
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామా నేపథ్యంలో ఆయా లోక్‌సభ స్ధానాలకు ఉప ఎన్నికలు నిర్వహించకపోవడంపై వచ్చిన మీడియా కథనాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) వివరణ ఇచ్చింది. కర్నాటకలోని బళ్లారి, షిమోగ, మాండ్య లోక్‌సభ స్ధానాలు మే 18, మే 21 తేదీల నాటికే ఖాళీ అయ్యాయని, ఆంధ్రప్రదేశ్‌లోని 5 లోక్‌సభ స్ధానాలు జూన్ 20న ఖాళీ అయ్యాయని తెలిపింది. ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 151ఏ ప్రకారం పదవీ కాలపరిమితి ఏడాది కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలు నిర్వహించాలని, 16వ లోక్‌సభ కాలపరిమితి 2019 జూన్ 3వరకూ మాత్రమే ఉందని ఈసీ వెల్లడించింది.
కర్నాటకలో ఏర్పడిన ఖాళీలు అంతకంటే ముందే ఏర్పడినందున అక్కడ ఉప ఎన్నికల నిర్వహణ అనివార్యమైందని ఈసీ వివరణ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్ధానాల ఖాళీ జూన్ 20న నెలకొన్నందున సభ్యుల పదవీకాలం ఏడాదిలోపు ఉండనుండటంతో ఏపీలో ఉప ఎన్నికల నిర్వహణ అవసరం లేకపోయిందని పేర్కొంది. కాగా, ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీకి చెందిన ఐదుగురు లోక్‌సభ ఎంపీలు తమ పదవులకు సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందుగానే రాజీనామా చేసినా లోక్‌సభ స్పీకర్ వాటిని ఆమోదించడంలో జాప్యం జరిగిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment