
ప్రకాశంలో కంగుతిన్న దేశం
జెడ్పీ చైర్మన్‌గా ఈదర హరిబాబు ఎన్నిక
పోలీసుల మద్దతుతో పీఠం దక్కించుకునేందుకు టీడీపీ యత్నం
హైదరాబాద్ నుంచి ఒంగోలుకు వస్తున్న వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీని మధ్యలోనే అరెస్టు చేసిన పోలీసులు
టీడీపీ అభ్యర్థి మన్నె రవీంద్రపై స్వతంత్ర అభ్యర్థిగా టీడీపీకే చెందిన హరిబాబు పోటీ
వైఎస్సార్‌సీపీ మద్దతుతో హరిబాబు గెలుపు
వైస్ చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బాలాజీ ఎన్నిక
ఒంగోలు: ఎన్ని కట్రలు, కుతంత్రాలు పన్నినా, పోలీసుల అండతో తప్పుడు కేసులో ఒక జెడ్పీటీసీని అరెస్టు చేయించినా ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని టీడీపీ దక్కించుకోలేకపోయింది. తనకు మెజార్టీ లేని జిల్లాను కైవసం చేసుకొనేందుకు టీడీపీ పన్నిన పన్నాగాలు ఫలించలేదు. సొంత పార్టీ నేతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం, ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకడంతో అధికార పార్టీ కంగుతింది. పలు నాటకీయ పరిణామాల మధ్య జిల్లా పరిషత్ చైర్మన్‌గా స్వతంత్ర అభ్యర్థి ఈదర హరిబాబు, వైఎస్ చైర్మన్‌గా వైఎస్సార్ సీపీ అభ్యర్థి నూకసాని బాలాజీ గెలుపొందారు.
ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు 31 స్థానాలు, తెలుగుదేశం పార్టీకి 25 జెడ్పీటీసీ స్థానాలు దక్కాయి. మెజారిటీ లేకపోయినా జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ చేయని ప్రయత్నం లేదు. టీడీపీ నేతలు ముగ్గురు వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలను ప్రలోభపెట్టి, తమ పార్టీ వైపు తిప్పుకున్నారు. దీంతో ఇరు పార్టీల బలాలు సమానమయ్యాయి. అయినా టీడీపీ నేతలు గొడవకు దిగి ఈ నెల ఐదున జరగాల్సిన ఎన్నిక వాయిదా పడటానికి కారణమయ్యారు. ఎన్నికల కమిషన్ మళ్లీ ఆదివారం ఎన్నిక నిర్వహించింది. దీనికి ప్రత్యేక పరిశీలకునిగా సమాచార శాఖ కమిషనర్ దాన కిషోర్‌ను పంపింది. ఈ వారం రోజుల్లో వైఎస్సార్ సీపీ సభ్యులను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించినా ఎవ్వరూ వెళ్లకపోవడంతో అధికార పార్టీ చివరికి పోలీసులను ప్రయోగించింది. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి ఒంగోలు వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యుడు జవ్వాజి రంగారెడ్డిని ఆదివారం తెల్లవారుజామున పోలీసులు సంతమాగులూరు వద్ద సినీఫక్కీలో అరెస్టు చేశారు. ఈనెల 10న మార్కాపురం పోలీసు స్టేషన్‌లో ఆయనపై అందిన ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదైంది. ఈ విషయం తెలియని రంగారెడ్డి సహచర సభ్యులతో కలిసి ప్రైవేటు బస్సులో హైదరాబాద్ నుంచి బయల్దేరారు. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో సంతమాగులూరు టోల్‌ప్లాజా సమీపంలోని అతిథి గృహం వద్ద కాలకృత్యాల కోసం ఆగారు. ఆ సమయంలో ఓ పాఠశాల వాహనంలో వచ్చిన 80 మంది పోలీసులు జెడ్పీటీసీల బస్సును చుట్టుముట్టారు. మార్కాపురం డీఎస్పీ జి. రామాంజనేయులు బస్సులోకి వచ్చి రంగారెడ్డిని బలవంతంగా కిందికి దిం పారు. అడ్డుకున్న మిగతా జెడ్పీటీసీలను పోలీసులు నెట్టివేశారు. అరెస్టుకు కారణమడిగినా సమాధానం చెప్పలేదు. అప్పటికప్పుడు మార్కాపురం జూనియర్ సివిల్ జడ్జి ఎస్.మహ్మద్ అబుల్‌తాలీఫ్‌ఫర్విజ్ ఇంట్లో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించి ఆయన్ని సబ్ జైలుకు తరలించారు. కొద్దిగంటల్లో జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో ఓటేయాల్సిన రంగారెడ్డి అరెస్టును ఊహించని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంతమాగులూరు, ఒంగోలు, మార్కాపురంలలో ఆందోళనలు చేపట్టారు.
ఈ సంఘటనపై వైఎస్సార్ సీపీ నేత, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది టీడీపీ అరాచకానికి నిదర్శనమని, జెడ్పీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అవసరమైన బలం తమ పార్టీకి ఉన్నా, దౌర్జన్యంతో టీడీపీ లాక్కోవడానికి పూనుకుని అరాచకాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. దీనిపై ఎన్నికల పరిశీలకునికి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. ఈలోగా కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరిగింది. రెండు స్థానాలను తెలుగుదేశం పార్టీ 28 -27 ఓట్ల తేడాతో గెలుచుకుంది. జెడ్పీ అభ్యర్థిగా టీడీపీ మన్నె రవీంద్రను ఎంపిక చేసింది. దీంతో మొదటి నుంచి చైర్మన్ పదవిని ఆశించిన పొన్నలూరు జెడ్పీటీసీ ఈదర హరిబాబు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మకంగా స్వతంత్ర అభ్యర్థిని బలపరిచింది. ఈ పరిణామంతో టీడీపీ సభ్యులు కంగుతిన్నారు. పార్టీ తరఫున గెలిచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి వీల్లేదంటూ ఆ పార్టీ సభ్యులు అడ్డు తగిలారు. దీనిపై కలెక్టర్ విజయకుమార్ ఎన్నికల కమిషన్‌ను సంప్రదించారు. ఇదే సమావేశం మందిరం నుంచి బయటకు వెళ్లిన మంత్రి శిద్దా రాఘవరావు కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఎన్నికల సంఘం నుంచి ఆమోదం రావడంతో కలెక్టర్ ఎన్నిక నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి మన్నె రవీంద్రకు 27, ఈదర హరిబాబుకు 28 ఓట్లు వచ్చాయి. దీంతో హరిబాబు జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. వైస్ చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీకి చెందిన నూకసాని బాలాజీ గెలుపొందారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగగా ఈదర హరి బాబు మద్దతు ఇవ్వడంతో టీడీపీ అభ్యర్థిపై ఒక ఓటు తేడాతో గెలిచారు. వీరిద్దరితో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
టీడీపీ నుంచి ఈదర సస్పెన్షన్: స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ ఈదర హరిబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ ప్రకటించారు.
ఆదివారం రాత్రి ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీలో నమ్మకంగా ఉంటూ హరిబాబు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం తమను షాక్‌కు గురిచేసిందని చెప్పారు. ఓ ప్రణాళిక ప్రకారమే ఇది జరిగిందన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని హరిబాబునే తీసుకోమని ముందుగా మంత్రి ప్రతిపాదించారని, అప్పుడు ఆయన తిరస్కరించారని చెప్పారు. ఇప్పుడు ఎందుకు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారో అర్థం కావడంలేదన్నారు. పార్టీకి ద్రోహం చేసిన ఈదర హరిబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధిష్టానం నిర్ణయించిందని చెప్పారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కదిరి బాబూరావు, ఏలూరి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.