
సిక్కోలు సమరాన
ధిక్కార స్వరమొకటి
విశాఖ ఉక్కయిన
ఆంధ్రుల హక్కొకటి
ఎడతెగని సంద్రాన
ఎదురెల్లె నావొకటి
అడిగాయిలే నిన్ను
వంగపండూ– నీ కలము
నుండి జారి పడుకుంటూ
జానెడు కడుపునకై
దారబోసిన చెమట
దేహమే కంజరయి
ధన ధన సప్పుడట
కాళ్లగజ్జెలు ఘల్లు
నెమలితో పోటీపడి
చేతి అందెల మోగె వంగపండు– నీ గుండె చప్పుడును వినుకుంటూ
ఏం పిల్లడోయని
ఎలుగెత్తి పాడినా
ఎల్దమస్తవంటు
రమ్మని అడిగినా
యంత్రాల పాటతో
మంత్రముగ్దుల జేసె
కథ జెప్తవా వింటాను
వంగపండు– నా
రెండు కండ్లు జూస్తె చాలకుండూ
ఎవరు దోసుకు పోని
ఆటపాటల మూట
ఆస్తులుగ పిల్లలకు
పంచిపోయావంట
సీమల దండులో
సిలుకలా గుంపులో
సాగిపోతివ నీవు వంగపండు
వంగె పొద్దులో
వర్ణాలు జూసుకుంటూ
కాలమే కడుపుతో
కన్నకవులెందరో
మేరిమి కొండల్లో
మెరుపులింకెందరో
జముకు జనరాగంగా
అందియలు మోగంగ
ఉర్రూతలూగెనట ఉత్తరాంధ్ర– నీ
చరితనే దేశము చదువుతుండా
సలాములే నీకు వంగపండు – పాట సలాములె నీకు వంగపండు
లాల్‌సలాములే నీకు వంగపండు– ఆట సలాములే నీకు వంగపండు
– మిత్ర
(నేడు విశాఖలో వంగపండు ప్రసాదరావు ప్రథమ వర్ధంతి)
Comments
Please login to add a commentAdd a comment