సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలో నేడు కొత్తగా 367 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3,539 కు చేరినట్లు తెలిపారు. ప్రస్తుతం 1883 యాక్టివ్ కేసులు ఉండటంతో రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా పలు ఆంక్షలతో కూడిన నిబంధనలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 20కి పైగా పాజిటివ్ కేసులు నమోదైన గ్రామాలను పూర్తిగా కంటైన్‌మెంట్‌గా ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
కేసులు అధికంగా నమోదైన ప్రాంతాల్లో అధికారులు పర్యటిస్తారని కలెక్టర్ తెలిపారు. యువకులు అనవసరంగా బైకులపై రోడ్ల మీద తిరుగుతున్నారని, వారు బయటకు రాకుండా తల్లిదండ్రులు కట్టడి చేయాలని ఆయన కోరారు. కరోనా రోజురోజుకు కోరలు చాస్తున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, లేదంటే మహమ్మారి మరింత విజృంభిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఉందని, మెడికల్ షాపులు నిత్యవసరాల దుకాణాలకు మాత్రమే మినహాయింపు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆదివారం మటన్, చికెన్ షాపులు, చేపల మార్కెట్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment