సమర్థతకు పట్టం
సాక్షి, గుంటూరు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఏకగ్రీవంగా ఎన్నికైన కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభినందన సభ గుంటూరులోని కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో ఆదివారం ఘనంగా జరిగింది. ఉమ్మారెడ్డిని అభినందించేందుకు ఆ పార్టీ రాష్ట్రస్థాయి నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తరలి వచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
తొలుత నగరంపాలెం సెంటర్‌లో ఉన్న దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నాయకులు అక్కడి నుంచి ర్యాలీగా సభా వేదిక వద్దకు వచ్చారు. సభలో ముఖ్యఅతిథి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పెద్దలసభకు అనుభవజ్ఞుడైన డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును ఎన్నుకున్న జిల్లా ప్రజాప్రతినిధులకు, వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తాను వైఎస్సార్‌సీపీలో చేరిన తరువాత తొలిసారిగా ఉమ్మారెడ్డి అభినందన సభలో గుంటూరు ప్రజలను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు.
చంద్రబాబు ఏడాదిపాలనలో రైతులు అధోగతి పాలయ్యారని మండిపడ్డారు. ప్రజాకంఠక పాలన సాగిస్తున్న టీడీపీని తుదముట్టించడానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు కలసి కట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.మరో ముఖ్యఅతిథి ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉమ్మారెడ్డిని ఎమ్మెల్సీ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం హర్షణీయమన్నారు. మండలిలో ప్రజా సమస్యలపై సమర్థంగా పోరాడగలిగిన వ్యక్తి ఉమ్మారెడ్డి అని కొనియాడారు. ఉమ్మారెడ్డి ఎల్లప్పుడూ ప్రజలతో మమే కమై ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారని, పార్టీ బలోపేతానికి సైతం ఆయన చేసిన కృషి అభినందనీయమని అన్నారు.
రాష్ట్ర అధికారప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉమ్మారెడ్డిని ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం జిల్లాకే గర్వకారణమని, ఆయనకు ఎమ్మెల్సీ పదవి చిన్నదే అయినప్పటికీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్యలపై ఆయన సమర్థంగా పోరాడగలరని అన్నారు.మరో అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ రాజకీయాల్లో ఎన్నో ఎదురు దెబ్బలు తిని పెద్దల సభకు ఎన్నికైన ఉమ్మారెడ్డి తన అనుభవాన్ని జోడించి ప్రజా సమస్యలపై పోరాడగలరని చెప్పారు.
మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ గాడితప్పిన పంచాయతీరాజ్ వ్యవస్థపై ఉమ్మారెడ్డి ఎమ్మెల్సీగా పోరాటం చేసే సామర్థ్యం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. వైఎస్సార్ సీపీ శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నిర్వీర్యం అవుతున్న స్థానిక సంస్థలను కాపాడగలిగిన అపార అనుభవం ఉన్న వ్యక్తి ఉమ్మారెడ్డి అని కొనియాడారు. అనంతరం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును గజ పుష్ప మాలతో ఘనంగా సత్కరించి ఒక్కొక్కరుగా వచ్చి అభినందనలు తెలిపి పుష్పగుచ్చాలు అందజేశారు.
అనంతరం సన్మానగ్రహీత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్‌సీపీ తరఫున గెలుపొందిన స్థానిక సంస్థల ప్రజాప్రతిధులంతా సంఘటితంగా ఉన్నారనే సమాచారం తెలిసిన చంద్రబాబు పోటీ పెట్టకుండా వెనక్కు తగ్గారని చెప్పారు. తనకు సహకరించిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, తనను ముక్తకంఠంతో ప్రతిపాదించిన జిల్లా పార్టీ నేతలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మహ్మద్ ముస్తఫా, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, నేతలు కావటి మనోహర్‌నాయుడు, బొల్లా బ్రహ్మనాయుడు, రావివెంకటరమణ, అన్నాబత్తుని శివకుమార్, ఆతుకూరి ఆంజనేయులు, గుదిబండ చిన వెంకటరెడ్డి, దుట్టా రామచంద్రరావు, మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి, దేవెళ్ల రేవతి, లాల్‌పురం రాము, నసీర్ అహ్మద్, మిట్టపల్లి రమేష్, పోలూరి వెంకటరెడ్డి, కావూరి సునిల్‌కుమార్, మొగిలి మధు, సయ్యద్ మాబు, వెంకటరామయ్య, ఉత్తమ్‌రెడ్డి, జలగం రామకృష్ణ, యేళ్ల జయలక్ష్మి, పానుగంటి చైతన్య, బండారు సాయిబాబు, కొత్తా చిన్నపరెడ్డి, శిఖా బెనర్జీ, రూత్‌రాణి, మెట్టు వెంకటప్పారెడ్డి, పురుషోత్తం, కొండా రెడ్డి, అత్తోట జోసఫ్, చింకా శ్రీనివా సరావు, శ్రీకాంత్ యాదవ్, ఝాన్సీ రాణి, బాబు, షేక్ జానీ, యేరువ, ఉప్పుటూరి, కడియాల శ్రీనివాసరావు, తాడేపల్లి మణికంఠ, పాల్గొన్నారు.