున్న బోటు ఆపరేషన్‌లో పాల్గొన్న ధర్మాడి సత్యం బృందం, స్కూబా డ్రైవర్ల బృందంపై జిల్లా అధికారులు ప్రశంసలు కురిపించారు. కలెక్టర్ మురళీధర్‌రెడ్డి సత్యంకు శాలువ కప్పి స్వీట్ తినిపించారు. దాంతో పాటు రూ.20 లక్షల చెక్కు అందజేశారు. విశాఖకు చెందిన ఓం శివశక్తి సాయి అండర్ వాటర్ సర్వీస్‌కు చెందిన పది మంది డీప్ డైవర్లు కూడా ధర్మాడి బృందంతో కలసి పనిచేశారు. గోదావరిలో రాయల్ వశిష్ట బోటు 214 అడుగుల లోతులో ఉందనే విషయాన్ని సాంకేతిక పరిఙ్ఞానం ద్వారా తొలుత గుర్తించిన సంగతి తెలిసిందే. (చదవండి : ఒడ్డుకు ‘వశిష్ట’) -
హాస్టల్లో నిద్రించిన కలెక్టర్
సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి) : వసతి గృహాలు, ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలల్లో కలెక్టర్లు వారంలో ఒక రోజు నిద్రించి అక్కడి సమస్యలను పరిష్కారించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించడంతో కలెక్టర్ మురళీధర్ రెడ్డి రాజమహేంద్రవరం నుంచి ఈ కార్యక్రమానికి శనివారం శ్రీకారం చుట్టారు. స్థానిక సాంఘిక సంక్షేమ కళాశాలకు చెందిన వసతి గృహం, దాని పక్కనే ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్‌ను తనిఖీ చేశారు. అక్కడి మౌలిక సదుపాయాలు, మరుగుదొడ్ల నిర్వహణ, భోజనం తదితర వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉండాలని, అమ్మఒడి పథకం గురించి తెలుసుకోవాలన్నారు. వసతుల కల్పనకు ప్రాధాన్యం కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో నిర్ణయించిన విధంగా హాస్టళ్లు, ఆస్పత్రులను తనిఖీ చేసి వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక రిటైర్ అధికారిని ఏర్పాటు చేసి వసతులు, మరుగుదొడ్డి సౌకర్యాలను పరిశీలిస్తున్నామన్నారు. వారంలో ఒక రోజు ఈ కార్యక్రమం చేపడతామన్నారు. ఆరు నెలల నుంచి ఏడాదిలోపు వసతి గృహాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులను మెరుగు పరుస్తామన్నారు. రాజమహేంద్రవరంలోని వసతి గృహాల్లో వసతుల కల్పనకు మున్సిపల్ కమిషనర్ చర్యలు చేపట్టాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ కళాశాలకు కమిషనర్ రూ.15 లక్షల నిధులు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారన్నారు. వసతి గృహాల్లో వసతుల కోసం రూ.15 కోట్లు ఖర్చు చేయడానికి కలెక్టర్లకు ప్రభుత్వం వీలు కల్పించిందన్నారు. అభివృద్ధికి దోహదం ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ ఆస్పత్రులు, వసతి గృహాల్లో కలెక్టర్లు బస చేయడం వాటి అభివృద్ధికి దోహద పడుతుందన్నారు. అక్కడి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పరిష్కారానికి వీలుంటుందన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎంపీ ఆకాంక్షించారు. విద్యార్థులతో మాటామంతీ ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించారు. అమ్మఒడి పథకం గురించి ఎంతమందికి తెలుసు అని అడగడంతో విద్యార్థులందరూ చేతులు పైకెత్తి మాకు తెలుసు అని చెప్పారు. భోజనానికి ముందు, అనంతరం చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో వారిని అడిగారు. స్వయంగా చేసి చూపిం చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల న్నారు. టెస్టు పుస్తకాలను బాగా చదివితే విషయ పరిజ్ఞానం పెరుగుతుందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రాత్రికి సాంఘిక బాలుర వసతి గృహం–1లో బస చేశారు. ఆయన వెంట రాజమహేంద్రవరం ఇన్చార్జి సబ్ కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి ఉన్నారు. -
దేవుడిలా దిగివచ్చారు..
సాక్షి, తూర్పుగోదావరి : కనరాని దేవుడే కనిపించినాడె అన్నట్టుగా అయింది దివ్యాంగుడు దుర్గారావుకు. జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ దేవుడిలా దిగివచ్చి అతని కోర్కె తీర్చారు. వివరాల్లోకి వెళితే.. కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురానికి చెందిన దుర్గారావుకు చిన్నతనంలోనే పోలియో సోకింది. దాంతో అంVýæ వైకల్యానికి గురయ్యాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరంగా కాగా భిక్షమెత్తుకొని జీవిస్తున్నాడు. గత ప్రభుత్వ హయాంలో పింఛన్‌కోసం కార్యాలయాల చుట్టూ, సదరన్ సర్టిఫికెట్ కోసం కొత్తపేట, కాకినాడ, రాజమహేంద్రవరం ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. అందరి ఆశా జ్యోతిగా నిలుస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన ‘స్పందన’లోనైనా తనకు పింఛన్ లభిస్తుందేమో అనే ఆశతో శుక్రవారం కలెక్టరేట్‌కు వచ్చాడు. కలెక్టర్ సమీక్షా సమావేశాల్లో ఉండడంతో ఆయనకోసం నిరీక్షిస్తున్న దుర్గారావు వద్దకు జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ‘మీరైనా పింఛన్ ఇప్పించి ఆదుకోండి’ అని జేసీ లక్ష్మీశను దుర్గారావు వేడుకున్నాడు. దుర్గారావు ఫోన్ నెంబర్‌ను జేసీ తీసుకున్నారు. ‘నీవు మళ్లీ కలెక్టరేట్‌కు వచ్చే పనిలేకుండా ఆస్పత్రికి తెలియజేసి సదరన్‌సర్టిఫికెట్ ఇప్పించి పింఛన్ వచ్చేలా చూస్తా’నని హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఆయన సిబ్బందిని పిలిచి ఆటోలో బస్టాండ్‌కు తీసుకువెళ్లి అక్కడ నుంచి బస్సు ఎక్కించి అతనిని స్వగ్రామం పంపించాలని సూచించారు. -
కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
కాకినాడ సిటీ: ఈ నెల 23వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాలతో పాటు, జిల్లాలో ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం లేకుండా పటిష్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో శనివారం పోలీసు సూపరింటెండెంట్లు, రిటర్నింగ్ అధికారులు, డీఎస్పీలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి కౌంటింగ్ ఏర్పాట్లను సమీక్షించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, అంతర వలయంలో సీఆర్పీఎఫ్ దళాలు, మధ్య వలయంలో ఏపీఎస్పీ దళాలు, బాహ్య వలయంలో స్థానిక పోలీస్ దళాలను మోహరించాలని సూచించారు. అభ్యర్థులు ప్రతిపాదించిన కౌంటింగ్ ఏజెంట్ల ప్రవర్తన, నేర చరిత్రలను పోలీసు శాఖ పరిశీలించి నివేదికను ఆర్వోలకు అందజేయాలన్నారు. ఓట్ల లెక్కింపు రోజున గుంపులు, సమూహాలు ఉత్సాహం, నైరాశ్యాలకు లోనై ఎవరూ శాంతిభద్రతలకు కలిగించకుండా కౌంటింగ్ కేంద్రాలతోపాటు అన్ని మండల కేంద్రాల్లో 144 సెక్షన్ విధించాలని ఆదేశించారు. పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లతో రిటర్నింగ్ అధికారులు, డీఎస్పీలు వారి వారి నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించి శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించేలా కోరాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయిన తరువాత ఆర్వోలు, డీఎస్పీలు ఈవీఎంలను గోడౌన్‌కు, స్టాట్యుటరీ పత్రాల ట్రంక్ బాక్సులను కలెక్టరేట్‌కు సురక్షితంగా తరలించి భద్రపరచాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ విశాల్ గున్ని, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ షిమోషి బాజ్‌పాయ్ మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా 911 మంది పోలీసు సిబ్బందిని నియమించామన్నారు. కౌంటింగ్ రోజున అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జిల్లా వ్యాప్తంగా తగిన ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. కలెక్టర్ సూచనల మేరకు జేఎన్టీయూకేలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద మరో 150 నుంచి 200 మంది అదనపు సిబ్బందిని నియమిస్తామని చెప్పా రు. జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జున, రంపచోడవ రం ఐటీడీఏ పీవో నిషాంత్ కుమార్, సబ్ కలెక్టర్లు సా యికాంత్ వర్మ, వినోద్‌కుమార్, చింతూరు ఐటీడీఏ పీవో అభిషిక్త కిషోర్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ సుమీత్‌కుమార్ గాంధీ, డీఆర్వో ఎం వీ గోవిందరాజులు, సీఆర్పీఎఫ్ దళాల ఇన్చార్జి ము రళీ, రిటర్నింగ్ అధికారులు, డీఎస్పీలు పాల్గొన్నారు. -
కాలయాపనే కారణం..
కాకినాడ: సుదీర్ఘ కాలయాపన వల్లే రాజమండ్రి కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగిందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు వీవీఐపీలు, వీఐపీల కోసం పుష్కరఘాట్‌ను గంటలతరబడి మూసివేయడం, ఆ తర్వాత ఒక్కసారిగా గేట్లు తెరవడం వల్లనే తొక్కిసలాట జరిగినట్లు ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 27 మంది మృతి చెందిన దుర్ఘటనపై జిల్లా కలెక్టర్... రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను పంపించారు. పుష్కరాల ప్రారంభం రోజైన మంగళవారానికి 2రోజుల ముందునుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు రాజమండ్రికి రావడం ప్రారంభించారని నివేదికలో పేర్కొన్నారు. పుష్కరాలు ప్రారంభం కాగానే నదిలో స్నానం చేయాలనే ఉత్సుకతతో మంగళవారం తెల్లవారు జామునే పెద్ద సంఖ్యలో పుష్కర ఘాట్ కు భక్తులు తరలి వచ్చారని తెలిపారు. భక్తుల సంఖ్య గంట గంటకు పెరిగిపోయినట్లు పేర్కొన్నారు. అయితే చంద్రబాబుతో పాటు వీవీఐపీ లు, వీఐపీలు ఉదయం 6.26 గంటల నుంచి పుష్కర ఘాట్‌లో ఉన్నారని, గోదావరి పుష్కరాల్లో తొలుత స్నానం చేసి పుష్కరాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారని కల్టెక్టర్ నివేదిక లో స్పష్టం చేశారు. వారు స్నానాలు పూర్తయ్యి బయటకు వచ్చేసరికి 8.30 గంటలైం దని తెలిపారు. తెల్లవారుజామునుంచి 8.30 గం టలవరకూ భక్తులను అనుమతించకపోవడం తో తాకిడి మరింతగా పెరిగిపోయిందన్నారు.ఆ తర్వాత కూడా ఒక్కగేటునే తెరవడంతో భక్తుల తాకిడితో తొక్కిసలాట జరిగిందని, పోలీసులు నిలువరించలేకపోయారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ద్వారా జిల్లా కలెక్టర్ తన నివేదికను కేంద్ర హోంశాఖకు పంపారు. కాగా చంద్రబాబు కార్యక్రమాలు పూర్తయ్యే వరకు భక్తులను నదీలోకి స్నానం చేయడానికి అనుమతించనందునే తొక్కిసలాట జరిగినట్లు దీనిద్వారా తెలుస్తోంది. తెల్లవారు జామునుం చి వచ్చిన వారిని వచ్చినట్లే నదిలోకి స్నానానికి అనుమతించినట్లైతే పెద్ద ఎత్తున భక్తులు గుమికూడటం, తొక్కిసలాట జరిగి ఉండేది కాదని కలెక్టర్ నివేదిక పరోక్షంగా స్పష్టం చేస్తోంది.