సాక్షి, కాకినాడ :
రెండు నెలలు కావస్తున్నా జిల్లా కేంద్రం నుంచి మారుమూల పల్లె వరకు సమైక్య ఉద్యమం మహోధృతంగా సాగుతూనే ఉంది. జనం అణుమాత్రం సడలని సమరదీక్షతో విభజన నిర్ణయంపై నిరసన కత్తులు దూస్తూనే ఉన్నారు. 55వ రోజైన సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. కాకినాడలో జిల్లా రవాణాశాఖ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో వేలాది వాహనాలతో రవాణాశాఖ కార్యాలయం నుంచి జగన్నాథపురం వంతెన వరకు మహార్యాలీ జరిగింది. 100కు పైగా మినీ గూడ్స్ ఆటోలు, 300పైగా పాఠశాల బస్సులు, - మిగతా 2లోఠ
300 బైక్‌లు, 300కుపైగా కార్లతో ర్యాలీ సాగింది. జిల్లా ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లు మండుటెండను సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా చేశారు. న్యాయశాఖ ఉద్యోగులు జిల్లాల పేర్ల మీద తయారు చేసిన కుండలను నెత్తిపై పెట్టుకొని, ఎడ్లబండ్లపై వినూత్న నిరసన చేశారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సిబ్బంది సీమాంధ్ర మంత్రుల మాస్క్‌లు ధరించి చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. తాళ్లరేవు జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేసిన కరాటే, తైక్వాండో విన్యాసాలు అబ్బుర పరిచాయి. సర్పవరం జంక్షన్‌లో ఎమ్మెల్యే కురసాల కన్నబాబు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు.
మలికిపురంలో సమైక్య శంఖారావం
విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మలికిపురంలో నిర్వహించిన సమైక్య శంఖారావంలో సుమారు 10 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్డీఓ పి.సంపత్‌కుమార్ మాట్లాడుతూ విభజనతో దేశ స్థిరత్వానికే ముప్పు వాటిల్లుతుందన్నారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన గర్జనలో విద్యార్థులు వినూత్నరీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రాజానగరం గాంధీబొమ్మ సెంటర్‌లో నిర్వహించిన విద్యార్థి గర్జనలో వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు, శ్రీకృష్ణ దేవరాయల వేషధారణల్లో విద్యార్థులు నిరసన తెలిపారు. కరపలో నిర్వహించిన విద్యార్థిగర్జనలో 500 మీటర్లపొడవైన జాతీయ జెండాతో ర్యాలీ చేశారు. కొత్తపేటలో వందలాదిమంది కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ చేసి రోడ్డు మీద మోకాళ్లపై నిల్చొని మానవహారం చేశారు. రావులపాలెంలో జాతీయ రహదారిపై విద్యార్థులు మహార్యాలీ, మానవ హారాలతో హోరెత్తించారు. ముమ్మిడివరంలో వేలాది మంది ప్రైవేటు పాఠశాలల చిన్నారులు ర్యాలీ చేశారు. రామచంద్రపురం, ద్రాక్షారామలలో వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు, ప్రైవేటు పాఠశాలల సిబ్బంది ర్యాలీ చేశారు. కాజులూరులో విద్యార్థులు రెండుకిలోమీటర్ల మేర మానవహారం నిర్వహించి, 300 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ చేశారు.
అంబాజీపేటలో రోడ్లపైనే క్షవరాలు
అంబాజీపేటలో నాయీబ్రాహ్మణులు రోడ్లపైనే క్షవరాలు చేసి నిరసన తెలిపారు. మామిడికుదురులో ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు రోడ్లపై పడుకొని పిడికిళ్లు బిగించి నిరసన తెలిపారు. పెద్దాపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట విద్యార్థులు ఉద్యమానికి 55 రోజులని సూచిస్తూ 55 ఆకృతిలో నిల్చొన్నారు. పెద్దాపురం కోర్టు కాంప్లెక్స్ వద్ద న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదులు మంత్రుల మాస్క్‌లతో రోడ్డుపైనే ప్రజావైద్యశాల నిర్వహించి నిరసన తెలిపారు. సోనియా జపం వీడి రాజీనామలు చేస్తే కానీ జబ్బు తగ్గదని చాటారు. సామర్లకోటలో జేఏసీ ప్రతినిధులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఏలేశ్వరంలో జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి రహదారిపై ఉన్న గోతుల్లోని మురుగు నీరు తోడి నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మికులు బైకు ర్యాలీ చేశారు. జాతీయ దళిత ఐక్యసమాఖ్య రాష్ర్ట అధ్యక్షుడు దొమ్మేటి సుధాకర్ ఆధ్వర్యంలో జగ్గంపేటలో వంటావార్పు చేశారు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో 40 ట్రాక్టర్లతో సుమారు 500మంది రైతులు ప్రదర్శనగా కోరుకొండ వరకు వచ్చి ధర్నా చేశారు. భూగర్భ జలవనరులశాఖ ఆధ్వర్యంలో రాజమండ్రిలో 50 లారీలతో ర్యాలీ చేశారు. వందలాది మంది ఉపాధ్యాయులు నల్లదుస్తులు ధరించి నోటికి నల్లరిబ్బన్లు కట్టుకొని గోదావరి గట్టున రిలయన్స్ మార్ట్ వద్దనున్న ఏపీ ఎన్జీఓ కార్యాలయం నుంచి కంబాల చెరువు జంక్షన్ వరకు ర్యాలీ చేశారు.
క్షమాపణ చెప్పిన హాస్టల్ వార్డెన్
పిఠాపురం సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్ వార్డెన్‌గా పని చేస్తున్న నల్గొండకు చెందిన పి.రాజ్యలక్ష్మి హాస్టల్ ఆవరణలో ఉన్న తెలుగుతల్లి బొమ్మకు సున్నం పూయించారు. గత కొంతకాలంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనేందుకు అవకాశమివ్వాలని విద్యార్థులు కోరుతున్నప్పటికీ ఆమె అవకాశమివ్వలేదు. సోమవారం ఉదయం తెలుగుతల్లి బొమ్మకు సున్నం పూయించినట్టు తెలియడంతో జేఏసీ ప్రతినిధులు హాస్టల్‌కు వెళ్లి ఆమెను నిలదీశారు. కొత్త పెయింటింగ్స్ వేయించేందుకు అన్ని బొమ్మలతో పాటు తెలుగుతల్లి బొమ్మకు కూడా సున్నం పూశారని ఆమె చెప్పినప్పటికీ సమైక్యవాదులు ఊరుకోలేదు. దాంతో ఆమె క్షమాపణ చెప్పి, తెలుగుతల్లి బొమ్మపై ఉన్న రంగును తొలగించి పాలాభిషేకం చేసి ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేసింది.
మరోవైపు సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక పిలుపు మేరకు మంగళవారం జరగనున్న జిల్లా బంద్ విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆటోలు, ప్రైవేట్ వాహనాల వారు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారు. కాకినాడ పోర్టులో కార్యకలాపాలు కూడా స్తంభించనున్నాయి.
జిల్లా అంతటా మూతపడ్డ విద్యాసంస్థలు
Published Tue, Sep 24 2013 3:20 AM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM
Advertisement
Advertisement