తాడేపల్లిగూడెంలోని నన్నయ పీజీ క్యాంపస్ పరిస్థితి ఇలా
తాడేపల్లిగూడెం: క్యాంపస్ ఉంది.. విద్యార్థులు లేరు. కోర్సు ఉంది. బోధకులు లేరు. భవనం ఉంది.. దారులు లేవు. స్థలం ఉంది. కనపడదు. ఇదీ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలోని తాడేపల్లిగూడెం పీజీ క్యాంపస్ దుస్థితి. 2004లో ఆంధ్రా యూనివర్సిటీ పరి ధిలో ఏర్పడిన ఈ క్యాంపస్ ఐదేళ్లపాటు మాత్రమే వెలిగింది. తర్వాత నన్నయ వర్సిటీపరిధిలోకి వచ్చాక వర్సిటీ చిన్నచూపు కారణంగా దయనీయస్థితిలోకి వెళ్లింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఎమ్మెల్యేగా కొట్టు సత్యనారాయణ ఉండగా క్యాంపస్‌కు వంద ఎకరాల స్థలాన్ని కేటాయించినా.. దానిని క్యాంపస్ నిలుపుకోలేకపోయింది. చివరకు ప్రస్తుతం 18 ఎకరాల 46 సెంట్లు మాత్రమే పీజీ క్యాంపస్‌కు ఉంది. దీనికి సంబంధించిన రికార్డులు కూడా పీజీ క్యాంపస్‌లో లేకపోవడం గమనార్హం. బాలికల హాస్టల్ నిర్మాణం కోసం పనులు చేపట్టడానికి సాంఘిక సంక్షేమ శాఖ వెతగ్గా ఈ రికార్డులు లభ్యం కావడం గమనించాలి.
ప్రాభవం మసకబారిందిలా..
ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో క్యాంపస్ ఇక్కడ ఏర్పాటుచేసిన సందర్భంలో ఆర్ట్స్ కోర్సులు ఉండేవి. విద్యార్థులు కూడా ఆశించిన స్థాయిలో ఉండేవారు. ఆంధ్రాయూనివర్సిటీ కేంద్రస్థానానికి చివరగా ఉన్న ఈ క్యాంపస్‌ను ఆ తర్వాత కాలంలో దాదాపుగా పట్టించుకున్న అధికారులు లేరు. క్యాంపస్‌కు ప్రత్యేక అధికారులుగా వచ్చిన వారిలో ఒకరిద్దరు తమ వ్యక్తిగత బలహీనతలు తీర్చుకొనే కేంద్రంగా మార్చుకున్నారు. ఇలాంటి ఉపద్రవాలను నిరోధించే చర్యలను 2009 తర్వాత పట్టించుకున్న నాథుడులేడు. దీంతో పీజీ క్యాంపస్ ప్రాభవం మసకబారింది.
నన్నయ పరిధిలోకి వెళ్లినా..
ఆంధ్రా యూనివర్సిటీ పరిధి నుంచి పీజీ క్యాంపస్ ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోకి వెళ్లినా పీజీ క్యాంపస్ ప్రగతిలో మార్పు రాలేదు. వర్సిటీ పరిధిలోని కాకినాడ పీజీ కేంద్రంపై చూపిస్తున్న ప్రేమను వర్సిటీ గూడెం కేంద్రంపై చూపలేదు. సవతి తల్లి ప్రేమను చూపిస్తూ వచ్చింది. కాకినాడ ఆర్ట్స్ కేంద్రంగా, గూడెం సైన్సు పీజీ కేంద్రంగా చేస్తున్నామంటూనే గూడెంలో ఉన్న ఆర్ట్స్ కోర్సులను ఎలాంటి సమాచారం లేకుండా ఎత్తేశారు. ఇటీవల ఎంబీఏ కోర్సు ఎత్తివేసిన సందర్భంలో సాక్షిలో వచ్చిన కథనం, ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ చొరవతో కోర్సు ఇక్కడ నిలబడింది.
