కాకినాడ సిటీ: ఈ నెల 23వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాలతో పాటు, జిల్లాలో ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం లేకుండా పటిష్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో శనివారం పోలీసు సూపరింటెండెంట్లు, రిటర్నింగ్ అధికారులు, డీఎస్పీలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి కౌంటింగ్ ఏర్పాట్లను సమీక్షించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, అంతర వలయంలో సీఆర్‌పీఎఫ్ దళాలు, మధ్య వలయంలో ఏపీఎస్పీ దళాలు, బాహ్య వలయంలో స్థానిక పోలీస్ దళాలను మోహరించాలని సూచించారు. అభ్యర్థులు ప్రతిపాదించిన కౌంటింగ్ ఏజెంట్ల ప్రవర్తన, నేర చరిత్రలను పోలీసు శాఖ పరిశీలించి నివేదికను ఆర్వోలకు అందజేయాలన్నారు. ఓట్ల లెక్కింపు రోజున గుంపులు, సమూహాలు ఉత్సాహం, నైరాశ్యాలకు లోనై ఎవరూ శాంతిభద్రతలకు కలిగించకుండా కౌంటింగ్ కేంద్రాలతోపాటు అన్ని మండల కేంద్రాల్లో 144 సెక్షన్ విధించాలని ఆదేశించారు.
పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లతో రిటర్నింగ్ అధికారులు, డీఎస్పీలు వారి వారి నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించి శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించేలా కోరాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయిన తరువాత ఆర్వోలు, డీఎస్పీలు ఈవీఎంలను గోడౌన్‌కు, స్టాట్యుటరీ పత్రాల ట్రంక్ బాక్సులను కలెక్టరేట్‌కు సురక్షితంగా తరలించి భద్రపరచాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ విశాల్ గున్ని, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ షిమోషి బాజ్‌పాయ్ మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా 911 మంది పోలీసు సిబ్బందిని నియమించామన్నారు.
కౌంటింగ్ రోజున అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జిల్లా వ్యాప్తంగా తగిన ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. కలెక్టర్ సూచనల మేరకు జేఎన్‌టీయూకేలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద మరో 150 నుంచి 200 మంది అదనపు సిబ్బందిని నియమిస్తామని చెప్పా రు. జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జున, రంపచోడవ రం ఐటీడీఏ పీవో నిషాంత్ కుమార్, సబ్ కలెక్టర్లు సా యికాంత్ వర్మ, వినోద్‌కుమార్, చింతూరు ఐటీడీఏ పీవో అభిషిక్త కిషోర్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ సుమీత్‌కుమార్ గాంధీ, డీఆర్వో ఎం వీ గోవిందరాజులు, సీఆర్‌పీఎఫ్ దళాల ఇన్‌చార్జి ము రళీ, రిటర్నింగ్ అధికారులు, డీఎస్పీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment