కడప అర్బన్: రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ప్రక్షాళనకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని ఆ శాఖ జాయింట్ కమిషనర్ (జేటీసీ) ఎస్‌ఏవీ ప్రసాద్‌రావు తెలిపారు. కడప డీటీసీ కార్యాలయంలో ఇటీవల జరిగిన ఐదు లక్షల గల్లంతు సంఘటనపై విచారణ జరిపేందుకు సోమవారం ఆయన స్థానిక డీటీసీ కార్యాలయానికి వచ్చారు. పలు రికార్డులను పరిశీలించడంతో పాటు డీటీసీ శ్రీకృష్ణవేణితో పాటు ఏఓ ఇక్బాల్ అహ్మద్‌ను, సిబ్బందిని విచారించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
డీటీసీ కార్యాలయంలో అసిస్టెంట్ల బెడదను నివారించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రవాణా కార్యాలయానికి నేరుగా వాహనదారులు వచ్చి తమకు కావాల్సిన సేవలను పొందవచ్చన్నారు. స్థానికంగా ఏదైనా పొరపాటు జరిగితే మార్పులు, చేర్పుల కోసం హైదరాబాదులోని ప్రధాన కార్యాలయంలో ప్రాబ్లమ్స్ మేనేజ్‌మెంట్ సర్వీసు (పీఎంఎస్) విభాగాన్ని ఈ ఏడాది ప్రారంభించామన్నారు. ఈ విభాగాన్ని అన్ని రవాణాశాఖ కార్యాలయాలకు ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం చేశామన్నారు. అధికారులందరూ తమకు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలన్నారు. మద్యం సేవించి వాహనాలను నడిపే వారిపై చట్టపరమైన చ ర్యలు తప్పవన్నారు.
రూ. 5 లక్షల గల్లంతుపై సమగ్ర విచారణ
డీటీసీ కార్యాలయంలో అకౌంటెంట్ చక్రపాణి తన బీరువాలో ఉంచి వెళ్లిన రూ. 5 లక్షలు గల్లంతైన సంఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని జాయింట్ కమిషనర్ ప్రసాద్‌రావు తెలిపారు. రూ. 5 లక్షలు ఏ విధంగా మాయమైంది? ఎలా జమ చేసింది? చక్రపాణి పాత్ర ఏ మేరకు ఉంది? అనే విషయాలపై తాము సమగ్రంగా విచారిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీటీసీ శ్రీకృష్ణవేణి, కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ సుబ్రమణ్యం, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రక్షాళన చేస్తాం
Published Tue, Sep 9 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM
Advertisement
Advertisement