అడహాక్ ఫ్యాకల్టీలే గతి
క్యాంపస్‌లో ఎంబీఏ, ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్‌సీ అనలైటికల్ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ ఫిజిక్స్, తాజాగా ఈ విద్యాసంవత్సరం నుంచి బీ.ఫార్మసీ ఇచ్చారు. ఈ కోర్సులు బోధించడానికి అడహాక్ అసిస్టెంటు ప్రొఫెసర్లు ఎంబీఏ కోసం ఇద్దరు, కెమిస్ట్రీకి ఇద్దరు ఉన్నారు. ప్రాంగణం లోపల చూస్తే లైటు వెలగదు. ఫ్యాన్ కనెక్షన్ ఉన్నా, ఫ్యాన్‌లు ఉండవు. ల్యాబ్ ఉన్నా, సౌకర్యాలు లేని స్థితి. లైబ్రరీ ఉందికానీ.. పుస్తకం ఇచ్చేవారు లేరు.. తీసుకొనేవారు లేరు. అతిథులు వస్తే కనీసం నీళ్లు ఇవ్వడానికి శాశ్వత ప్రాతిపదికన పనిచేసే అటెండర్‌లేని దుస్థితి.
విద్యార్థులు ఇలా...
ఎంబీఏలో 40 సీట్లు ఉన్నాయి. అన్నీ భర్తీ అయ్యాయి. రహదారి సౌకర్యం లేకపోవడం, హాస్టల్ వసతి లేనందు వల్ల కేవలం ఆరుగురు విద్యార్థులు మాత్రమే చేరారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో 30 సీట్లకు 29 మంది విద్యార్థులు చేరారు. ఎమ్మెస్సీ అనలైటికల్ కెమిస్ట్రీలో 15 సీట్లకు 13 మంది చేరారు. ఎమ్మెస్సీ ఫిజిక్స్‌లో 30 సీట్లకు 11 మంది మాత్రమే చేరారు. బీ.ఫార్మసీలో 40 సీట్లు ఇచ్చారు. ఎంపీసీ ఫార్మాట్లో 20 సీట్లు, బైపీసీ స్ట్రీమ్‌లో 20 సీట్లు ఇచ్చారు. బైపీసీ స్ట్రీమ్‌లో 20 సీట్లకు 18 మంది చేరారు. ఎంపీసీ ఫార్మెట్ సీట్లు ఖాళీగానే ఉన్నాయి.
దారీ తెన్నూ లేదు.
పీజీ క్యాంపస్‌కు వెళ్లడానికి సరైన సౌకర్యం లేదు. గతుకుల రోడ్డు మాత్రమే ఉంది. క్యాంపస్ ముందు భాగం పిచ్చిమొక్కలకు కేరాఫ్‌గా మారింది. వెనుక భాగం వాన నీటి స్థావరంగా, విష కీటకాల నివాస సముదాయంగా రూపాంతరం చెందింది.
ఇవి కావాలి..
విద్యార్థులు, కోర్సుల అవసరాలకు అనుగుణంగా భవనాల నిర్మాణం జరగాలి. పరిశోధనశాలలు ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు వసతి భవనాలు సమకూరాలి. తొలి ఏడాది పీజీ విద్యార్థులకు జనరల్ కెమిస్ట్రీ, జనరల్ ఫిజిక్స్ బోధించడానికి , ఇనార్గానిక్ కెమిస్ట్రీ బోధించడానికి ఒక బోధకుడు కావాలి. రానున్న విద్యాసంవత్సరానికి వీరు కాకుండా మరో ఇద్దరు బోధకులు అవసరం ఉంది.
కాయకల్ప చికిత్స జరగాలి..
విద్యా విషయంలో విజన్ కలిగిన ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ద్వారా చికిత్స జరిగితేనే ఇక్కడి సమస్యలకు పరిష్కారం లభించగలదని ఆశిస్తున్నారు. ఇదే ప్రాంగణంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుచేయాలనే ఆలోచన ఎమ్మెల్యేకు ఉంది. ఈ ఏడాది కొత్తగా ఏర్పాటుచేసిన బీ.ఫార్మసీ అవసరాలకు అనుగుణంగా ల్యాబ్‌లు సమకూరాలి. ఫార్మసీ బిల్డింగ్ కోసం రూ.12 కోట్లు, బాలికల వసతి గృహం కోసం రూ.3 కోట్లు నిధులు విడుదలయ్యాయి.
నేడు విద్యాశాఖమంత్రి రాక
నన్నయ పీజీ క్యాంపస్‌లో నిర్మించబోయే బాలికల వసతి గృహం, పార్మసీ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేయడానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మంత్రులతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం హాజరవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment