చౌకడిపోల ద్వారా 16 సరుకులు నెలంతా ఇవ్వాలి
ఇళ్ల మంజూరులో జన్మభూమి కమిటీల పెత్తనం తొలగించాలి
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం డిమాండ్
సాక్షి, విజయవాడ బ్యూరో : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజాపంపిణీ వ్యవస్థల్లో చేస్తున్న ప్రయోగాలు పేదలను వ్యయప్రయాసలకు గురిచేయడంతోపాటు నష్టపోయేలా చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం విమర్శించింది. వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ఉపాధ్యక్షుడు పాటూరు రామయ్య అధ్యక్షతన గురువారం విజయవాడలో సంఘ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు అధ్యక్షతన జరిగిన సమావేశం చేసిన పలు తీర్మానాలను పత్రికలకు విడుదల చేశారు.
రేషన్ సరుకులు, వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు ఇవ్వడానికి డిజిటల్ వేలిముద్రలు వేయడం, ఈ పాస్ విధానాన్ని అమలు చేయడం లబ్ధిదారులకు ఇబ్బందికరంగా మారింది. వేలిముద్రలు సరిగ్గా పడక, మారుమూల ప్రాంతాల్లో నెట్ కనెక్ట్‌కాక, ఆన్‌లైన్ సరిగ్గా పనిచేయ పింఛన్, నిత్యావసర సరుకుల కోసం పేదలు కూలి పనులు మానుకొని రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. ఈ పాస్ సరిగ్గా పనిచేయకపోవడంతో రేషన్ సరుకులు మూడు రోజుల్లో పొందాలనే నిబంధన ప్రజలకు నష్టం తెచ్చేదిగా ఉంది. లోపాలు చక్కదిద్ది, ఈ పాస్ రద్దు చేసి ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని, చౌకడిపోల ద్వారా 16 సరుకులను నెలంతా ఇవ్వాలని ప్రభుత్వాన్ని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌చేసింది. ఆరేళ్లుగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నేటికీ బకాయిలు ఇవ్వలేదు.
2, 3దశల్లో నిర్మాణంలో ఉన్న లబ్ధిదారులకు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ బిల్లులు చెల్లించలేదు. ఇప్పుడు మొదటి దశలో నిర్మాణంలో ఉన్న లబ్ధిదారులకు ఇస్తామని ప్రకటించకపోవడం దారుణం. కొత్త ఇళ్లు మంజూరులో జన్మభూమి కమిటీల పెత్తనం వల్ల రాజకీయ జోక్యంతో అర్హులకు అన్యాయం జరుగుతుంది. ఇళ్ల మంజూరులో జన్మభూమి కమిటీ పెత్తనం తొలగించి, అర్హులందరికీ ఇళ్లు ఇచ్చేలా ప్రభుత్వం పూనుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌చేసింది.